న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 4 రెట్లుపైగా ఎగసి రూ. 507 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 121 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం దాదాపు రెట్టింపై రూ. 2988 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 1,587 కోట్ల ఆదాయం ప్రకటించింది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 973 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 100 శాతం వృద్ధికాగా.. 2021–22లో రూ. 489 కోట్ల లాభం మాత్రమే నమోదైంది.
ఇదీ చదవండి: FASTag Record: ఒక్క రోజులో రూ.1.16 కోట్లు.. ఫాస్ట్‌ట్యాగ్ వసూళ్ల రికార్డు
మొత్తం ఆదాయం రూ. 5,548 కోట్ల నుంచి రూ. 8,633 కోట్లకు జంప్ చేసింది. ఇంధన విక్రయాలు 58 శాతం పుంజుకుని 14,880 మిలియ న్ యూనిట్లకు చేరాయి. సామర్థ్య విస్తరణ ఇందుకు సహకరించింది. గతేడాది 2,676 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని జత చేసుకుంది. వినీత్ ఎస్.జైన్ 2023 మే 11 నుంచి ఎండీగా కొనసాగనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇప్పటివరకూ సీఈవో, ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఫలితాల నేపథ్యంలో అదానీ గ్రీన్ షేరు ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 3 శాతం బలపడి రూ. 977 వద్ద ముగిసింది.
అదానీ గ్యాస్ లాభంలో వృద్ధి
పట్టణాల్లో సీఎన్‌జీ, పైప్డ్ గ్యాస్ సేవలు అందించే అదానీ టోటల్ గ్యాస్, మార్చితో ముగిసిన త్రైమాసికానికి రూ.98 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి వచ్చిన రూ.81 కోట్లతో పోలిస్తే 21 శాతం వృద్ధి చెందింది. విక్రయాల పరిమాణం 2 శాతం పెరిగి 193 మిలియన్ స్టాండర్డ్ క్యుబిక్ మీటర్లుగా ఉంది. కొత్తగా 126 సీఎన్‌జీ స్టేషన్లు ఏర్పాటు చేయడంతో మొత్తం సీఎన్‌జీ స్టేషన్ల సంఖ్య 460కు చేరుకుంది. పైపుల ద్వారా గ్యాస్ అందించే కనెక్షన్ల సంఖ్య 1.24 లక్షలు పెరిగింది. దీంతో మొత్తం పైప్డ్ గ్యాస్ కనెక్షన్లు 7.04 లక్షలకు చేరాయి. పారిశ్రామిక, వాణిజ్య కనెక్షన్లు 7,435కు పెరిగాయి. 2022–23 పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంస్థ రూ.4,683 కోట్ల ఆదాయంపై రూ.546 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ప్రకటించింది.
ఇదీ చదవండి: ఆన్‌లైన్ గేమింగ్‌పై పన్నులు.. ఖరారైతే మరిన్ని పెట్టుబడులు
Comments
Please login to add a commentAdd a comment