3 ఐపీవోలకు సెబీ గ్రీన్‌సిగ్నల్‌ | Allied Blenders And Distillers, 2 Others Get SEBI Go Ahead To Float IPO | Sakshi
Sakshi News home page

3 ఐపీవోలకు సెబీ గ్రీన్‌సిగ్నల్‌

Published Tue, Dec 20 2022 5:48 AM | Last Updated on Tue, Dec 20 2022 5:48 AM

Allied Blenders And Distillers, 2 Others Get SEBI Go Ahead To Float IPO - Sakshi

న్యూఢిల్లీ: క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పబ్లిక్‌ ఇష్యూలను చేపట్టేందుకు తాజాగా మూడు కంపెనీలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ జాబితాలో ఆఫీసర్స్‌ చాయిస్‌ విస్కీ తయారీ కంపెనీ అలైడ్‌ బ్లెండర్స్‌ అండ్‌ డిస్టిల్లరీస్, లైడ్‌ లైటింగ్‌ సొల్యూషన్ల సంస్థ ఐకియో లైటింగ్, ఆటో విడిభాగాల కంపెనీ డివ్జీ టార్క్‌ట్రాన్స్‌ఫర్‌ సిస్టమ్స్‌ చేరాయి. ఈ మూడు సంస్థలూ పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు సెప్టెంబర్, అక్టోబర్‌లలో సెబీకి ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. కాగా.. అక్టోబర్‌లో మోటిసన్స్‌ జ్యువెలర్స్‌ దాఖలు చేసిన ముసాయిదా పత్రాలను ఈ నెల 16న రిటర్న్‌ చేసినట్లు వెబ్‌సైట్‌లో సెబీ పేర్కొంది. ఇతర వివరాలు చూద్దాం..

అలైడ్‌ బ్లెండర్స్‌
ఐపీవోలో భాగంగా అలైడ్‌ బ్లెండర్స్‌ రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో రూ. 1,000 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్, ప్రమోటర్‌ గ్రూప్‌ సంస్థ విక్రయానికి ఉంచనున్నాయి. ప్రధానంగా బినా కిషోర్‌ చాబ్రియా రూ. 500 కోట్ల విలువైన షేర్లను ఆఫర్‌ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ దేశీ తయారీ విదేశీ మద్యం(ఐఎంఎఫ్‌ఎల్‌) విభాగంలో 10 బ్రాండ్లు కలిగి ఉంది. ప్రధాన బ్రాండ్లలో ఆఫీసర్స్‌ చాయిస్‌ విస్కీ, జాలీ రోజర్‌ రమ్, క్లాస్‌ 21 వోడ్కా తదితరాలున్నాయి.   

డివ్జీ టార్క్‌ట్రాన్స్‌ఫర్‌
పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా డివ్జీ టార్క్‌ట్రాన్స్‌ఫర్‌ రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 31,46,802 షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్‌ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను పెట్టుబడి వ్యయాలతోపాటు.. సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. తయారీకి వీలుగా ఎక్విప్‌మెంట్‌ కొనుగోలు చేయనుంది. కంపెనీ ప్రధానంగా సిస్టమ్‌ లెవల్‌ ట్రాన్స్‌ఫర్‌ కేస్, టార్క్‌ కప్లర్, డ్యూయల్‌ క్లచ్‌ ఆటోమాటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ సొల్యూషన్స్‌ తదితరాలను అందిస్తోంది.

ఐకియో లైటింగ్‌
ఐపీవోలో భాగంగా ఐకియో లైటింగ్‌ రూ. 350 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో 75 లక్షల షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులలో రూ. 50 కోట్లను రుణ చెల్లింపులకు వెచ్చించనుంది. మరో రూ. 237 కోట్లను సొంత అనుబంధ సంస్థ ఐకియో సొల్యూషన్స్‌ నోయిడాలో ఏర్పాటు చేయనున్న యూనిట్, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా లెడ్‌ లైటింగ్‌ సొల్యూషన్స్‌ అందిస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement