గ్రీన్‌ మొబిలిటీలో ఆంధ్రప్రదేశ్‌ మున్ముందుకే | AP moving forward towards green mobility along with India | Sakshi
Sakshi News home page

గ్రీన్‌ మొబిలిటీలో ఆంధ్రప్రదేశ్‌ మున్ముందుకే

Published Sat, Jun 17 2023 12:58 PM | Last Updated on Sat, Jun 17 2023 1:12 PM

AP moving forward towards green mobility along with India - Sakshi

ఆటోమొబైల్‌ రంగంలో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్న ఇండియా ఇక ముందు ఎలెక్ట్రిక్‌ ఆటోమొబైల్‌ వాహనాల రంగంలో కూడా ముందుకు సాగే అవసరంతోపాటు అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పెట్రోలు, డీసెల్‌ బదులు విద్యుత్‌ బ్యాటరీలతో నడిచే వాహనాల వినియోగాన్ని నేటి ప్రపంచంలో ‘గ్రీన్‌ మొబిలిటీ’ అని పిలుస్తున్నారు. గ్రీన్‌ మొబిలిటీలో ఆంధ్రప్రదేశ్‌ సైతం ప్రగతి సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన కృషి చేస్తోంది. ప్రపంచంలో ఆటోమొబైల్‌ రంగంలో చైనా, అమెరికా మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.

గత ఏడాది మూడో ర్యాంకర్‌ జపాన్‌ను ఆటో అమ్మకాల్లో ఇండియా అధిగమించింది. కిందటేడాది జపాన్‌ 42 లక్షల ఆటోమొబైల్‌ వాహనాలను అమ్మగా, ఇండియాలో 42 లక్షల 50 వేల వాహనాలు అమ్ముడయ్యాయి. వచ్చే ఐదు సంవత్సరాల్లో దేశంలో ఎలెక్ట్రిక్‌ కార్లు, ఇతర రకాల వాహనాల ఉత్పత్తి పెరిగితే ఆటో రంగంలో చైనా, అమెరికాలను ఇండియా దాటిపోతుందని కేంద్ర ప్రభుత్వం అంచనావేస్తోంది. అమెరికాలోని అట్లాంటిక్‌ మహాసముద్ర తీరంలోని పెద్ద రాష్ట్రం జార్జియా గ్రీన్‌ మొబిలిటీలో అగ్రభాగాన నిలిచే దిశగా ముందుకు సాగుతోంది. ఈ రాష్ట్రాన్ని అమెరికాకు ‘ఎలెక్ట్రిక్‌ మొబిలిటీ రాజధాని’గా చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. ఆటోమొబైల్‌ రంగంలో అమెరికాలో మొదటి స్థానంలో ఉన్న మిషిగన్‌ రాష్ట్రాన్ని మించిపోతుందని అంచనా.

గ్రీన్‌ మొబిలిటీలో ఆంధ్రప్రదేశ్‌ 
నాలుగేళ్ల క్రితం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచీ ఆంధ్రప్రదేశ్‌ లో గ్రీన్‌ మొబిలిటీకి ప్రాధాన్యం పెరిగింది. ఎలెక్ట్రిక్‌ వాహనాల తయారీ, వాటికి అవసరమైన బ్యాటరీలు, చార్జింగ్‌ పరికరాలు ఉత్పత్తి విస్తరించడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి నేతృత్వంలోని సర్కారు ఏటా ప్రోత్సాహకాలు ప్రకటాస్తూ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో ఎలెక్ట్రిక్‌ (గ్రీన్‌) మొబిలిటీకి తగిన వ్యవస్థ, వాతావరణం ఏర్పాటు చేయడానికి గతంలోనే ఈ రంగంలో అనుభవం ఉన్న ‘ఊర్జా గ్లోబల్‌’ అనే కంపెనీతో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికాభివృద్ధి బోర్డు (ఏపీఈడీబీ) ఒప్పందం చేసుకుంది.

ఈ అవగాహన ఒప్పందం ప్రకారం లిథియం-అయాన్‌ బ్యాటరీలు, ఎలెక్ట్రిక్‌ వాహనాల తయారీ యూనిట్లు ఏపీలో ఏర్పాటవుతాయి. నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఊర్జా గ్లోబల్‌ రూ.200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే పరిశ్రమల వల్ల 250 మందికి ప్రత్యక్షంగా, 1000 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలుంటాయని అప్పుడు అంచనా వేశారు.

ఆంధ్రప్రదేశ్‌ ను ఎలెక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) తయారీ కేంద్రంగా చేయడానికి వరల్డ్‌ ఇకనామిక్‌ ఫోరమ్‌ తో కలిసి ఏపీ సర్కారు కిందటేడాది ఆగస్టులో ఏర్పాటు చేసిన తొలి వర్చ్యుల్‌ మీటింగ్‌ విజయవంతంగా జరిగింది. విద్యుత్‌ వాహనాల రంగంలో ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తుందని ఈ సమావేశంలో ప్రసంగించిన నీతి ఆయోగ్‌ సలహాదారు సుధేందు సిన్హా విశ్వాసం ప్రకటించారు. రాష్ట్రంలో పెరుగుతున్న సాంప్రదేయేతర ఇంథన వనరుల ఉత్పత్తి కారణంగా ఎలెక్ట్రిక్‌ వాహనాల రంగం విస్తరణకు అనువైన వాతావరణం ఉందని అందరూ గుర్తిస్తున్నారు.

- విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement