సాక్షి,ముంబై: దేశీయ విమానయాన రంగంలో సేవలందించేందుకు ఆకాశ ఎయిర్ సర్వం సిద్ధం చేసుకుంది. బిలియనీర్, ప్రముఖ పెట్టుబడి దారుడు రాకేష్ ఝున్‌ఝన్‌వాలా నేతృత్వంలోని ఆకాశ ఎయిర్ తొలి వాణిజ్య బోయింగ్ 737 మ్యాక్స్ విమానం ఆగస్టు 7న ముంబై-అహ్మదాబాద్ మార్గంలో గాల్లోకి ఎగరనుంది. దీనికి టికెట్ల విక్రయాలను నేటి(జులై 22) నుంచే ప్రారంభించింది. తొలిదశలో అహ్మదాబాద్, బెంగళూరు, ముంబై, కొచ్చి నెట్‌వర్క్‌లకు కంపెనీ టిక్కెట్ల విక్రయిస్తోంది.
ఆగస్ట్ 7 నుంచి ముంబై-అహ్మదాబాద్ రూట్‌లో వారానికోసారి నడిచే 28 విమానాలతోపాటు ఆగస్టు 13 నుంచి బెంగళూరు-కొచ్చి రూట్‌లో 28 విమానాల టిక్కెట్ల విక్రయాన్ని ప్రారంభించినట్లు ఆకాశ ఎయిర్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే తొలి బోయింగ్ విమానం డెలివరీ అయిందని, రెండో విమానం ఈ నెలాఖరులోపు అందే అవకాశం ఉందన్నారు.
రెండు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలతో విమాన కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు ఆకాశ ఎయిర్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ప్రవీణ్ అయ్యర్ వెల్లడించారు. దీంతో ముంబై-అహ్మదాబాద్ మార్గంలో బోయింగ్ 737 మ్యాక్స్ విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి. విమానాల బుకింగ్‌లు మొబైల్ యాప్, మొబైల్ వెబ్, డెస్క్‌టాప్ వెబ్‌సైట్, ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెంట్ల ద్వారా అందుబాటులో ఉంటాయి.
ఆకాశ ఎయిర్ ముంబై-అహ్మదాబాద్ మధ్య రోజువారీ విమానాన్ని కూడా నడుపుతుంది. ముంబై విమాన టిక్కెట్లు రూ. 4,314 నుండి ప్రారంభం. కాగా, అహ్మదాబాద్ నుండి ప్రారంభ ధర రూ. 3,906గా ఉంటాయి. బెంగళూరు నుండి కొచ్చికి రెండు రోజువారీ విమానాలను నడుపుతుంది. టికెట్ల ధర రూ. 3,483 నుండి ప్రారంభం.కొచ్చి నుండి తిరిగి వచ్చే విమానం టిక్కెట్ ధరలు రూ. 3,282 నుండి ప్రారంభం.
కేఫ్ ఆకాశ
అకాశ ఎయిర్ విమానాల్లో ‘కేఫ్ అకాశ’ బై-ఆన్-బోర్డ్ మీల్ సర్వీస్‌ను అందిస్తుంది. ఇందులో పాస్తా, వియత్నామీ రైస్ రోల్స్, హాట్ చాక్లెట్ అందిస్తుంది. అలాగే సంవత్సరం పొడవునా భారతీయ వంటకాలతో కూడిన పండుగ మెనూ కూడా ఉంటుందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment