
కుక్కల దాడిలో పందెం కోళ్లు మృతి
సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం పట్టణం రామవరంలో వీధి కుక్కలు దాడి చేయడంతో పది పందెం కోళ్లు మృతి చెందాయి. బుధవారం తెల్లవారుజామున 6వ వార్డులో నివాసుముంటున్న రమేష్ పాసి ఇంట్లో వీధి కుక్కలు కోళ్లపై దాడి చేశాయి. దీంతో పది కోళ్లు మృతి చెందాయి. రామవరం ప్రధాన రహదారిలో ఉన్న మటన్, చికెన్ దుకాణాల వద్దపడేసిన వ్యర్థాలకు అలవాటు పడిన వీధి కుక్కలు.. ఆ వ్యర్థాలు దొరకకపోవడంతో కోళ్లపై దాడి చేసి, చంపి తింటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మనుషులపై కూడా దాడి చేస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కలను అరికట్టాలని పలువురు కోరుతున్నారు.
ఇద్దరిపై కేసు నమోదు
పాల్వంచరూరల్: ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరిపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. మండల పరిధిలోని బండ్రుగొండ గ్రామశివారులో డబ్బుల విషయంలో ఇరువర్గాలు చర్చించకుంటున్న క్రమంలో గొడవ తలెత్తిందని ఎస్‌ఐ.సురేష్ తెలిపారు. ఈ క్రమంలో పాకాల వెంకట్రావు, ఖాజాలు తమపై దాడి చేశారని బాధితులు ఇట్టి వెంకట్రావు, నిమ్మల రాంబాబు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
దాడి ఘటనలో ఆరుగురిపై..
పాల్వంచరూరల్: దాడి ఘటనలో పోలీసులు బుధవారం ఆరుగురిపై కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లిలో సెల్‌ఫోన్‌ల్ వాట్సాప్ వీక్షించే క్రమంలో జగన్నాధం రాంబాబు, రవీందర్ మధ్య వాగ్వాదం నెలకొని రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈక్రమంలో రాంబాబు, అనిల్, రాములమ్మలపై రవీందర్, శాంతి, దాసరి లక్ష్మి, అశోక్, అబ్రహం, లక్ష్మి కలిసి గత నెల 9న దాడి చేశారు. బాధితుడు రాంబాబు బుధవారం ఫిర్యాదు చేయగా దాడిచేసిన ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
ద్విచక్రవాహదారుడిపై..
పాల్వంచరూరల్: ప్రమాదానికి కారణమైన ద్విచక్రవాహనదారుడిపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన మాలోత్ భగవాన్ గత నెల 5న ద్విచక్రవాహనంపై వెళ్లి పెద్దమ్మగుడి వద్ద కొబ్బరికాయ తీసుకుని ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో వెనుక నుంచి మరో ద్విచక్రవాహనంపై వేగంగా వస్తున్న మున్నవన్ శ్రీను ఢీకొట్టాడు. దీంతో భగవాన్ తీవ్రంగా గాయపడగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా దెబ్బతినడంతో వైద్యులు క్షతగాత్రుడి కాలును తొలగించారు. బాధితుడి కుమారుడు నరేష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
థియేటర్ అడ్డాగా
ఇసుక వ్యాపారం
ఇల్లెందు: పట్టణంలో మూతపడిన థియేటర్ అడ్డాగా ఇసుక వ్యాపారం సాగిస్తున్నారు. అటవీ ప్రాంతంలోని వాగులు, వర్రెల నుంచి తరలించి ఇసుక అక్రమంగా తరలించి అమ్ముకుంటున్నారు. అటవీశాఖ, పోలీస్, రెవెన్యూ శాఖలను మేనేజ్ చేసి వ్యాపారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ట్రాక్టర్ ఇసుకను రూ.12 వేల వరకు విక్రయిస్తున్నారు. కాగా పూసపల్లి–జెండాల వాగు అటవీ ప్రాంతం నుంచి ఓ ట్రాక్టర్ ద్వారా ఇసుక తరలిస్తుండగా తుడుందెబ్బ ఆధ్వర్యంలో అడ్డుకున్నట్లు ఆ సంఘం నాయకులు తాటి మధు, గుమ్మడి రాంకుమార్ తెలిపారు.
ఇసుక ట్రాక్టర్ సీజ్
పాల్వంచ: అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను బుధవారం తెల్లవారుజామున పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. నాగారం నుంచి ఇసుక తరలిస్తుండగా వెంగళరావు కాలనీ వద్ద పట్టణ పోలీసులు పట్టుకుని స్టేషన్ తరలించారు. కేసు నమోదు చేశారు.

కుక్కల దాడిలో పందెం కోళ్లు మృతి