
వైభవం.. జలవిహారం
● శ్రీ సీతారాముల వారికి గోదావరిలో తెప్పోత్సవం ● కొనసాగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలు
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ సీతారాముల వారు బుధవారం గోదావరిలో జలవిహారం చేయగా.. ఈ వేడుక అద్భుతంగా సాగింది. తొలుత స్వామి వారి ఉత్సవ మూర్తులను మేళతాళాలు, వేదమంత్రాల నడుమ ఊరేగింపుగా గోదావరి వద్దకు తీసుకొచ్చారు. అలంకరించిన పడవలో స్వామి వారిని కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. ఈఓ రమాదేవి గోదావరి మాతకు పసుపు, కుంకుమ సమర్పించాక స్వామి వారికి జలవిహారం గావించారు. రాత్రికి దొంగల దోపు ఉత్సవాన్ని కనులపండువగా జరిపారు. ఈ వేడుకలో ఆలయ సిబ్బంది వేషధారణలు ఆకట్టుకున్నాయి. అనంతరం స్వామి వారికి అశ్వవాహన సేవ నిర్వహించారు. కాగా, తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఊంజల్ సేవ జరపనున్నారు.