
Aptech CEO Anil Pant passes away: ఆప్టెక్ (Aptech) ఎండీ, సీఈవో అనిల్ పంత్ (Anil Pant) మంగళవారం (ఆగస్టు 15) కన్నుమూశారు. ఈ మేరకు ఆప్టెక్ కంపెనీ బీఎస్‌ఈ ఫైలింగ్‌లో తెలియజేసింది. "కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో డాక్టర్ అనిల్ పంత్ మరణించారని తెలియజేయడానికి కంపెనీ విచారం వ్యక్తం చేస్తోంది. డాక్టర్ పంత్ సహకారం, శక్తిని కంపెనీ కోల్పోతోంది. కంపెనీ డైరెక్టర్లు, ఉద్యోగులు అందరూ ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు" అని ఆప్టెక్ కంపెనీ పేర్కొంది.
గత జూన్ నెలలో అనిల్ పంత్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో నిరవధిక సెలవుపై వెళ్లారు. ఆ సమయంలో తాత్కాలిక సీఈవోను ఎంపిక చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు కంపెనీ తెలియజేసింది.
ఐటీ, కమ్యూనికేషన్ రంగంలో విశేష అనుభవం
అనిల్ పంత్ 2016 నుంచి ఆప్టెక్ ఎండీ, సీఈవోగా ఉన్నారు. దీనికి ముందు ఆయన సిఫీ టెక్నాలజీస్, టీసీఎస్‌లలో పనిచేశారు. ఐటీ, కమ్యూనికేషన్ రంగంలో పంత్‌కు 15 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఆయన సేల్స్, నాణ్యత, డెలివరీ, మార్కెటింగ్, ఉత్పత్తి నిర్వహణ వంటి బాధ్యతలను నిర్వహించారు. పంత్ మలేషియాలోని లింకన్ యూనివర్సిటీ కాలేజ్ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పీహెచ్‌డీని కూడా పొందారు.