స్టార్టప్‌లకు సంబంధించి అంతర్జాతీయంగా మూడో స్థానంలో భారత్‌లో యూనికార్న్‌ల (1 బిలియన్ డాలర్లకు పైగా వేల్యుయేషన్ గల అంకుర సంస్థలు) సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇటీవల కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ఆరు అంకుర సంస్థలు యూనికార్న్‌ల హోదా అందుకున్నాయి. ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫాం గ్రో సుమారు 1 బిలియన్ డాలర్లకు పైగా వేల్యుయేషన్‌తో నిధులు సమీకరించింది. మెసేజింగ్ బాట్స్ స్టార్టప్ సంస్థ గప్‌షప్ 1.4 బిలియన్ డాలర్ల స్థాయిని అందుకుంది.
డిజిటల్ ఫార్మసీ ఏపీఐ హోల్డింగ్స్ 1.5 బిలియన్ డాలర్లు, యాప్ డెవలపర్ మొహల్లా టెక్ 2.1 బిలియన్ డాలర్లు, సోషల్ కామర్స్ స్టార్టప్ మీషో 2.1 బిలియన్ డాలర్లు, ఫైనాన్షియల్ టెక్నాలజీ సేవల సంస్థ క్రెడ్ 2.2 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ దక్కించుకోవడం దేశీ స్టార్టప్‌ల సత్తాను చాటుతోంది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ సీబీ ఇన్‌సైట్స్ ప్రకారం 2020లో కొత్తగా ఏడు యూనికార్న్‌లు పుట్టుకురాగా, 2019లో ఆరు అంకుర సంస్థలు యూనికార్న్‌లుగా ఎదిగాయి. ప్రస్తుతం దేశీయంగా మొత్తం యూనికార్న్‌ల సంఖ్య 40 దాకా ఉన్నట్లు అంచనా. ఇదే ఊపు కొనసాగితే 2021 ముగిసే నాటికి ఈ సంఖ్య 50ని కూడా దాటేసే అవకాశం ఉందంటూ దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ అంచనా వేస్తోంది.
సిద్ధమవుతున్న మరో ఆరు అంకురాలు .
రాబోయే కొన్ని నెలల్లో కొత్తగా మరో ఆరు స్టార్టప్ సంస్థలు యూనికార్న్‌లుగా మారేందుకు సిద్ధంగా ఉన్నాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. కోవిడ్–19 మహమ్మారి ధాటితో దేశీయంగా ఆన్‌లైన్ టెక్నాలజీల వినియోగం భారీగా పెరిగింది. కరోనా వైరస్ కట్టడి కోసం కఠినతరమైన లాక్‌డౌన్‌లు అమలు చేసిన గతేడాది ఏకంగా 1,600 పైచిలుకు కొత్త స్టార్టప్‌లు ఏర్పడ్డాయి. దీనితో దేశీయంగా మొత్తం స్టార్టప్‌ల సంఖ్య 12,500కి చేరినట్లు ఈ ఏడాది జనవరిలో నాస్కామ్ ఓ నివేదికలో వెల్లడించింది. వీటిలో సుమారు 55 స్టార్టప్‌లు త్వరలోనే యూనికార్న్‌ల స్థాయికి ఎదిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. అమెరికాలో స్టార్టప్‌లకు కేంద్రంగా ఉంటున్న సిలికాన్ వేలీ తరహాలోనే ఇక్కడ కూడా బడా స్టార్టప్‌లలో పనిచేసిన ఉద్యోగులు ఆ అనుభవంతో తమ సొంత సంస్థలను ఏర్పాటు చేస్తున్నారు. విజయవంతంగా నిష్క్రమించిన ఎంట్రప్రెన్యూర్లు కొత్తగా మరో స్టార్టప్ ఏర్పాటులో నిమగ్నమవుతున్నారు.
సత్తా చాటుతున్న స్టార్టప్‌లు..
డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం పేటీఎం 16 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో దేశీయంగా అత్యంత విలువైన స్టార్టప్‌గా మారగా, ఆన్‌లైన్–ఎడ్యుకేషన్ స్టార్టప్ సంస్థ బైజూస్ 15 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో ఇటీవలే నిధులు సమీకరించింది. అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ 35 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసిన ఈ–కామర్స్ దిగ్గజం త్వరలో పబ్లిక్ ఇష్యూకి వచ్చే ప్రణాళికల్లో ఉంది. భారత్‌లో ఈ–కామర్స్ మొదలుకుని ఫిన్‌టెక్, ఎడ్యుకేషన్, లాజిస్టిక్స్, ఫుడ్–డెలివరీ దాకా వివిధ విభాగాల్లో అసంఖ్యాకంగా యూనికార్న్‌లు ఉన్నాయని, వీటి మొత్తం మార్కెట్ విలువ 240 బిలి యన్ డాలర్లకు పైగా ఉంటుందని క్రెడిట్ సూసీ గ్రూప్ ఏజీ ఈ మధ్య ఒక నివేదికలో లెక్కగట్టింది.
