స్టాక్ మార్కెట్లో లిస్టైన తొలిరోజే కొన్ని కంపెనీలు మంచి లాభాలను ఇన్వెస్టర్లకు ఇచ్చాయి. కరోనా కల్లోల పరిస్థితులు ఉన్నా చాలా కంపెనీల ఐపీఓలు వంద రెట్లకు పైగా సబ్‌స్క్రై బయ్యాయి. అంతే కాకుండా రెట్టింపునకు పైగా లిస్టింగ్ లాభాలను సాధించాయి. హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్(హెచ్‌ఎన్‌ఐ)లకు కాసుల వర్షం కురిపించాయి. ఈ ఏడాది ఐపీఓకు వచ్చిన కొన్ని కంపెనీల లిస్టింగ్ లాభాలపై సాక్షి బిజినెస్ స్పెషల్ స్టోరీ....
కరోనా కల్లోలం ఈ ఏడాది అన్ని దేశాల అర్థిక స్థితిగతులను అల్లకల్లోలం చేసింది. కానీ ఈ ఏడాది స్టాక్‌మార్కెట్లో అరంగేట్రం చేసిన కంపెనీలు తొలి (లిస్టింగ్)రోజు భారీ లాభాలను ఇన్వెస్టర్లకు పంచాయి. గత పదేళ్ల కాలంలో చూస్తే, ఈ ఏడాది చివరి ఆరునెలల్లో కంపెనీలు లిస్టింగ్ రోజు అత్యధిక లాభాలను(సగటున 36 శాతం మేర) ఇచ్చాయి. తొలి రోజు లిస్టింగ్ లాభాల విషయంలో 2020 తర్వాత 2007 నిలిచింది. ఆ ఏడాది తొలిరోజు సగటు లిస్టింగ్ లాభాలు 29 శాతంగా ఉన్నాయి. ఇక ఈ ఏడాది మొత్తం ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)లపై సగటు లాభాలు 61 శాతంగా ఉండగా, 2007లో మాత్రం 90 శాతంగా ఉన్నాయి.
ఈ ఏడాది ఇప్పటివరకూ మొత్తం 16 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.27,000 కోట్ల మేర నిధులను సమీకరించాయి. గత ఏడాది 16 కంపెనీలు రూ.12,363 కోట్లు రాబట్టాయి. 2018లో మొత్తం 24 కంపెనీలు ఐపీఓకు వచ్చాయి. రూ.30,959 కోట్లు సమీకరించాయి. సోమవారం నాడు మొదలైన ఆంటోని వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ ఐపీఓ ఈ నెల 27న ముగుస్తుంది. ఈ ఏడాదికి ఇదే ఆఖరి ఐపీఓగా నిలవనుంది.
లిస్టింగ్... డబుల్ ధమాకా
బర్గర్ కింగ్, హ్యాప్పియెస్ట్ మైండ్ షేర్లు లిస్టింగ్ రోజు రెట్టింపు లాభాలను సాధించాయి. రూట్‌మొబైల్, రోసారి బయోటెక్, కెమ్‌కాన్ స్పెషాల్టీ షేర్ల లిస్టింగ్ లాభాలు 70 శాతం నుంచి 90 శాతం రేంజ్‌లో ఉన్నాయి. ఇక గురువారమే స్టాక్ మార్కెట్లో లిస్టయిన మిసెస్ బెక్టర్స్ ఫుడ్ స్పెషాల్టీస్ షేర్లు వంద శాతానికి పైగా లాభపడ్డాయి. ఈ ఏడాది స్టాక్ మార్కెట్లో అరంగేట్రం చేసిన చివరి కంపెనీ ఇదే.
హెచ్‌ఎన్‌ఐల హవా....
