అశ్వాపురం: మండల పరిధిలోని చింతిర్యాల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పద్దం ఎర్రయ్యకు బూర్గంపాడు మండలం సారపాక పుష్కర్ ఘాట్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. బీట్ ఆఫీసర్ ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా పుష్కర్ ఘాట్ వద్ద జామాయిల్ లోడ్‌తో ఉన్న ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో గాయపడగా చికిత్స నిమిత్తం భద్రాచలం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా హెల్మెట్ ధరించి ఉండటంతో ప్రాణాపాయం తప్పింది.
రెండు బైక్‌లు ఢీ : ముగ్గురికి తీవ్ర గాయాలు
ఇల్లెందురూరల్: మండలంలోని బొజ్జాయిగూడెం గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. టేకులపల్లి నుంచి కొమరం శ్రీను, అతని కుమార్తె హేమ బైక్‌పై ఇల్లెందుకు వస్తున్నారు. అదే సమయలో ఇల్లెందు నుంచి మరో బైక్‌పై నరేష్ అనే వ్యక్తి కొత్తగూడెం వెళుతున్నాడు. రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యులు ఖమ్మం సిఫారసు చేశారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
అన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ) : అన్నపురెడ్డిపల్లిలో శుక్రవారం ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సంగసాని నారాయణ (45) తన ఇంటి పక్కనే ఉన్న చిట్టయ్య ఇంటి పెరట్లోని కొబ్బరిచెట్టు ఎక్కాడు. కాయలు కోసే క్రమంలో అడ్డువస్తున్న కొబ్బరిమట్టను నరికాడు. ఆ మట్ట విద్యుత్ తీగలపై పడి విద్యుదాఘాతానికి గురై చెట్టుపై నుంచి కిందపడ్డాడు. చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో ఎర్రగుంట పీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యసిబ్బంది తెలిపారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో బీట్ ఆఫీసర్‌కు గాయాలు