చోరి కేసులో ముగ్గురి అరెస్ట్
రూ.7,19,000 నగదు, అర తులం బంగారం రికవరీ
సుజాతనగర్: మండలంలోని సర్వారం గ్రామ పంచాయతీ, హలావత్‌తండాలో ఈ నెల 7వ తేదీన జరిగిన చోరీ కేసులో పోలీసులు బుధవారం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ వివరాలు వెల్లడించారు. హలావత్‌తండాకు చెందిన జర్పుల కిషన్ ఇంట్లో ఈ నెల 7న తలుపులు, బీరువా పగలగొట్టి 5,20,000 నగదుతో పాటు అర తులం బంగారాన్ని కొందరు ఎత్తుకెళ్లారు. కిషన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఎస్‌ఐ ఎం.రమాదేవి వేపలగడ్డ వద్ద బుధవారం వాహన తనిఖీ చేపట్టగా హలావత్‌తండాకు చెందిన జర్పుల నరేశ్ పారిపోయేందుకు యత్నించగా పట్టుకున్నారు. తన బాబాయి అయిన జర్పుల కిషన్ ఇంట్లో తాను చోరీ చేశానని నరేశ్ అంగీకరించాడు. చండ్రుగొండ, సుజాతనగర్, జూలూరుపాడు, కొత్తగూడెం ప్రాంతాల్లో పలు ట్రాన్స్‌ఫార్మర్లను పగలగొట్టి కాపర్ వైర్లను కూడా చోరీ చేశాడని, కాపర్ వైర్లను అతడి వద్ద కొనుగోలు చేసిన మధురబస్తీకి చెందిన బెల్లంకొండ ఈశ్వర్‌రావు, పాల్వంచకు చెందిన కొంచాడ సత్యం కూడా అరెస్ట్ చేశామని డీఎస్పీ తెలిపారు. నరేశ్ వద్ద నుంచి రూ.5 లక్షల నగదుతో పాటు మొబైల్, ఈశ్వర్‌రావు వద్ద నుంచి రూ.19 వేలు, సత్యం వద్ద నుంచి రూ.2 లక్షల నగదును రికవరీ చేసి ముగ్గురిని అరెస్ట్ చేశామని డీఎస్పీ రెహమాన్ వెల్లడించారు. కార్యక్రమంలో సీఐ రాయల వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
జాతరకు వెళ్లి వస్తూ దుర్మరణం
కుటుంబంలో విషాదం నింపిన రోడ్డుప్రమాదం
అశ్వారావుపేటరూరల్: జాతర ఉత్సవాలకు వెళ్లి, తిరిగి స్వగ్రామానికి వస్తున్న క్రమంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ యయాతి రాజు కథనం ప్రకారం.. ఏపీలోని ఏలూరు జిల్లా పోలవరం మండలం శివగిరి గ్రామానికి చెందిన నడికుదురు గోపి (32), స్నేహితుడు అర్జున్‌రెడ్డితో కలిసి మంగళవారం రాత్రి జీలుగుమిల్లిలో జరుగుతున్న జగదాంబ తల్లి జాతరకు వెళ్లారు. తిరిగి తాను నివాసం ఉంటున్న ఏపీలోని జీలుగుమల్లి మండలం రాచన్నగూడేనికి ద్విచక్రవాహనంపై అశ్వారావుపేట మీదుగా వెళ్తున్న క్రమంలో స్థానిక కాకతీయ గేట్ సమీపంలో కాకినాడ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గోపి అక్కడికక్కడే దుర్మరణం చెందగా వెనుక కూర్చున్న అర్జున్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడి తండ్రి నరసింహారావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. జాతరలో సరదగా గడిపిన గోపి.. ఇంటికి వస్తున్న క్రమంలో మృతిచెందటంతో వారి కుటుంబంలో విషాదం నింపింది.
భార్యతో గొడవ పడి భర్త ఆత్మహత్య
పాల్వంచరూరల్: భార్యతో గొడవ పడిన భర్త పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలంలోని పాండురంగాపురం శివారులోని రాజీవ్‌నగర్‌కాలనీకి చెందిన మడివి దేవయ్య (38) మంగళవారం రాత్రి భార్యతో గొడవపడి పురుగులమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు పాల్వంచ ఏరియా ఆస్పత్రికి.. అక్కడి నుంచి కొత్తగూడెం ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు.
తాటి చెట్టు పైనుంచి పడి గీతకార్మికుడి మృతి
ఇల్లెందురూరల్: మండలంలోని పోలారం గ్రామానికి చెందిన గీత కార్మికుడు మోటపోతుల అప్పారావు (40) బుధవారం తాటిచెట్టు పైనుంచి కిందపడి మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. పోలారం గ్రామానికి చెందిన అప్పారావు మర్రిగూడెం గ్రామ పంచాయతీ రామకృష్ణాపురంలో గీత వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజు మాదిరిగా బుధవారం సాయంత్రం తాటి చెట్టు ఎక్కిన అప్పారావు ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. చెట్టుకింద ఉన్న కొయ్యలు గుచ్చుకోవడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేశామని ఎస్‌ఐ సోమేశ్వర్ తెలిపారు.
ఐదుగురిపై కేసు నమోదు
జూలూరుపాడు: తంబోలా ఆడుతూ పట్టుబడిన ఐదుగురిపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. కప్పలకుంట చెరువు సమీపంలో కొందరు ప్రభుత్వం నిషేధించిన తంబోలా ఆడుతున్నారనే సమాచారంతో హెడ్‌కానిస్టేబుల్ దయానంద్, కానిస్టేబుళ్లు దాడి చేసి, ఐదుగురిని అదుపులోకి తీసుకొన్నారు. వారి వద్ద నుంచి రూ.3,500 నగదు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
చోరి కేసులో ముగ్గురి అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment