
జల వనరుల వృద్ధికి చర్యలు
● సింగరేణి ఆధ్వర్యంలో ‘నీటి బిందువు– జలసింధువు’ కార్యక్రమం.. ● త్వరలో సింగరేణి వ్యాప్తంగా 50 చెరువుల ఏర్పాటుకు ప్రణాళిక ● మూతపడిన ఓసీ సంపులను నీటి వనరులుగా మార్చే యోచన
సింగరేణి(కొత్తగూడెం): గనుల పరిసర ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించేందుకు సింగరేణి సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది. రెండు కిలోమీటర్ల పరిధిలో 50 సహజ చెరువులు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. కుంటల్లో నీటి నిల్వకు చర్యలు చేపట్టాలని భావిస్తోంది. భూగర్భ జలాల అభివృద్ధికి సింగరేణి ‘నీటి బిందువు–జల సింధువు’ నినాదంతో పర్యావరణ హిత కార్యక్రమాన్ని చేపట్టనుంది. మైనింగ్ ప్రాంతంలోనూ, ప్రాంతానికి వెలుపల రెండు కిలోమీటర్ల పరిధిలోనూ సకల జీవరాశులకు, పంటలకు నీరందేలా చెరువులను ఏర్పాటు చేయాలని, ప్రస్తుత చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టాలని నిర్ణయించింది. ప్రతీ నీటి బొట్టును సద్వినియోగం చేసేందుకు కృషి చేస్తోంది. పంచాయతీల అనుమతులు తీసుకోని చెరువులను అభివృద్ధి చేయనుంది.
నీటి కుంటలుగా ఓసీ సంపులు
మూతపడిన ఓసీ సంపులను నీటి కుంటలుగా మార్చనుంది. సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనుల్లో బొగ్గు తవ్వగా ఏర్పడిన ఖాళీ సంపుల్లో నీటిశాతం (మట్టాన్ని) పెంచనుంది. తద్వారా సమీప ప్రాంతాల్లో వాటర్ టేబుల్ (నీటిఫలకం)ను వృద్ధి చేసేందుకు, భూగర్భ జలాల పెంపుదలకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఓపెన్ కాస్ట్ గనుల్లో ఓవర్ బర్డెన్‌డంప్‌ల మధ్య ఏర్పడే లోతట్టు ఖాళీ ప్రదేశాలను ఇకపై చిన్నపాటి నీటి తటాకాలుగా తీర్చిదిద్దాలని, వీటిని వర్షపు నీటితో/ఓపెన్‌కాస్ట్ గనుల నుంచి వెలువడే నీటితో నింపాలని భావిస్తోంది.
కార్మికవాడలకు తాగునీరు కూడా..
సింగరేణి భూగర్భ గనుల్లో బొగ్గుతోపాటు వెలువడే నీటిని పైపుల ద్వారా ఫిల్టర్ బెడ్‌లకు పంపించి, శుద్ధి చేసి కార్మిక వాడలకు యాజమాన్యం తాగునీరు సరఫరా చేస్తోంది. సుమారు 130 ఏళ్లుగా ఇదే విధానం అవలంబిస్తోంది. 2018 నుంచి మాత్రం కొన్ని చోట్ల కాలనీల్లో వాటర్ ప్లాంట్‌లు ఏర్పాటు చేసి నీటిని సరఫరా చేస్తోంది. యాజమాన్యం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో శుద్ధమైన నీరు కార్మికులకు అందనుంది.
జీవావరణ పరిరక్షణకు చర్యలు
సింగరేణి ప్రాంతంలో భూగర్భ జలాల వృద్ధికి, ఆ ప్రాంతంలో జీవావరణ పరిరక్షణకు దోహదం చేసే చర్యలు తీసుకుంటాం. పర్యావరణ అనుమతులతో త్వరలో చెరువుల పనులు ప్రారంభిస్తాం. కార్మికులకూ తాగునీటి సమస్య కూడా తీరుతుంది.
–ఎన్.బలరామ్ నాయక్, సింగరేణి సీఎండీ
శుద్ధమైన నీటిని అందించాలి
సింగరేణి వ్యాప్తంగా చెరువులు ఏర్పాటు చేయాలని తీసుకున్న ఈ నిర్ణయం హర్షణీయం. వీలైనంత త్వరలో ఈ కార్యక్రమాన్ని అమలు చేసి, కార్మికులకు తాగునీరు, రైతులకు సాగునీరు అందించాలి. కొత్తగూడెం ఏరియాలో సుమారు6 చెరువులనుఅభివృద్ధి చేయాలి.
–ఎండీ.రజాక్, కార్మిక నాయకుడు

జల వనరుల వృద్ధికి చర్యలు

జల వనరుల వృద్ధికి చర్యలు