
నాణ్యమైన విద్యుదుత్పత్తి చేయాలి
● జెన్‌కో సీఎండీ సందీప్‌కుమార్ సుల్తానియా ● పాల్వంచ పర్యటనలో ఆద్యంతం ఆంక్షలు
మణుగూరు రూరల్/పాల్వంచ: బీటీపీఎస్, కేటీపీఎస్‌ల నుంచి నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తి చేయాలని టీజీ జెన్‌కో సీఎండీ సందీప్‌కుమార్ సుల్తానియా సిబ్బందికి సూచించారు. మంగళవారం ఆయన మణుగూరు బీటీపీఎస్, పాల్వంచలోని కేటీపీఎస్ ప్లాంట్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలను విద్యుత్ కోతల నుంచి విముక్తి చేసేందుకు, విద్యుత్ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో పలు పవర్ ప్రాజెక్టులు నిర్మిస్తూ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేలా చర్యలు చేపడుతోందన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా చేసేంతగా తెలంగాణ ఎదిగిందని తెలిపారు. కేటీపీఎస్ కాంప్లెక్స్‌లో జెన్‌కో ట్రైనింగ్ సెంటర్‌ను సందర్శించి శిక్షణ పొందుతున్న ఇంజనీర్లతో ముఖాముఖిగా మాట్లాడారు. శిక్షణతో సాంకేతిక పరిజ్ఞానం ఎంత మేర కలిగిందనే అంశంపై ఆరా తీశారు. ఆ తర్వాత కలెక్టర్ జితీష్ వి.పాటిల్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. బీటీపీఎస్ రైల్వే లైన్‌లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం చేయాలని జరుగుతున్న ఆందోళన, తీసుకోవాల్సిన నిర్ణయాలపై కలెక్టర్‌తో చర్చించినట్లు సమాచారం.
ఆంక్షలతో పలువురి అసహనం..
సీఎండీ పర్యటనలో ఆద్యంతం ఆంక్షలు విధించడంతో పలు కార్మిక, ఇంజనీరింగ్ ఉద్యోగ సంఘాల వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సీఎండీ తొలుత గెస్ట్‌హౌస్‌కు చేరుకోగా కవరేజ్ కోసం వెళ్లిన మీడియాను సైతం లోనికి అనుమతించలేదు. ఎంతో కాలంగా విద్యుత్ సంస్థల్లో నెలకొన్న సమస్యలపై సీఎండీని కలిసేందుకు ప్రయత్నించిన సంఘాల వారిని సైతం లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. సీఎండీ పర్యటన గతానికి భిన్నంగా సాగడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఆయా కార్యక్రమాల్లో జెన్‌కో డైరెక్టర్లు అజయ్‌కుమార్, సచ్చిదానందం, బి.లక్ష్మయ్య, కేటీపీఎస్‌చ బీటీపీఎస్ సీఈలు రత్నాకర్, పి.శ్రీనివాసబాబు, ప్రభాకర్ రావు, బి.బిచ్చన్న తదితరులు పాల్గొన్నారు.