
పర్సనల్ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల దిగుమతులకు లైసెన్స్ తప్పనిసరి చేసిన భారత ప్రభుత్వం ఇప్పుడు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై కూడా అలాంటి ఆంక్షలు విధించే ఆలోచనలో ఉంది. ఈ ఉత్పత్తులలో కెమెరాలు, ప్రింటర్లు, హార్డ్ డిస్క్‌లు, టెలిఫోనిక్, టెలిగ్రాఫిక్ పరికరాల భాగాలు ఉండవచ్చని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.
ఆ నివేదిక ప్రకారం, స్థానిక మార్కెట్‌లో ఈ ఉత్పత్తులకు అత్యధిక డిమాండ్ ఉండటంతో విదేశాల నుంచి పెద్డఎత్తున దిగుమతులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ ఉత్పత్తి అవకాశాలను ప్రోత్సహించాలంటే ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని దీనిపై అవగాహన ఉన్న వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ వస్తువుల దిగుమతులు 2023 ఆర్థిక సంవత్సరంలో 10.08 బిలియన్ డాలర్లను అధిగమించాయి.
ఇతర వస్తువులపైనా సమీక్ష!
పైన పేర్కొన్న ఉత్పత్తులతో పాటు, అధిక దిగుమతి అవుతున్న ఇతర వస్తువులను ప్రభుత్వం సమీక్షిస్తున్నట్లు సమాచారం. వీటిలో యూరియా, యాంటీబయాటిక్స్, టర్బో-జెట్‌లు, లిథియం-అయాన్ అక్యుమ్యులేటర్‌లు, శుద్ధి చేసిన రాగి, యంత్రాలు, యాంత్రిక ఉపకరణాలు, సోలార్, ఫొటోవోల్టాయిక్ సెల్స్, అల్యూమినియం స్క్రాప్, పొద్దుతిరుగుడు విత్తన నూనె, జీడిపప్పు ఉన్నాయి.
2023 ఆర్థిక సంవత్సరంలో, భారత్ మొత్తం సరుకుల దిగుమతులు 16.5 శాతం పెరిగి 714 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ దిగుమతులు పెరగడం వల్ల దేశం కరెంట్ ఖాతా లోటు జీడీపీలో 2 శాతానికి పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 1.2 శాతంగా ఉండేది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అగ్రిమెంట్-1 (ITA-1) పరిధిలోకి వచ్చే 250 ఉత్పత్తుల దిగుమతులపై ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఐటీఏ-1 జాబితాలో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్‌లు, కంప్యూటర్‌లు, టెలికాం పరికరాలు, సెమీకండక్టర్‌లు, సెమీకండక్టర్ తయారీ, యాంప్లిఫైయర్‌లు, టెస్టింగ్ పరికరాలు, సాఫ్ట్‌వేర్, సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్లు సహా అనేక రకాల హై-టెక్నాలజీ వస్తువులు ఉన్నాయి.