కమనీయంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామ చంద్ర స్వామివారి దేవస్థానంలో గురువారం రామయ్య నిత్యకల్యాణం వైభవంగా జరిగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లికి వైభవంగా సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి)ఆలయంలో గురువారం అర్చకులు 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. అనంతరం శ్రీ అన్నపూర్ణాసమేత కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో శివరాత్రి వేడుకల ముగింపు సందర్భంగా మూలమంత్ర హోమం, జయాధి హోమం, మహా పూర్ణాహుతి, చూర్ణోత్సవం, త్రిశూల స్నానం, వసంతోత్సవం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు శివసంతోష్‌శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి తదితరులు పాల్గొన్నారు.
మార్చి 31 వరకు పశుగణన
పాల్వంచరూరల్ : జిల్లాలో పశుగణన కార్యక్రమాన్ని మార్చి 31 వరకు పొడిగించినట్లు పశుసంవర్థక శాఖ అధికారి వెంకటేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాది నవంబర్ 25న జిల్లాలో గణన ప్రారంభమై ఫిబ్రవరి 28వరకు ముగియాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే పాడిపశువులు, మేకలు, గొర్రెలు, పందులు, కోళ్లు తదితర లెక్కింపు పూర్తి కాకపోవడంతో గడువు పొడిగించామని వివరించారు.
గురుకులాల్లో మెరుగైన ఫలితాల సాధనకు కృషి
నేలకొండపల్లి: గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఎస్సెస్సీ, ఇంటర్ చదువుతున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని గురుకులాల జోనల్ ఆఫీసర్ కె.స్వరూపా రాణి తెలిపారు. నేలకొండపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను గురువారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టోర్ రూం, కిచెన్‌ను పరిశీలించాక విద్యార్థులతో కలిసి భోజనం చేయగా మెనూ అమలుపై ఆరా తీశారు. అనంతరం జోనల్ ఆఫీసర్ మాట్లాడుతూ భద్రాద్రి జోన్‌లోని ఐదు జిల్లాల గురుకులాల్లో 19,300 మంది విద్యార్థులు చదువుతుండగా నూతన మెనూ అమలులో రాజీ పడకుండా పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపా రు. అలాగే, ఎస్సెస్సీ, ఇంటర్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడానికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ, వెనకబడిన వారిపై మరింత శ్రద్ధ వహిస్తున్నామని చెప్పారు. అలాగే, పరీక్షల వేళ తాజా పండ్లు అందిస్తున్నామని తెలిపారు. కాగా, గురుకులాల్లో ప్రవేశానికి జోనల్ పరిధిలో 25,318 మంది దరఖాస్తు చేసుకోగా 97 శాతం మంది పరీక్ష రాశారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.పద్మావతి, ఉద్యోగి పాకనాటి కన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కమనీయంగా రామయ్య నిత్యకల్యాణం
కమనీయంగా రామయ్య నిత్యకల్యాణం
Comments
Please login to add a commentAdd a comment