విద్యార్థులతో యూత్ ఎకో క్లబ్‌ల ఏర్పాటు
● బాల్య దశ నుంచే మొక్కలు, జల సంరక్షణపై అవగాహన ● ప్రభుత్వ పాఠశాలల్లో ఔషధ, పూల మొక్కల పెంపకానికి చర్యలు ● ఉమ్మడి జిల్లాలోని స్కూళ్లకు రూ.79.57 లక్షలు విడుదల
పాల్వంచరూరల్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు జలసంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటైన యూత్ ఎకో క్లబ్ కార్యకలాపాల నిర్వహణకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఇందుకోసం ప్రభుత్వం రాష్ట్రీయ సప్తాహ్ ఆవిస్కార్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. 2024–2025 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు రూ.3 వేల చొప్పున, ప్రాథమికోన్నత, హైస్కూళ్లకు రూ.5 వేల చొప్పున నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
నిధుల వినియోగం ఇలా
ఉమ్మడి జిల్లాకు రూ.79.57 లక్షలు విడుదలయ్యాయి. వీటితో ప్రభుత్వ పాఠశాలల్లో ఔషధ మొక్కలు కరక్కాయ, విప్ప, తిప్పతీగ, కలబంద, రణపాల వంటి మొక్కలు పెంచుతారు. టాల్ ప్లాంటేషన్‌లో ఉసిరి, పనస, మునగ, చింత, కరివేపాకు, కానుగ, మోదుగు, పశువుల దాణాకు ఉపయోపడే అజోల్లా, కిచెన్ గార్డెన్‌లో ఆకుకూరలు, కూరగాయల మొక్కలు, వివిధ రకాల పూలతోటలను పెంచాల్సి ఉంటుంది. స్కూల్ ప్రాంగణంలో ఇంకుడు గుంతలు నిర్మించి వాన నీటి సంరక్షణతోపాటు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు.
భద్రాద్రి జిల్లాలో 1,057 పాఠశాలలకు..
భద్రాద్రి జిల్లాలో 782 ప్రాథమిక పాఠశాలలకు రూ.23.46 లక్షలు, 159 ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.7.95 లక్షలు, 101 హైస్కూళ్లకు రూ.5.5లక్షలు, 15 సెకండరీ హైస్కూళ్లకు రూ.75 వేలు.. మొత్తంరూ.37.25 లక్షలు మంజూరు చేశారు.
ఖమ్మం జిల్లాలో 1,148 పాఠశాలలకు..
ఖమ్మం జిల్లాలోని 752 ప్రాథమిక పాఠశాలలకు రూ.22.56 లక్షలు, 187 ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.9.35 లక్షలు, 194 హైస్కూళ్లకు రూ.9.70 లక్షలు, 15 సెకండరీ హైస్కూళ్లకు రూ.75 వేలు మంజూరు చేశారు. పర్యావరణ, జలసంరక్షణ నిర్వహణలో ఉత్తమ యూత్ ఎకో క్లబ్‌లను ఎంపిక చేసి కలెక్టర్ ప్రశంసా పురస్కారాలు కూడా అందజేస్తారు.
వేసవి సెలవుల్లో విత్తన సేకరణ
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వేసవి సెలవుల్లో ఔషధ మొక్కలు, స్కూల్ గార్డెన్ మొక్కలు, పూలతోటల మొక్కలకు సంబంధించిన విత్తనాలను సేకరించాల్సి ఉంటుంది. వర్షాకాలం సీజన్‌లో ఆయా పాఠశాలల ఆవరణల్లో నర్సరీలో ఏర్పాటు చేసి మొక్కలు పెంచి, అనంతరం నాటి సంరక్షించాల్సి ఉంటుంది.
ప్రోత్సాహకాలు అందిస్తాం
పర్యావరణ పరిరక్షణ, జల సంరక్షణపై విద్యార్థి దశనుంచే అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం రాస్ కార్యక్రమం అమలు చేస్తోంది. ఎకో క్లబ్‌లను విజయవంతంగా నిర్వహించే పాఠశాలలకు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ప్రత్యేక చొరవతో ప్రోత్సాహకాలు అందించనున్నారు. జిల్లాస్థాయిలో రూ. 50 వేలు, మండల స్థాయిలో రూ.5 వేలు, కాంప్లెక్స్ స్థాయిలో రూ.1000 చొప్పున నగదు అందజేస్తాం. ఈ నిధులతో విత్తన సేకరణతోపాటు టబ్బులు, పలుగు, పార కొనుగోలు చేసుకోవచ్చు. జల సంరక్షణకు ప్రతి పాఠశాలలో ఇంకుడు గుంతలు నిర్మించాలి.
–వెంకటేశ్వరాచారి, డీఈఓ