
గాలిదుమారానికి నేలరాలిన మామిడి
అశ్వారావుపేటరూరల్: అకాల గాలిదుమారం, వర్షం కారణంగా మామిడి, పొగాకు రైతాంగానికి తీరని నష్టం వాటిల్లింది. మండలంలోని వినాయకపురం, మల్లాయిగూడెం, తిరుమలకుంట, మామిళ్లవారిగూడెం, ఆసుపాకతోపాటు పలు గ్రామాల్లో గురువారం అర్ధరాత్రి సమయంలో వచ్చిన గాలి దుమారం కారణంగా సుమారు 150 ఎకరాల్లో మామిడి కాయలు నేలరాలాయి. మరో 50 ఎకరాల్లో మామిడి చెట్ల కొమ్మలు విరిగిపోయాయి. పసుపులేటి సుబ్బారావుకు చెందిన తోటలో సుమారు 15 టన్నుల మామిడి కాయలు నేలరాలాయి. మల్లాయిగూడెంలో ఉప్పల దుర్గప్రసాద్‌కు చెందిన 10 ఎకరాల మామిడి తోటలో వందల సంఖ్యలో కాయలు రాలిపోవడంతోపాటు కొమ్మలు విరిగిపడ్డాయి. అశ్వారావుపేటలోని శివయ్యబజార్ వద్ద కొబ్బరి చెట్టు విరిగి, రోడ్డుకు అడ్డంగా పడింది. మండలంలోని చెన్నాపురం –గాండ్లగూడెం మార్గంలో ఉన్న విద్యుత్ స్తంభాలు విరిగిపోగా, వైర్లు తెగిపోవడంతో పలు గిరిజన గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచింది. ఆయా గ్రామాల్లో తాగునీటి పథకాల బోర్లు పని చేయక గిరిజనులు తాగునీటి కోసం అవస్థ పడ్డారు.

గాలిదుమారానికి నేలరాలిన మామిడి