పుష్కలంగా నిధులతో ఇన్వెస్టర్లు..
వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఆకర్షించడంలో అమెరికా, చైనాతో పోలిస్తే భారత స్టార్టప్‌లు చాలా వెనుకబడే ఉంటున్నాయి. 2020 గణాంకాలు చూస్తే అమెరికన్ స్టార్టప్‌లు 143 బిలియన్ డాలర్లు సమీకరించగా, చైనా అంకుర సంస్థలు 83 బిలియన్ డాలర్లు అందుకున్నాయి. కానీ దేశీ స్టార్టప్‌లకు సంబంధించి 11.8 బిలియన్ డాలర్ల విలువ చేసే డీల్స్ మాత్రమే కుదిరాయి. అయితే, దేశీ స్టార్టప్ సంస్థల్లో పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్, దక్షిణాఫ్రికా సంస్థ నాస్పర్స్ వంటి అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ దిగ్గజాలు ఆసక్తి చూపుతున్నాయి. వీటి దగ్గర పుష్కలంగా నిధులు ఉన్నాయని కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ వర్గాలు తెలిపాయి. ఇటీవలి కాలంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం, చౌక ఇంటర్నెట్ సేవల విస్తృతి వంటి అంశాలు కొత్త తరం ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ఊతంగా ఉంటున్నాయని వివరించాయి.
సులువుగా 200 మిలియన్ డాలర్ల సమీకరణ..
అయిదేళ్ల క్రితం 20 మిలియన్ డాలర్ల సమీకరణ రౌండ్లు గొప్పగా ఉండేవని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అయితే, ప్రస్తుతం స్టార్టప్‌లు అత్యంత వేగంగా ఎదుగుతున్నాయని.. ప్రతీ విడతలో అలవోకగా 100 మిలియన్ డాలర్లు.. 200 మిలియన్ డాలర్లు సమీకరించడం సాధారణ విషయంగా మారిపోతోందని వివరించాయి. ఇక ఇన్వెస్టర్లు ప్రతీ నెలా కొన్ని వందల సంఖ్యలో స్టార్టప్‌లను మదింపు చేస్తున్నారని తెలిపాయి.
9యూనికార్న్స్ రూ. 298 కోట్ల సమీకరణ
న్యూఢిల్లీ: ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్‌లకు ఆర్థిక తోడ్పాటు అందించే యాక్సిలరేటర్ ఫండ్ ద్వారా మూడో విడతలో 40 మిలియన్ డాలర్లు (రూ. 298 కోట్లు) సమీకరించినట్లు 9యూనికార్న్స్ సంస్థ వెల్లడించింది. దీనితో మూడో విడత సమీకరణ పూర్తయినట్లు పేర్కొంది. ఈసారి దేశ, విదేశాలకు చెందిన పలు దిగ్గజ పారిశ్రామికవేత్తలు, వ్యాపార సంస్థలు ఇన్వెస్ట్ చేసినట్లు వివరించింది. ఇండియన్ బ్యాంక్, హల్దీరామ్స్ తదితర సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు 9యూనికార్న్స్ తెలిపింది. మొత్తం ఫండ్ 70 మిలియన్ డాలర్లని (సుమారు రూ.520 కోట్లు) పేర్కొంది..
బోట్‌లో క్వాల్‌కామ్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: కంన్యూమర్ టెక్ ప్రొడక్ట్స్ బ్రాండ్ బోట్ తాజాగా క్వాల్‌కామ్ వెంచర్స్ నుంచి నిధులు సమీకరించింది. క్వాల్‌కామ్‌కు చెందిన పెట్టుబడి కంపెనీ క్వాల్‌కామ్ వెంచర్స్ ఎంత ఇన్వెస్ట్ చేసిందీ వెల్లడించలేదు. భారత్‌తోపాటు అంతర్జాతీయ విపణి కోసం కొత్త ఆడియో, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులు, పరిశోధన, అభివృద్ధికి, తయారీ సామర్థ్యం పెంపునకు ఈ నిధులను వెచ్చించనుంది. సాంకేతిక సహకారం, ఆర్‌అండ్‌డీ సామ ర్థ్యం పెంపునకు బోట్ తెలిపింది. 2021 జనవరిలో ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం వార్‌బర్గ్ పింకస్ నుంచి సుమారు రూ.730 కోట్లను బోట్ సమీకరించింది.
Comments
Please login to add a commentAdd a comment