BYJU'S Founder and CEO Raveendran Success Story In Telugu - Sakshi
Sakshi News home page

నవ్విస్తూ.. నేర్పిస్తూ.. ఇంటింటికి చేరువై.. లక్షల కోట్లకు అధిపతిగా

Published Fri, Dec 24 2021 6:02 PM | Last Updated on Fri, Dec 24 2021 6:59 PM

Byjus Ravindran Success Story In Telugu - Sakshi

అతనికి ఫిజక్స్‌లో ఫార్ములాలు అంటే ఇష్టం లెక్కలతో కుస్తీ పట్టడం సరదా. ఇష్టంగా మారిన ఆ సరదానే ఇప్పుడు ఇండియాలో దాదాపు ప్రతీ ఒక్కరికి అతనెవరో తెలిసేలా చేసింది. బంగారు భవిష్యత్తు కావాలనుకునే విద్యర్థులు ఓసారి అతన్ని ఫాలో అవాలనిపించేలా మార్చేసింది. అతని పేరంటే తల్లిదండ్రులకు నమ్మకం ఏర్పడింది. వెరసి నలుగు పదుల వయసు సమీపించగానే లక్షా ఇరవై కోట్ల కోట్ల సంపదను సృష్టించే స్థితికి చేరుకున్నాడు. అతనే రవీంద్రన్‌.. ఇలా చెబితే పెద్దగా ఎవరూ గుర్తు పట్టరు... పూర్తి పేరు బైజూస్‌ రవీంద్రన్‌. పుట్టింది కేరళా.. ఇప్పుడు ప్రపంచమంతటా విస్తరిస్తున్నాడు. 


బైజూస్‌ రవీంద్రన్‌ది కేరళలోని అళికోడ్‌ అనే చిన్న పట్టణం. అక్కడున్న ఓ ప్రైవేటు స్కూల్‌లో తల్లి లెక్కల టీచరుగా పని చేస్తే.. తండ్రి ఫిజిక్స్‌ పాఠాలు చెప్పేవాడు. చిన్నప్పటి నుంచి రవీంద్రన్‌ హైపర్‌ యాక్టివ్‌. స్కూళ్లో చెప్పిన పాఠాలు ఇట్టే చదివేసి ఇళ్లంతా చిందరవందర చేసేవాడు. అతని ఎనర్జీని బర్న్‌ చేసేందుకు ఆటలవైపు మళ్లించారు తల్లిదండ్రులు. అటా చదువుతో పాటు క్రికెట్‌, టేబుల్‌ టెన్నీస్‌ ఆటల్లో మంచి ఛాంపియన్‌ అయ్యాడు రవీంద్రన్‌. ఇదే ఊపులో బిటెక్‌ కూడా పూర్తి చేసి ఓ ఇంటర్నేషనల్‌ షిప్పింగ్‌ కంపెనీలో ఇంజనీరుగా చేరాడు.

ఆ రిక్వెస్టే లేకుంటే 
పాతికేళ్లు నిండకుండానే విదేశాలు తిరిగే ఉద్యోగం. జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో అతని క్లాస్‌మేట్స్‌ చేసిన చిన్న రిక్వెస్ట్‌ అతని జీవితాన్ని ఇంకో మలుపు తీసుకునేలా చేసింది. రవీంద్రన్‌తో పాటు బీటెక్‌ చదువుకున్న అతని ఫ్రెండ్స్‌ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) పరీక్షలకు ప్రిపేర్‌ అవుతూ.. రవీంద్రన్‌ని లెక్కలు, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో సాయం చేయమన్నారు. సరేనన్నాడు రవీంద్రన్‌.

