
రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపిక
మణుగూరు టౌన్: మణుగూరు యువకులు జిల్లా స్థాయి పోటీలలో ప్రతిభ చూపి ఈ నెల 19, 20వ తేదీల్లో హైదరాబాద్‌లో జరగబోయే రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికయ్యారని స్కై జిమ్ కోచ్ పొడిశెట్టి నాగరాజు గురువారం తెలిపారు. ఖమ్మంలో 53,72,77 కేటగిరీలలో లక్ష్మణ్, ఖైరుద్దీన్, ఖమర్, హఫీజ్, 93 కేటగిరీలో మాథిన్, 66 కేటిగిరీలో జిమ్ ట్రైనర్ నాగరాజు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా యువకులను పలువురు అభినందించారు.
లారీ ఢీకొని వ్యక్తి మృతి
దమ్మపేట : రోడ్డు దాటుతున్న క్రమంలో లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని గట్టుగూడెం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... సూర్యాపేట జిల్లా కాసరబండ గ్రామానికి చెందిన మచ్చ ఎల్లయ్య (37) మండలంలోని గట్టుగూడెం గ్రామంలో వేరుశెనగ కోత కోసే పనికి వచ్చాడు. గురువారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని వస్తున్న క్రమంలో రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో ఖమ్మం నుంచి అశ్వారావుపేట వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఎల్లయ్యకు తీవ్రగయాలు కాగా, స్థానికులు 108 అంబులెన్స్‌లో సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య
దమ్మపేట : యువకుడి ఆత్మహతపై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని దురదపాడు గ్రామానికి చెందిన గీగా శివ (28) పంపు ఆపరేటర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అప్పులపాలు కావడంతో బుధవారం భార్యతో గొడవ జరిగింది. దీంతో క్షణికావేశంలో అదే రోజు ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు దుప్పటితో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని అదనపు ఎస్సై బాలస్వామి తెలిపారు.
భూ వివాదంలో
ఇరువర్గాల ఘర్షణ
అశ్వాపురం: మండల పరిధిలోని రామచంద్రాపురంలో భూ వివాదంలో గురువారం ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. గ్రామంలో 190/1 సర్వే నంబర్‌లో ఎకరం 20 కుంటల భూమిపై గ్రామస్తులకు, సారపాకకు చెందిన కనకమేడల హరిప్రసాద్ కుటుంబసభ్యులకు ఏళ్లుగా వివాదం నెలకొంది. గ్రామ కంఠం భూమి అని రెవెన్యూ అధికారులు నిర్ధారించి గ్రామ పంచాయతీకి అప్పగించారని గ్రామస్తులు చెబుతుండగా, తమకు తాత ముత్తాల నుంచి వారసత్వంగా వచ్చిన భూమి అని హరిప్రసాద్ కుటుంబీకులు చెబుతున్నారు. హైకోర్టును ఆశ్రయించగా, తనకు అనుకూలంగా ఆర్డర్ ఇచ్చిందని గురువారం హరిప్రసాద్ తన అనుచరులతో జేసీబీని తీసుకుని వచ్చాడు. భూమికి ఫెన్సింగ్ వేసే ప్రయత్నం చేయగా రామచంద్రాపురం గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. హరిప్రసాద్ అనుచరుడి కారు అద్దాలు పగిలాయి. సీఐ అశోక్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పి పంపించారు. ఈ క్రమంలో సివిల్ డ్రస్‌లో ఉన్న సీఐ గన్‌మెన్ రమేష్‌ను హరిప్రసాద్ అనుచరుడిగా భావించి అతనిపై ఓ వ్యక్తి చేయి చేసుకోగా, గ్రామస్తులు నిలువరించారు. అనంతరం ఇరువర్గాలు అశ్వాపురం పోలీస్‌స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి.
ఆక్రమిత భూముల్లో జామాయిల్ నరికివేత
అశ్వారావుపేట: ఆక్రమిత అటవీ భూముల్లో సాగవుతున్న జామాయిల్ తోటలను ఆక్రమణదారులు నరికివేశారు. వినాయకపురం అటవీ ప్రాంతంలోని దమ్మపేట రేంజ్ తిరుమలకుంట సెక్షన్ దిబ్బగూడెం బీట్‌లో అడవులను ఆక్రమించుకుని కొందరు కార్పొరేట్ వ్యవసాయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఈ నెల 3న ‘అటవీ భూమి ఆక్రమణ’అనే శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. మరుసటి రోజు దమ్మపేట రేంజ్ అధికారి కరుణాకరాచారి విచారణ నిర్వహించి ఆక్రమణలు ఖాళీ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. కానీ ఏ ఒక్కరిపైనా కేసులు నమోదు చేయలేదు. పైగా అటవీభూమిలో ఉన్న సంపద ప్రైవేటు వ్యక్తులు తరలించుకుపోతున్నా అటవీశాఖాధికారులు పట్టించుకోవడంలేదు. అటవీశాఖ, రెవెన్యూ శాఖకు చెందిన కొందరు అధికారులు సైతం అటవీ భూములను ఆక్రమించుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా అటవీశాఖకు చెందిన ఓ అధికారి భోరోసాతోనే జామాయిల్ నరుకుతున్నట్లు సమాచారం. దీనిపై ఓ బీట్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేయగా దురుసుగా సమాధానం చెప్పారని సమీప రైతులు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై దమ్మపేట రేంజ్ అధికారి కరుణాకరాచారిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులో లేరు.