భద్రాచలంటౌన్/పాల్వంచరూరల్/గుండాల: పాల్వంచ మండలం కిన్నెరసాని, గుండాల మండలం కాచనపల్లిలోని గిరిజన ఆశ్రమ క్రీడా పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశాలు కల్పించేందుకు చివరి దశ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. కిన్నెరసానిలో బాలురకు ప్రవేశాలు కల్పించేందుకు బుధవారం, కాచనపల్లి పాఠశాలలో బాలికలకు ప్రవేశాలు కల్పించేందుకు గురువారం ఆయా పాఠశాలల్లో ఎంపిక పోటీలు ఉంటాయని వెల్లడించారు. డివిజన్ స్థాయిలో ఎంపికై న విద్యార్థినీ, విద్యార్థులే కాక ఆసక్తి ఉన్న వారు నేరుగా పాల్గొనవచ్చని తెలిపారు. విద్యార్థులు స్టడీ సర్టిఫికెట్, ఆధార్ జిరాక్స్, రెండు పాస్‌ఫొటోలు, టీషర్ట్‌తో నిర్ణీత తేదీల్లో ఉదయం 8.30 గంటలకల్లా హాజరుకావాలని వారు సూచించారు. ఈ మేరకు తొమ్మిది రకాల బ్యాటరీ టెస్ట్ ద్వారా ఎంపికలు ఉంటాయని పీఓ వివరించారు.
కొత్తగూడెం ఏరియాలో రికార్డుస్థాయి బొగ్గు రవాణా
సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం ఏరియాలో రికార్డ్‌స్థాయిలో బొగ్గు రవాణా సాధించినట్లు ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలేంరాజు మంగళశారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏరియాలో సోమవారం ఒక్కరోజు 68,056 వేల టన్నుల బొగ్గును రవాణా చేసి రికార్డ్ నెలకొల్పామని, సింగరేణి చరిత్రలో ఏ ఏరియా కూడా ఇప్పటివరకు ఒక్కరోజులో 14 రేకులను రవాణా చేయలేదని పేర్కొన్నారు. సమంత సీహెచ్‌పీలో 10 రేకులు, రుద్రంపూర్‌లోని సీహెచ్‌పీ నుంచి 4 రేకులు రవాణా చేశారని వివరించారు. ఇదే స్ఫూర్తితో వార్షిక లక్ష్యాన్ని సాధించాలని, జీరో యాక్సిడెంట్‌కు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
టేకులపల్లి సంత వేలం రూ.11.60 లక్షలు
టేకులపల్లి: టేకులపల్లి, గోలియాతండా గ్రామ పంచాయతీల సంయుక్త వారాంతపు సంత నిర్వహణకు సంబంధించిన వేలం పాట మంగళవారం టేకులపల్లి పంచాయతీ కార్యాలయంలో జరిగింది. మొత్తం 8 మంది డిపాజిట్ చెల్లించి పాటలో పాల్గొనగా రూ.11.60 లక్షలకు మూడు వాసు కై వసం చేసుకున్నారు. కిందటిసారి 9 నెలలకు గాను సంత వేలం రూ.8 లక్షలకు పాడారు. ప్రస్తుత సంత కాలపరిమితి ఏప్రిల్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఉంటుంది. కార్యక్రమంలో ఎంపీడీఓ జి.రవీందర్‌రావు, ఎంపీఓ జేఎల్ గాంధీ, కార్యదర్శులు ఉప్పు దీప్తి, ప్రశాంత్, సిబ్బంది మూడు బిచ్చు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుడికి
జాతీయ పురస్కారం
పాల్వంచ: స్థానిక డీఏవీ పాఠశాల హిందీ ఉపాధ్యాయుడు ఎంఎస్‌వీ కృష్ణారావును అంబేద్కర్ జాతీయ ప్రతిభా పురస్కారం వరించింది. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 13న గుంటూరులో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డు తనకు అందజేస్తారని కృష్ణారావు మంగళవారం వెల్లడించారు.
ఉపాధ్యాయుడిపై దాడి?
దుమ్ముగూడెం: మండలంలోని పాత జిన్నెలగూడెం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు, కాశీనగరం గ్రామానికి చెందిన విజయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి 8 గంటల సమయాన దాడి చేసినట్టు సమాచారం. పాఠశాలకు అవసరమైన సామగ్రిని ఆటోలో తీసుకెళ్లి దింపి తిరిగివస్తుండగా బురకనగడ్డ సమీపాన ద్విచక్ర వాహనంపై వచ్చిన వ్యక్తులు దాడి చేసినట్టు తెలిసింది. ‘నువ్వు ఎవరో తెలు సు.. ఎందుకు వస్తున్నావో తెలుసు.. ఇంకోసారి ఇటువైపు వస్తే ప్రాణాలు పోతాయి జాగ్రత్త’ అని హెచ్చరించారని, ఈలోగా ఇతరవాహనా లు వస్తుండడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారని సమాచారం. కాగా, విజయ్ గతంలో పోలీస్ శాఖలో విధులు నిర్వర్తించి ప్రస్తుతం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఉపాధ్యాయుడిపై దాడికి కారణం వ్యక్తిగత కక్షలా ఇతర కారణాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.
వడదెబ్బతో రైతు మృతి
టేకులపల్లి: వడదెబ్బతో రైతు మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని మద్రాస్‌తండా పంచాయతీ కొండంగుల బోడు గ్రామానికి చెందిన కేలోతు గోబ్రియా (49) కూరగాయలు, నువ్వులు సాగు చేశాడు. సోమవారం చేనుకెళ్లి ఎండలోనే కూరగాయలు, నువ్వులు కోశాడు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో అస్వస్థతకు గురై ఇంటికొచ్చాడు. మంగళవారం ఉదయం మృతి చెందాడు. మృతుడికి భార్య బుజ్జి, ఒక పాప, బాబు ఉన్నారు. కాంగ్రెస్ నాయకుడు కోరం సురేందర్ తదితరులు మృతదేహాన్ని సందర్శించి సంతాపం తెలిపారు.