ఎంట్రన్స్‌లో అద్భుతం
ఓ వైపు ఉద్యోగం చేస్తూ.. మరో వైపు ఎంట్రన్స్‌ పరీక్షలో స్నేహితులకు హెల్ప్‌ చేస్తుంటే ఓ చిలిపి ఆలోచన మెదిలింది రవీంద్ర మెదడులో. దాంతో సరదాగా 2007లో ఐఐఎం ఎంట్రన్స్‌ పరీక్షలకి అటెండ్‌ అయ్యడు. ఆ పరీక్షా ఫలితాల్లో తన స్నేహితులకు ఎవరికీ సాధ్యం కాని విధంగా హండ్రెడ్‌ పర్సంటైల్‌ సాధించాడు. ఏదో లక్కీగా అలా జరిగి ఉంటుందని రెండోసారి పరీక్ష రాస్తే మళ్లీ హండ్రెడ​ పర్సంటైల్‌ వచ్చింది. ఎంతో మంది కలగనే ఆ మార్కులు సరదాగా పరీక్ష రాస్తేనే రవీంద్రన్‌కి వచ్చాయి. దీంతో ఒక్కసారిగా అతని సర్కిల్‌లో రవీంద్రన్‌ పేరు మార్మోగిపోయింది.


కొచ్చి మీదుగా
స్నేహితుల సూచనలు, తన మీద తనకు ఉన్న ఆత్మవిశ్వాసంతో ఉద్యోగానికి రాజీనామా చేసి పది మంది విద్యార్థులతో ఐఐఎం కోచింగ్‌ సెంటర్‌ కోచిలో ప్రారంభించాడు. వారం తిరక్కుండానే పది మంది కాస్త వంద మంది అయ్యారు. ఏడాది గడిచే సరికి ఆ సంఖ్య వేయిని దాటి పోయింది. రవీంద్రన్‌ లెక్కలు, ఫిజిక్స్‌ పాఠాలు చెప్పే తీరు భిన్నంగా ఉండటం ఆ పాఠాలు విన్న విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధిస్తుండటంతో రవీంద్రన్‌ ప్రతిభ కొచ్చి దాటి ప్రకాశించింది. ఫ్రెండ్‌ ఇంట్లో చిన్న గదిలో మొదలైన కోచింగ్‌ ఆ తర్వాత టెర్రస్‌ మీదకి అక్కడి నుంచి ఆడిటోరియం అటుపై ఇండోర్‌ స్టేడియం వరకు జెట్‌ స్పీడ్‌తో సాగింది. 

ఒకేసారి 20 వేల మంది
రవీంద్రన్‌ కోచింగ్‌ కావాలంటూ విద్యార్థుల నుంచి వచ్చిన డిమాండ్‌తో బెంగళూరు మీదుగా ముంబై, పూనే, చెన్నైలకు విస్తరించింది. కోచింగ్‌ ప్రారంభించిన నాలుగేళ్లలోనే ప్లైట్స్‌లో తిరిగి పాఠాలు చేప్పే దశకు 2009లో రవీంద్రన్‌ చేరుకున్నాడు. ఒకేసారి 45 సిటీల్లో ఉన్న 20 వేల మంది విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పేంత బిజీ అయ్యాడు రవీంద్రన్‌.

థింక్‌ అండ్‌ లెర్న్‌
మరోవైపు రవీంద్రన్‌ దగ్గర కోచింగ్‌ తీసుకుని ఐఐఎంలో చేరి బిజినెస్‌ పట్టా చేత పట్టుకున్న అతని ఫ్రెండ్స్‌ మళ్లీ వచ్చారు. ఒక్క ఐఐఎం, జీఆర్‌ఈలకే కాదు స్కూల్‌ విద్యార్థుల నుంచి కోచింగ్‌ మొదలు పెడదామంటూ జట్టు కట్టారు. అంతా కలిసి మరో అడుగు ముందుకు వేసి థింక్‌ అండ్‌ లెర్న్‌ పేరుతో స్కూల్‌ నుంచి పీజీ వరకు ఆన్‌లైన్‌ క్లాసులు అందివ్వాలని 2013లో నిర్ణయించుకున్నారు.

