న్యూఢిల్లీ: ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ పెద్దలు చెప్పిన మాట. కానీ, కరోనా వచ్చిన తర్వాతే ఎక్కువ మందికి ఆరోగ్య ప్రాధాన్యం తెలిసొచ్చింది. ద్విచక్ర వాహనాలు అందుబాటులోకి రానంత వరకు చాలా మంది ఆరోగ్యాలు భాగ్యంగానే ఉండేవి. ప్రతీ చిన్న పనికి వాహనాన్ని వినియోగించడం.. ఆధునిక జీవన అలవాట్ల కారణంగా శారీరక, మానసిక ఆరోగ్యం (ఫిట్‌నెస్) గతంలో మాదిరి పటిష్టంగా ఉండడం లేదు. దీంతో తిరిగి శరీరానికి పని చెప్పడాన్ని ప్రజలు క్రమంగా అలవాటు చేసుకుంటున్నారు. గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని సైకిల్ కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో వీటికి డిమాండ్ పెరుగుతోంది. సైకిళ్లకు డిమాండ్ దశాబ్దపు గరిష్ట స్థాయికి చేరిందని.. 2021–22 ఆర్థిక సంవత్సరంలో విక్రయాలు 20 శాతం వృద్ధి చెందుతాయని క్రిసిల్ రేటింగ్స్ ఓ నివేదికను విడుదల చేయడం సందర్భోచితం.
‘‘భారత్‌లో సైకిళ్ల విక్రయాలు 2021–22లో 1.45 కోట్లకు పెరుగుతాయి. 2020–21లో విక్రయాలు 1.21 కోట్ల యూనిట్లు. ప్రస్తుత కరోనా మహమ్మారి సైకిళ్లకు డిమండ్‌ను పెంచింది. ఫిట్‌నెస్‌పై అవగాహన విస్తృతం అయ్యింది. విక్రయాలు పెరగడడం వల్ల సైకిల్ తయారీ కంపెనీలకు నగదు ప్రవాహాలు మెరుగుపడతాయి. వాటి రుణ చెల్లింపులకు మద్దతుగా నిలుస్తాయి’’ అని క్రిసిల్ పేర్కొంది.
2019 మార్చి వరకు ఐదు ఆర్థిక సంవత్సరాల్లో సైకిళ్ల విక్రయాలు ఏటా 5 శాతం చొప్పున వృద్ధి చెందాయి. కానీ 2019–20లో మాత్రం విక్రయాలు 22 శాతం క్షీణతను నమోదు చేశాయి. ప్రభుత్వం కొనుగోళ్లను తగ్గించడంతోపాటు పెద్ద కంపెనీలు మూతపడడం కూడా ఇందుకు కారణాలుగా ఉన్నాయి. కానీ, గత ఆర్థిక సంవత్సరం మాత్రం సైకిల్ పరిశ్రమకు మంచి వృద్ధిని తీసుకొచ్చింది. ప్రపంచంలో భారత్ రెండో అతిపెద్ద సైకిల్ తయారీ కేంద్రం కావడం గమనార్హం.
స్టాండర్డ్ విభాగం..
స్టాండర్డ్, ప్రీమియం, కిడ్స్, ఎక్స్‌పోర్ట్స్ ఇలా నాలుగు విభాగాల కింద సైకిళ్ల విక్రయాలు కొనసాగుతుంటాయి. స్టాండర్డ్ సైకిళ్ల విభాగం అతిపెద్దది. 2020లో అమ్ముడపోయిన సైకిళ్లలో సగం మేర స్టాండర్డ్ విభాగం కిందే ఉన్నాయి. ప్రధానంగా ప్రభుత్వ కొనుగోళ్లు విక్రయాలకు మద్దతుగా నిలుస్తున్నాయి. టెండర్ల ద్వారా సైకిళ్లను కొనుగోలు చేసి సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ప్రజలకు పంపిణీ చేస్తుంటాయి. ఇక కిడ్స్ (పిల్లల సైకిళ్లు), ప్రీమియం (ఖరీదైన సైకిళ్లు) విభాగం విక్రయాలు గత ఆర్థిక సంవంత్సరం మొత్తం విక్రయాల్లో 40 శాతంగా ఉండడం గమనార్హం. తీరిక సమయాల్లో రైడింగ్, ఆరోగ్యం కోసం ఖరీదైన సైకిళ్లను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఎగుమతులు, ఇతర సైకిళ్ల విక్రయాల వాటా 10 శాతంగా ఉంది.
‘‘కరోనా కారణంగా లాక్‌డౌన్‌లు, ఆంక్షలతో ఫిట్‌నెస్‌పై దృష్టితోపాటు, తీరిక సమయం లభించింది. ఇది సైకిళ్ల డిమాండ్‌ను ముఖ్యంగా ప్రీమియం, కిడ్స్ విభాగంలో విక్రయాలను పెంచింది’’ అని క్రిసిల్‌రేటింగ్స్ డైరెక్టర్ నితేష్ జైన్ చెప్పారు. కరోనా రెండో విడత తీవ్రతతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ డిమాండ్ కొనసాగుతుందన్నారు. ప్రీమియం, కిడ్స్ సైకిళ్ల విభాగంలో 22 శాతం వృద్ధి నమోదు కావచ్చని అంచనా వ్యక్తం చేశారు. గత కొన్ని నెలల్లో ప్రభుత్వం నుంచి కొనుగోళ్ల ఆర్డర్లు మెరుగుపడడం మొదలైనట్టు, రెండేళ్ల స్తబ్దత తర్వాత స్టాండర్డ్ సైకిళ్లకు డిమాండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి చెందుతుందని క్రిసిల్ పేర్కొంది.
కంపెనీలకు అనుకూలం
విక్రయాల్లో వృద్ధి వల్ల 2021–22లో సైకిళ్ల కంపెనీల లాభదాయకత పెరుగుతుందని.. అధిక లాభదాయకత ఉండే కిడ్స్, ప్రీమియం విభాగం విక్రయాల వాటా 10 శాతం మేర పెరిగి 50 శాతాన్ని ప్రస్తుతం చేరుకున్నట్టు క్రిసిల్ తన నివేదికలో వివరించింది. సైకిల్ తయారీలో వినియోగించే స్టీల్ తదితర ముడి సరుకుల ధరలు పెరిగినందున.. ఈ మేర ఉత్పత్తుల ధరలను కంపెనీలు పెంచొచ్చని అంచనా వేసింది. సైకిల్ ధరలో తయారీ వ్యయం 60–65 శాతంగా ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరంలో ముడిసరుకుల ధరలు పెరిగినప్పటికీ సైకిళ్ల కంపెనీల మార్జిన్లు పెరిగినట్టు క్రిసిల్ ప్రస్తావించింది.
‘‘సైకిళ్ల కంపెనీల మార్జిన్లు 1.10–1.30 శాతం మేర ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పుంజుకుంటాయి. కంపెనీలు తయారీ సామర్థ్య విస్తరణకు రుణ సమీకరణ చేయవచ్చు. వడ్డీ కవరేజీ రేషియో గత ఆర్థిక సంవత్సరంలో ఉన్న 3.6 రెట్ల నుంచి 4.8 రెట్లకు పెరుగుతుంది’’ అని క్రిసిల్ రేటింగ్స్ వివరించింది. లాక్‌డౌన్‌ల వల్ల డిమాండ్ ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఒక వంతు క్షీణిస్తుందని.. రెండో త్రైమాసికం నుంచి రికవరీ వస్తుందని అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment