న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల్లో అభద్రత భావం ఎక్కువ అవుతోందని.. భారత్‌లో 47 శాతం మంది ఉద్యోగుల అభిప్రాయం ఇదేనని ఏడీపీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సర్వేలో వెల్లడైంది. ‘‘ఆర్థిక అనిశ్చితులు, ఆటుపోట్ల తరుణంలో ఉద్యోగులు తమ ఉద్యోగం విషయంలో ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ప్రముఖ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించడానికి తోడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల మానవ ఉద్యోగాలకు ఎసరు ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో ఉద్యోగుల్లో ఈ అభిప్రాయాలు నెలకొన్నాయి’’అని ఏడీపీ ఎండీ రాహుల్ గోయల్ తెలిపారు.
దాదాపు అన్ని దేశాల యువ ఉద్యోగుల్లో ఉద్యోగ అభద్రత ఎక్కువగా ఉందని ఈ సర్వే తెలిపింది. 55 ఏళ్ల వయసువారితో పోలిస్తే 18–24 ఏళ్లలోని జెనరేషన్ జెడ్ ఉద్యోగుల్లో అభద్రతా భావం రెట్టింపు స్థాయిలో ఉన్నట్టు వెల్లడించింది. ‘‘చాలా సంస్థలు ప్రతిభావంతులను గుర్తించడం, వారిని అట్టిపెట్టుకునే విషయంలో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయి. కనుక కొందరు ఉద్యోగులు భావిస్తున్నంత దారుణ పరిస్థితులు లేవు’’అని గోయల్ చెప్పారు.
► మీడియా, సమాచార ప్రసార పరిశ్రమలో అంతర్జాతీయంగా ఎక్కువ ఉద్యోగ అభద్రత నెలకొంది. ఆ తర్వాత ఆతిథ్యం, లీజర్ పరిశ్రమలో ఇదే విధమైన పరిస్థితి ఉంది.
► సర్వేలో పాల్గొన్న వారిలో 60 శాతం మంది, తమ ఉద్యోగ భద్రత కోసం అవసరమైతే ఎలాంటి వేతనం లేకుండా అదనపు గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
► అంతర్జాతీయంగా జెనరేషన్ జెడ్ ఉద్యోగులు ప్రతి ఐదుగురిలో ఒకరు గత 12 నెలల్లో పరిశ్రమలు మారడాన్ని పరిశీలించినట్టు తెలిపారు. పావు వంతు మంది సొంత వ్యాపారం ప్రారంభించాలని అనుకున్నట్టు చెప్పారు.
► 55 ఏళ్లకు చేరిన 17 శాతం మంది మందుస్తు రిటైర్మెంట్ పట్ల సానుకూలత చూపించారు.
భరోసా అవసరం..
‘‘ఈ సర్వే ఫలితాల ఆధారంగా చూస్తే.. తమకు విలువైన ఆస్తి అంటూ ఉద్యోగులకు కంపెనీలు భరోసా కలి్పంచాల్సిన అవసరం ఉంది. వారి కృషిని గుర్తించాల్సి ఉంది. సంస్థలో వారికి మెరుగైన భవిష్యత్తు ఉంటుందన్న భరోసా అవసరం. లేదంటే కంపెనీలు కీలకమైన నైపుణ్యాలను, అనుభవాన్ని నష్టపోవాల్సి వస్తుంది. దీంతో తమ క్లయింట్లకు సేవలు అందించడంలో సమస్యలు ఎదురు కావచ్చు’’అని గోయల్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment