
● నిత్యాన్నదానానికి విరాళం
భద్రాచలంటౌన్: రామాలయంలో నిత్యాన్నదాన కార్యక్రమానికి శుక్రవారం భద్రాచలం పట్టణానికి చెందిన మల్లెల వెంకట శ్రీనివాస్–పార్వతి దంపతులు రూ.1,01,116 లక్ష, బీవీ సీతారామరాజు–కృష్ణవేణి దంపతులు రూ.50 వేలు విరాళం అందించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
● 18 ప్రాథమిక చికిత్స కేంద్రాలు..
కొత్తగూడెంఅర్బన్: శ్రీరామనవమి సందర్భంగా భక్తులకు వైద్య సేవలందించేందుకు జిల్లా వ్యాప్తంగా 18 ప్రాథమిక చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ ఎల్.భాస్కర్‌నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 50 మంది వైద్యులు, 217 మంది పారా మెడికల్ సిబ్బందిని నియమించామని, శనివారం నుంచి ఈ నెల 7వ తేదీ వరకు సేవలు కొనసాగుతాయని పేర్కొన్నారు. 5 అంబులెన్స్‌లు, సీపీఆర్ క్వాలిఫైడ్ ఎంఎల్‌హెచ్‌పీఎస్‌ను నియమించామని, ఏరియా ఆస్పత్రుల్లో 50 బెడ్లు, ప్రతి ప్రైవేటు నర్సింగ్ హోంలలో 5 బెడ్లు, అన్ని రకాల గ్రూప్‌ల రక్తం అందుబాటులో ఉంచామని వివరించారు.
● రేపటి నుంచి పునర్వసు దీక్షలు
భద్రాచలంటౌన్: శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో చైత్రమాసాన్ని పురస్కరించుకుని ఈ నెల 6వ తేదీ సాయంత్రం నుంచి శ్రీరామ పునర్వసు దీక్షలు ప్రారంభిస్తామని ఆలయ ఈఓ ఎల్.రమాదేవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పునర్వసు దీక్ష విరమణ, భద్రగిరి ప్రదక్షిణ మే 3న నిర్వహిస్తామని పేర్కొన్నారు. శ్రీరామ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీరామ పునర్వసు దీక్షాధారణ చేయాలని కోరారు.
● నవమికి ముస్తాబైన దర్గా
ఇల్లెందురూరల్: సీతారాముల కల్యాణం, మహా పట్టాభిషేకం వేడుకలకు మండలంలోని హజరత్ నాగుల్‌మీరా దర్గా ముస్తాబైంది. దర్గాలో పద్నాలుగేళ్లుగా ఈ వేడుకలను నిర్వహిస్తుండగా, ఏటా హిందూ ముస్లిం భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతున్నారు. ఈ ఏడాది కూడా దర్గాలో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు దర్గా కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. శనివారం దమ్మక్క వారసుల చేత గోటితో ఒలిచిన తలంబ్రాలను దర్గాలో సమర్పించనున్నారు. 6న కల్యాణం, 7న పట్టాభిషేకం నిర్వహించనున్నారు.