గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు మాఫీ చేసిన రుణాల మొత్తం ఎంతో తెలుసా?.. దేశంలోని సగానికిపైగా రాష్ట్రాల వార్షిక బడ్జెట్ కంటే కూడా ఎక్కువ. అక్షరాలా తొమ్మిది లక్షల తొంభై ఒక్క వేల ఆరు వందల నలభై కోట్లు.. ఇందులో ఒక్క స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా తన రికార్డులలో నుంచి తొలగించిన (రైటాఫ్ చేసిన) అప్పు రూ.2,04,486 లక్షల కోట్లు..చిన్న వ్యాపారాలు చేస్తూ అనారోగ్యంతోనో, మరో కారణంతోనో నష్టాల బారినపడి రుణాలు చెల్లించలేకపోయిన 1.86 కోట్ల మంది తీసుకున్న రుణాల మొత్తం రూ.1.41 లక్షల కోట్లు అయితే.. రూ.100 కోట్లు, ఆపై రుణాలు తీసుకుని ఎగవేసిన 5,400 మందిలో టాప్ 810 మంది రుణాల మొత్తం ఏకంగా రూ.2.41 లక్షల కోట్లు కావడం గమనార్హం.
ఈ లెక్క ఇక్కడితో ఆగిపోలేదు. ఏటేటా పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు రూ.9.91 లక్షల కోట్లను బ్యాంకులు నిరర్థక ఆస్తుల కింద గుర్తించి రికార్డుల నుంచి తొలగించాయి. ఇలా రైటాఫ్ చేసినా కూడా ఎగవేతదారుల నుంచి రుణ వసూలు ప్రక్రియ కొనసాగుతుందని కేంద్రం ప్రకటించింది. ఇదంతా పేరుకేనని, బ్యాంకులు వారి నుంచి రుణాల వసూలుపై సీరియస్‌గా వ్యవహరించడం లేదని బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు గగ్గోలు పెడుతున్నాయి.
రుణాలు ఇచ్చేటప్పుడు మాత్రమే కాదు రుణమాఫీ కోసం కూడా కొందరు బ్యాంకుల ఉన్నతాధికారులు ఎగవేతదారులకు సహకరిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. మామూలు ఉద్యోగికి అన్ని అర్హతలు ఉండి వ్యక్తిగత రుణం కోసమో, గృహ రుణం కోసమో దరఖాస్తు చేస్తే.. సవాలక్ష కొర్రీలు పెడుతున్న బ్యాంకులు ఎగవేతదారులకు మాత్రం సులభంగా రుణాలు మంజూరు చేస్తున్నాయని పుణేకు చెందిన వివేక్ వేలంకర్ ఇటీవల విజిలెన్స్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అందుకు ఆధారాలుగా వందల కొద్దీ డాక్యుమెంట్లను అందజేశారు. అయినా ప్రయోజనం లేదని, ఈ దేశంలో ధనవంతులకు ఉన్న వెసులుబాటు పేదలకు లేదని వేలంకర్ ఆవేదన వ్యక్తం చేశారు.
వందల సంఖ్యలో ఉద్దేశపూర్వక ఎగవేతదారులు!
తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా రుణ ఎగవేతదారులు వేల సంఖ్యలో ఉండగా.. అందులో ఉద్దేశపూర్వకంగా ఎగవేతకు పాల్పడినవారు వందల మంది ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రూ.100 కోట్లు పైబడిన బకాయిదారుల్లో ఉద్దేశపూర్వకంగా ఎగవేసినవారు 90 శాతానికిపైగా ఉన్నారని రిజర్వు బ్యాంకు అధ్యయనంలో తేలింది. ఆర్టీఐ కింద పొందిన సమాచారం ప్రకారం.. 31 డిసెంబర్ 2021 నాటికి దేశవ్యాప్తంగా 2,237 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారులు ఉన్నారు. వారు రుణం ఎగవేతపై ముందే నిర్ణయించుకుని రూ.1,84,863.32 లక్షల కోట్లను బ్యాంకుల నుంచి తీసుకున్నారు.
ఈ 2,278 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితాను రిజర్వు బ్యాంకు ఇటీవల సమాచార హక్కు చట్టం కింద విడుదల చేసింది. ‘‘ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ఎగవేయాలనుకున్న వారి పేర్లను అడిగాను. అతి కష్టం మీద ఆర్‌బీఐ ఆ జాబితా అందజేసింది. ఆ సమాచారం ప్రకారం 312 మంది పెద్ద ఉద్దేశపూర్వక ఎగవేతదారులు రూ.100 కోట్లు అంతకంటే ఎక్కువ రుణాలను ఎగ్గొట్టారు. వారందరి బకాయిలు కలిపి రూ.1.41 లక్షల కోట్లు ఉన్నాయి. ఈ ఎగవేతదారులందరిపై కేసులు నమోదు చేశామని ఆర్‌బీఐ చెప్తున్నా.. ఏ ఒక్కరి మీద కూడా కనీస చర్యలు లేవు‘ అని పుణేకు చెందిన వివేక్ వేలంకర్ చెప్పారు. రుణ ఎగవేతదారుల వివరాల కోసం ఆయన ఏడాదిగా ఉద్యమం చేస్తున్నారు. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత దేశవ్యాప్తంగా 25 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారులను ఆయన గుర్తించి.. సీబీఐ, ఈడీ వంటి సంస్థలకు ఫిర్యాదు చేశారు.
కస్టమర్ల డేటా గోప్యత పేరుతో..
ప్రభుత్వ రంగ బ్యాంకులు ‘కస్టమర్ డేటా గోప్యత’ పేరిట పెద్ద ఎగవేతదారుల పేర్లను బహిర్గతం చేయడానికి నిరాకరిస్తున్నాయి. నిజానికి అక్రమంగా రుణాలు ఇవ్వడమే కాదు, వాటిని ఎగవేయడానికి కూడా కొన్ని బ్యాంకుల అధికారులు, సిబ్బంది సహకరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ‘‘ఎగవేతదారుల ఆస్తులను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకునే బదులు.. ఎగవేతదారుల తరఫున దివాలా ప్రక్రియ ప్రారంభించడానికి బ్యాంకు ఉన్నతాధికారులే వత్తాసు పలుకుతున్నారు. ఒకసారి దివాలా ప్రక్రియ ప్రారంభమైందంటే ఎగవేతదారులకు ఎలాంటి ఢోకా ఉండదు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరుగురు మాజీ ఎంపీలు, ఒక ప్రస్తుత ఎంపీ ఈ రకంగా బ్యాంకులను దివాలా తీయించారు’’ అని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘రుణ ఎగవేతదారుల్లో చాలా మంది కంపెనీల పేరిట తీసుకున్న రుణాల సొమ్మును కుటుంబ సభ్యుల పేరిట ఆస్తుల కొనుగోలుకు బదలాయించారు. కొందరు విదేశాలకు తరలించారు. హైదరాబాద్‌కు చెందిన రెండు విద్యుత్ కంపెనీలు బ్యాంకుల నుంచి తీసుకున్న మొత్తాన్ని ఇలా దుర్వినియోగం చేశాయి’’ అని ఆర్బీఐ అధికారి ఒకరు వివరించారు.
చదవండి: Anand Mahindra: ‘ఇదే నా టాలెంట్, ప్లీజ్ సార్ జాబ్ ఇవ్వండి’.. ఆనంద్ మహీంద్రా రిప్లై ఇదే!
Comments
Please login to add a commentAdd a comment