అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో 9మందిపై కేసు
కొణిజర్ల: కొణిజర్ల మండలం లింగగూడెం, అమ్మపాలెం పరిధి ఇండోఖతార్ వెంచర్స్‌లో అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించిన ఘటనలో తొమ్మిది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ గుగులోత్ సూరజ్ గురువారం తెలిపారు. గ్రీన్‌ల్యాండ్ వెంచర్స్ యజమానులు నాలుగేళ్ల క్రితం వెంచర్‌లో విల్లాల డెవలప్‌మెంట్ కోసం పొలిశెట్టి గిరికి కొంత స్థలం అప్పగించారు. ఆయన విల్లాలు నిర్మించి అమ్ముతుండగా, గత ఏడాది డిసెంబర్ 28న వెంచర్స్ యజమానులు తనకు తెలియకుండా 64 ప్లాట్లు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారని, అందులో అప్పటికే అమ్మేసిన విల్లాలు కూడా ఉన్నాయని వైరా ఏసీపీ, సబ్ రిజిస్ట్రార్‌కు గిరి ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ అనంతరం ఎం.రాము, ఎం.కిషోర్, కె.శరత్, బి.రాంబాబు, అరవింద్, అజయ్, వసీమ్, రాజా, ఉపేందర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
లారీ ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు
దమ్మపేట: బైక్‌ను లారీఢీకొని యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన మండలంలోని అచ్యుతాపురం క్రాస్ రోడ్డు వద్ద గురువారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం... అశ్వారావుపేట మండలం పేరాయిగూడేనికి చెందిన యువకు డు రమేష్ సత్తుపల్లి మండలం గంగారంలోని ఓ వ్యక్తి వద్ద కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు. గురువారం విధులు ముగించుకుని బైక్‌పై గంగారం నుంచి అశ్వారావుపేటకు బయలుదేరాడు. ఈ క్రమంలో అచ్యుతాపురం క్రాస్ రోడ్డు వద్ద ఎదురుగా వస్తున్న లారీ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో రమేష్‌కు తీవ్రగాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఖమ్మం తరలించారు.
గుండె నొప్పితో సింగరేణి కార్మికుడి మృతి
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని సత్తుపల్లిలోని కిష్టారం ఓసీలో ట్రిప్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న బొడ్డు శ్రీనివాస్(52) గురువారం గుండెనొప్పితో మృతి చెందాడు. అతను ఇండియన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఫెలో షిప్ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా, మేకప్‌మెన్‌గా కూడా పనిచేస్తున్నాడు. గురువారం వార్షికోత్సవం సందర్భంగా సెయింట్ మేరీస్ పాఠశాలలో పిల్లలకు మేకప్ వేసి ఇంటికి వెళ్తూ ఒకేసారి కుప్పకూలిపోయాడు. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment