జనాభా పెరగడంపై మీ అభిప్రాయం ఏంటని అడిగితే ఏం సమాధానమిస్తారు.. ప్రజలు పెరిగితే మంచితే కదా..శ్రామిక అవసరాలు తీరుతాయి.. అని కొందరు అంటారు. జనాభా ఎక్కువైతే మౌలిక అవసరాలకు ఎక్కువ ఖర్చు చేయాలి..ఉపాధి కరవవుతుంది..నిరుద్యోగం పెరుగుతుంది..ఆకలి అధికమవుతుంది.. అని ఇంకొందరు అభిప్రాయపడుతారు. ప్రాంతాలవారీగా స్థానిక అవసరాలు, అక్కడి ప్రజల అవగాహన, సదుపాయాలు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ నేపథ్యం..వంటి చాలా కారణాలు జనాభాను ప్రభావితం చేస్తాయి. ఈ జనాభా పెరుగుదలలోని తారతమ్యాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో అసమానతలను పెంచుతున్నాయి. 1950 నుంచి 2023 వరకు ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదల ఎలా ఉందో తెలియజేస్తూ ఐక్యరాజ్య సమితి నివేదిక విడుదల చేసింది.
జనాభా పెరుగుదల కొన్ని ప్రాంతాలను వృద్ధి పథంలోకి తీసుకెళితే..మరికొన్ని ప్రాంతాలను నష్టాల్లోకి నెట్టేస్తోంది. యువత ఎక్కువగా ఉన్న భారత్‌లో శ్రామికశక్తికి ప్రస్తుతం ఢోకాలేదు. ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన ప్రాంతాల సరసన చేరిన జపాన్ వంటి దేశాల్లో యువతలేక అల్లాడిపోతున్నారు. పిల్లల్ని కనడానికి ప్రభుత్వం అక్కడి దంపతులకు ప్రత్యేక వెసులుబాటు అందిస్తోంది. అక్కడ జనాభా తగ్గిపోవడానికి ప్రధాన కారణం యువత వివాహాలకు సుముఖంగా లేకపోవడం, వివాహమైనా పిల్లలను కనడానికి ఆసక్తిచూపకపోవడమేనని తెలుస్తోంది. నిరుద్యోగం, అధిక జీవన వ్యయం, మహిళల పట్ల వివక్ష తదితర సమస్యలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. వివాహం చేసుకుని సంతానాన్ని కనే వారికి జపాన్ ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నా యువత నిర్ణయంలో పెద్ద మార్పు ఉండడంలేదని తెలుస్తోంది. జపాన్ 2070నాటికి 30శాతం మేర జనాభాను కోల్పోయే ప్రమాదం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి.
ఆసియాలో..
ఆసియాలో 1950లో ఏటా జనాభా పెరుగుదల దాదాపు 58 కోట్లుగా ఉండేదని నివేదిక చెబుతుంది. 73 ఏళ్ల తర్వాత 2023లో అది 65 కోట్లుగా ఉంది. 1990ల్లో గరిష్ఠంగా జనాభా పెరుగుదల సుమారు 90 కోట్లకు చేరింది. క్రమంగా తర్వాతికాలం నుంచి పడిపోయింది. 2012లో ఘణనీయంగా దిగజారింది. చారిత్రాత్మకంగా భారత్, చైనా, ఇండోనేషియా..వంటి దేశాల్లో 20వ శతాబ్దంలో పారిశుద్ధ్యం, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయ పురోగతి, ఉపాధి అవకాశాలు మెరుగుపడడంతో జనాభా పెరిగింది.
ఆఫ్రికా.. ఆకలిరాజ్యం
ఓ వైపు జనాభాలేక ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంటే ఆఫ్రికాలో మాత్రం అందుకు భిన్నంగా జనాభా పెరుగుతోంది. ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన నివేదిక ప్రకారం..1950లో ఏటా సరాసరి 98 లక్షల జనాభా పెరుగుదల ఉండే ఆఫ్రికాలో 2023 నాటికి అది 4.6 కోట్లకు చేరింది. అయితే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సరైన ఉపాధి అవకాశాలులేక అక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పోషకాహారలోపంతో ఉన్నవారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఆకలి తాండవిస్తోంది.
యూరప్‌లో..
పారిస్, లండన్, బ్రిటన్..వంటి ప్రాంతాల్లోని ప్రజల్లో అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉంది. దాంతో ఏళ్లకాలం నుంచే ఎక్కువగా పిల్లల్ని కనకుండా జాగ్రత్త పడ్డారు. సరాసరి ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలను మాత్రమే కనేవారు. అది ప్రస్తుతం మరింత తగ్గిన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 1950లో ఏటా జనాభా పెరుగుదల 95 లక్షలుండే యూరప్‌లో 2023 నాటికి అది 63 లక్షలకు చేరింది.
అగ్రరాజ్యం అమెరికాలో..
క్రిస్టఫర్ కొలంబస్ 1490లో అమెరికాను కనుగొనే దానికంటే ముందు అక్కడ కేవలం రెండు తెగలకు చెందిన ప్రజలే ఉండేవారు. దాంతో జనాభా తక్కువగా ఉండేది. క్రమంగా విద్యా వ్యవస్థ విస్తరించింది. అమెరికాలో స్త్రీ, పురుష భేదాలు తక్కువగా ఉంటాయి. దాంతో దాదాపు అందరూ ఉద్యోగాలు చేసేవారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే అమెరికాలో నివసించడం ఖర్చుతో కూడుకున్న విషయం. కాబట్టి పిల్లల్ని తక్కువగానే కనేవారు. దంపతులిద్దరు ఉద్యోగాలు చేయడంతో డబ్బు ఆదా అయ్యేది. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించేవారు. సంస్థలు స్థాపించేవారు. అక్కడి జనాభాకు ఉపాధి దొరకండంతోపాటు మరింత మంది అవసరం ఏర్పడేది. దాంతో ఇతర దేశాల నుంచి అమెరికాకు వలసలు పెరిగాయి. కానీ అక్కడి ప్రజలు మాత్రం జనాభా పెరుగుదలపై అప్రమత్తంగానే ఉన్నారు. 1950లో జనాభా ఏటా పెరుగుదల 40 లక్షలుగా ఉండేది. ప్రస్తుతం అదే కొనసాగుతోంది.
ఇదీ చదవండి: భారత్‌లో అత్యుత్తమ ర్యాంకు పొందిన సంస్థ
జనాభా ఎక్కువగా ప్రాంతాల్లో జననాల నియంత్రణ ఆవశ్యకత పట్ల విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో దాని పెరుగుదలకు అవసరమయ్యే చర్యలు చేపట్టాలని చెబుతున్నారు. జనాభా తారతమ్యాలు ఏర్పడకుండా ప్రపంచదేశాలు కొన్ని నియమాలు రూపొందించుకుని వాటిని పాటించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment