మంత్రి పొంగులేటి
భద్రాచలం : గిరిజనుల సంస్కృతి, వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజేయాలని, భద్రాచలంలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటుతో దీనికి మరింత అవకాశం ఏర్పడిందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భద్రాచలం ట్రైబల్ మ్యూజియం బ్రోచర్‌ను శాసనసభ ఆవరణలో మంత్రి సీతక్కతో కలిసి మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గిరిజన సంప్రదాయాలు, వేషభాషలు, జీవన విధానాన్ని ప్రదర్శించేందుకు మ్యూజియం ఉపకరిస్తుందన్నారు. తద్వారా భద్రాచలం పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా మ్యూజియాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ బి.రాహుల్, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావ్, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య పాల్గొన్నారు.