దేశీయ బ్రోకరేజ్ సంస్థలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు(ఎన్‌బీఎఫ్‌సీ) హైనెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్(హెచ్‌ఎన్‌ఐ)లకు ఆకర్షణీయమైన వడ్డీరేట్లకు రుణాలిచ్చాయని, ఈ మొత్తాలను హెచ్‌ఎన్‌ఐలు ఐపీఓలో ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు గడించారని నిపుణులంటున్నారు. ఇటీవలి ఐపీఓలు సక్సెస్ కావడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణమని వారంటున్నారు. ఇటీవలే ఐపీఓకు వచ్చిన మిసెస్ బెక్టర్స్ ఫుడ్ స్పెషాల్టీస్ కంపెనీకి సంబంధించి హెచ్‌ఎన్‌ఐ కేటగిరీ వాటా 621 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. దాదాపు రూ.50,650 కోట్ల విలువైన బిడ్‌లు ఈ కేటగిరీ నుంచే దాఖలయ్యాయి. షేర్ ఖాన్, జేఎమ్ ఫైనాన్షియల్, బజాజ్, మోతీలాల్ ఓస్వాల్ తదితర 10 బ్రోకరేజ్ సంస్థలు రూ.40,000 కోట్లు మేర ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేశాయని సమాచారం. లిస్టింగ్ లాభాల నుంచి హెచ్‌ఎన్‌ఐలకు ప్రయోజనం కలుగుతుందని, వారికి రుణాలిచ్చిన సంస్థలకు 3–4 శాతం మేర లాభం ఉంటుందని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ వర్గాలంటున్నాయి.
5 కంపెనీలు 150 రెట్లు...
ఈ ఏడాది 5 కంపెనీల ఐపీఓలు 150 రెట్లకు పైగా ఓవర్ సబ్‌స్క్రైబయ్యాయి. మిసెస్ బెక్టర్ ఫుడ్ స్పెషాల్టీస్, మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్, బర్గర్ కింగ్ ఇండియా, హ్యాప్పియెస్ట్ మైండ్ టెక్నాలజీస్, కెమ్‌కాన్ స్పెషాల్టీ కెమికల్స్ ఐపీఓలు 150–200 రెట్ల రేంజ్‌లో ఓవర్ సబ్‌స్క్రైబయ్యాయి. ఈ ఏడాది ఐపీఓకు వచ్చిన కంపెనీల్లో కరోనా ప్రభావం పడని రం గాల కంపెనీలకు ఇన్వెస్టర్లు బ్రహ్మరథం పట్టారు. టెక్నాలజీ, ప్రత్యేక రసాయనాలు, తదితర కంపెనీలపై కరోనా ప్రభావం పెద్దగా పడలేదు. ఈ రంగాలకు సంబంధించిన కంపెనీల ఐపీఓలకు ఇన్వెస్టర్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఇలాంటి కంపెనీలపై రిటైల్ ఇన్వెస్టర్లే కాకుండా అంతర్జాతీయ సావరిన్, పెన్షన్ ఫండ్స్ కూడా భారీగానే ఇన్వెస్ట్ చేశాయి.
మిసెస్ బెక్టర్స్ ఫుడ్ బంపర్ లిస్టింగ్
న్యూఢిల్లీ: మిసెస్ బెక్టర్స్ ఫుడ్ స్పెషాల్టీస్ షేర్లు లిస్టింగ్‌లో దుమ్ము రేపాయి. ఈ షేర్ బీఎస్‌ఈలో ఇష్యూ ధర, రూ.288తో పోల్చితే 74% లాభంతో రూ.501 వద్ద లిస్టయింది. ఇంట్రాడేలో 109% లాభంతో రూ.601 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 107% లాభంతో రూ.596 వద్ద ముగిసింది. గురువారం మార్కెట్ ముగిసేసరికి ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,499 కోట్లుగా ఉంది. బీఎస్‌ఈలో 37.81 లక్షలు, ఎన్‌ఎస్‌ఈలో 3.7 కోట్ల షేర్లు ట్రేడయ్యా యి. ఇటీవలే ముగిసిన ఈ ఐపీఓ 198 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. ఈ కంపెనీ మిసెస్ బెక్టర్స్ క్రిమికా, ఇంగ్లిష్ ఓవెన్ బ్రాండ్లతో బిస్కెట్లు, బ్రెడ్డు, బన్‌లను తయారు చేస్తోంది.
ఐపీ‘వావ్’!
Published Fri, Dec 25 2020 12:38 AM | Last Updated on Fri, Dec 25 2020 2:09 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment