కంపెనీలో పనిచేస్తున్న చిరుద్యోగి మొదలు నాయకత్వ స్థానంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారిపై పనిఒత్తిడి ఉంటుంది. కానీ అది వారి స్థాయులను బట్టి మారుతోంది. కంపెనీ దానికి సంబంధించిన రంగంలో దూసుకుపోతుంటే ఇంకా మార్జిన్లు పెంచాలనే ధోరణి కనిపిస్తోంది.
ఒకేవేళ మార్కెట్లో కంపెనీ స్థానాన్ని కోల్పోతే తిరిగి పునరుద్ధరించే దిశగా పనిచేయాలని ఒత్తిడి ఉంటుంది. ఏటా పెరుగుతున్న టార్గెట్‌లు, పనితీరులో అసహనం, సంక్లిష్టమైన వ్యాపార వాతావరణం, ప్రతిభ కోసం పాకులాట వంటి వివిధ ఒత్తిళ్ల కారణంగా కంపెనీలోని అగ్రశ్రేణి నాయకత్వంలో పని చేస్తున్న వారి రాజీనామాలు పెరుగుతున్నాయి. గడిచిన పది నెలల్లో ఏకంగా 110 మంది సీఈవోలు వారి పదవుల నుంచి వైదొలిగినట్లు సమాచారం.
కొవిడ్ తర్వాత భారతదేశంలోని కంపెనీలు సీఈవో, ఎండీ స్థాయి ఉద్యోగులు రాజీనామా చేస్తున్న ధోరణి గణనీయంగా పెరిగింది. 2023 మొదటి 10 నెలల సమయంలో ఎన్‌ఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల బోర్డుల్లో పనిచేస్తున్న 110 మంది మేనేజింగ్ డైరెక్టర్లు లేదా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు తమ పదవుల నుంచి వైదొలిగారు. 2023లో నమోదైన పదవుల నిష్క్రమణలో అధికంగా రాజీనామాల వల్లే జరిగినట్లు డేటా వెల్లడిస్తోంది. అగ్రనాయకత్వంపై కంపెనీల్లో పెరిగిపోతున్న అంచనాలు, ఆ అంచనాలు అందుకోకపోతే వారి పనితీరుపై అసహనం, సంక్లిష్టమైన వ్యాపార వాతావరణం వంటి వివిధ ఒత్తిళ్లతో అగ్రశ్రేణి రాజీనామాలు హెచ్చవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: మరో నెలలో రూ.625 కోట్లు నష్టం.. ఎవరికీ.. ఎందుకు.. ఎలా?
మహమ్మారి సమయంలో కంపెనీలు మారితే ఆ స్థాయిలోని వారిని ఇతర సంస్థలు వెంటనే తీసుకునే పరిస్థితి లేకుండాపోయింది. దాంతో అప్పుడు ఎక్కువ రాజీనామాలు జరగలేదు. కొవిడ్‌తో దాదాపు ఏడాదికిపైగా కంపెనీలు ఆర్థిక అనిశ్చుతులు ఎదుర్కొన్నాయి. దాంతో ప్రస్తుత పరిస్థితుల్లో మార్జిన్లు, టార్గెట్లు పెంచి ఎండీ/ సీఈఓలపై ఒత్తిడి పెంచుతుండడంతో ఈ రాజీనామాలు అధికమవుతున్నట్లు తెలుస్తోంది. దాంతోపాటు అదే రంగంలోని ఇతర కంపెనీలు నైపుణ్యాలు ఉన్న అగ్రశ్రేణి నాయకత్వానికి మంచి ప్యాకేజీ ఆఫర్ చేస్తున్నాయి. కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సీఈవోల రాజీనామాలు పెరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment