ఒకప్పుడు సినిమా తెరపై సైకిల్ చెయిన్ తెంపి నాగార్జున సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ముప్పై ఏళ్లు దాటినా ఇప్పటికీ సైకిల్ చెయిన్ ఎఫెక్ట్ తగ్గలేదు. ఇప్పుడు నాగార్జున కొత్తగా బ్లాక్‌చెయిన్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కొత్త ఇంట్రెస్ట్ ఫ్యూచర్‌లో ఏ సంచలనాలకు కేంద్రం కానుందో....
వెండితెర హీరోగానే కాదు సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మేన్‌గా నాగార్జునకి తెలుగు ఇండస్ట్రీలో పేరుంది. కొత్త టాలెంట్‌ని పట్టుకోవడంలో భవిష్యత్తుని సరిగా అంచనా వేసి అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించడంలో ‘కింగ్’ని దిట్టగా చెప్పుకుంటారు. మరోసారి నాగార్జున తన ఇమేజ్‌కి తగ్గట్టుగా కొత్త స్టెప్ వేయబోతున్నారా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి !
స్పెషల్ మీటింగ్
టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు డైరెక‌్షన్‌లో తెరకెక్కుతున్న ఘోస్ట్ సినిమా షూటింగ్‌లో భాగంగా నాగార్జున ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు. నాగార్జునతో ఫోటోలు దిగేందుకు సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు, విదేశీయులు పోటీ పడ్డారు. అయితే దీనికి భిన్నంగా నాగార్జునానే ఓ వ్యక్తితో ఫోటో దిగేందుకు ఆసక్తి చూపించారు. అంతేకాదు ఆ వ్యక్తి ప్రత్యేకతలను చెబుతూ ఏకంగా ట్విట్టర్‌లో ఫోటో కూడా పెట్టడం కొత్త చర్చకు దారి తీసింది.
ఫ్యూచర్ టెక్నాలజీ
దుబాయ్‌లో షూట్‌లో ఉన్న నాగార్జున ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌లో ఫుల్‌క్రేజ్ ఉన్న బ్లాక్ చెయిన్ టెక్నాలజీపై సర్వీస్ అందిస్తున్న ఓఎక్స్ పాలిగాన్ సంస్థ కో ఫౌండర్ సందీప్ నైల్‌వాల్‌ని కలిశారు. ఈ సందర్భంగా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ, ఇతర ఫ్యూచర్ టెక్నాలజీలపై చర్చించామని నాగార్జున స్వయంగా తెలిపారు.
It was nice to meet and chat with @sandeepnailwal Co-founder @0xPolygon !!the man who put india on the world map of blockchain and talk about future tech!! Godbless🙏 pic.twitter.com/kRbSpczyeM
— Nagarjuna Akkineni (@iamnagarjuna) March 17, 2022
ఎవరీ సందీప్
ముంబైకి చెందిన సందీప్ నైల్‌వాల్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి బయటకి వచ్చాక ఏంబీఏ పూర్తి చేశారు. ఆ తర్వాత డెలాయిట్, వెల్‌స్పన్ సంస్థల్లో పని చేశారు. 2017లో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీపై వర్క్ చేసే మాటిక్ సంస్థను స్థాపించాడు. అనంతరం 2019లో దాన్ని ఓఎక్స్‌పాలిగాన్‌గా మార్చాడు. 2020లో కరోనా సంక్షోభ సమయంలో ఇండియా క్రిప్టో కోవిడ్ రిలీఫ్ ఫండ్ పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చారు.
దేశీ క్రిప్టో అడ్డా
ఇండియాకు సంబంధించి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, క్రిప్టోకరెన్సీ, ఈథేరియం లావాదేవీలు, బినాన్స్, డిసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ వ్యవహరాలకు ఈ సంస్థ పెట్టింది పేరు. ఈ సంస్థ యూజర్ బేస్‌లో మూడు లక్షల మంది క్రిప్టో ట్రేడర్లు ఉన్నారు. గడిచిన మూడేళ్లలో 27 బిలియన్ డాలర్ల విలువైన ఈథేరియమ్, బినాన్స్, స్మార్ట్‌చైయిన్ లావాదేవీలను నిర్వహించింది.
బ్లాక్‌చెయిన్ బాట పట్టిన సెలబ్రిటీలు
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బిజినెస్‌మేన్‌లు, సినిమా పర్సనాలిటీస్, స్పోర్ట్స్ ఐకాన్స్ బ్లాక్ చెయిన్ టెక్నాలజీపై ఆసక్తి చూపిస్తున్నారు. ఎలన్‌మస్క్, టిమ్‌కుక్ వంటి వ్యక్తులు ఇప్పటికే క్రిప్టోలో భారీగా ఇన్వెస్ట్ చేయగా సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్, మహేంద్రసింగ్ ధోని వంటి మూవీ, స్పోర్ట్స్ సెలబ్రిటీలు నాన్ ఫంజిబుల్ టోకెన్లు (ఎన్‌ఎఫ్‌టీ)లను రిలీజ్ చేస్తున్నారు.
కింగ్ మదిలో ఏముందో ?
ఈ నేపథ్యంలో నాగార్జున సందీప్ నైల్‌వాల్‌ని కలుసుకోవడం బ్లాక్ చెయిన్ టెక్నాలజీపై సుదీర్ఘంగా చర్చించడం చర్చనీయాంశంగా మారింది. నాగార్జున త్వరలో క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టవచ్చంటూ కొందరు అంచనా వేస్తుండగా మరికొందరు ఎన్‌ఎఫ్‌టీలు తీసుకు రావచ్చని అనుకుంటున్నారు. లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావుకి సంబంధించిన సినిమా విశేషాలను డిజిటలైజ్ చేసే ప్రక్రియలో భాగంగా ఫ్యూచర్ టెక్నాలజీ అయిన బ్లాక్‌చెయిన్ గురించి నాగార్జున తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండవచ్చనే అంచనాలు ఉన్నాయి.
- సాక్షి వెబ్ ప్రత్యేకం
Comments
Please login to add a commentAdd a comment