బైజూస్‌
అప్పటికే ఇండియాలో ఇంటర్నెట్‌ వినియోగం సామాన్యులకు చేరువయ్యింది. తర్వాత స్మార్ట్‌ఫోన్‌ వినియోగం పెరిగిపోతుండటం గమనించి బైజూస్‌ పేరుతో 2015 ఆగస్టులో మొబైల్‌యాప్‌ని అందుబాటులోకి తెచ్చారు. పగలు రాత్రి తేడా లేకుండా పాఠాలు రూపొందించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటూ సమర్థంగా యాప్‌ను నిర్వహించారు. ఒక్క థియరీతోనే సరిపెట్టకుండా ప్రతీ సబ్జెక్టు సులభంగా అర్థం అ‍య్యలా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో అనతి కాలంలోనే 50 లక్షల మంది యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే అందులో 2.50 లక్షల మంది పెయిడ్‌ కస్టమర్లు ఉన్నారు.

పెట్టుబడుల వరద
రవీంద్రన్‌ స్థాపించిన బైజూస్‌ ఎడ్‌టెక్‌ యాప్‌లో అందిస్తున్న కంటెంట్‌కి ఉన్న ఎఫెక్ట్‌, స్టూడెంట్స్‌ ఫీడ్‌బ్యాక్‌తో పాటు బిజినెస్‌ మోడల్‌ గమనించిన ఆలిబాబా గ్రూపు టెన్‌సెంట్‌ మొదటిసారి బైజూస్‌లో భారీగా పెట్టుబడులు పెట్టింది. ఆ వెంటనే మార్క్‌ జుకర్‌బర్గ్‌తో పాటు వెంచర్‌ క్యాపిటలిస్టు కంపెనీలు ఈ జాబితాలో చేరిపోయాయి. అంతే బైజూస్‌ నెక్ట్‌ లెవల్‌కి వెళ్లేందుకు సమయం వచ్చినట్టయ్యింది. 

డెకాకార్న్‌
పెట్టుబడుల ప్రవాహం రావడంతో బైజూస్‌ యాప్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా షారూక్‌ఖాన్‌, మహేశ్‌బాబు వంటి స్టార్లు జతయ్యారు. ఇండియన్‌ క్రికెటర్ల జెర్సీలపై బైజూస్‌ తళుక్కుమంది. అంతే బైజూస్‌ యాప్‌ను మిలియన్ల కొద్ది స్టూడెంట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. తల్లిదండ్రులకు బైజూస్‌ కంటెంట్‌ పట్ల నమ్మకం ఏర్పడింది. మార్కెట్‌కి కావాల్సింది కూడా అదే. దీంతో 2015లో స్థాపించిన బైజూస్‌ కంపెనీ మార్కెట్‌ విలువ 2021 డిసెంబరు నాటికి 16.50 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. యూనికార్న్‌ హోదాను ఉఫ్‌మనిపించి డెకాకార్న్‌ జాబితాలో చేరిపోయింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్‌ విలువ ఇండియన్‌ కరెన్సీలో ఒక లక్షా ఇరవై వేల కోట్లకు పైమాటగానే ఉంది.

నవ్విస్తూ.. నేర్పిస్తూ..
బైజైస్‌ రవీంద్రన్‌ పట్టిందల్లా బంగారం అయ్యిందంటే అతని దగ్గర ఏ మంత్రదండం లేదు. ఉన్నదల్లా పాఠాలను భిన్నంగా చెప్పే నేర్పు. క్లాసు రూములో టీచర్లు సీరియస్‌గా చెప్పే పాఠాలను రవీంద్రన్‌ నవ్విస్తూ నేర్పిస్తాడు (లాఫ్‌ అండ్‌ లెర్న్‌). మార్కుల కోసమో, ర్యాంకుల కోసమో ఎవర్నో మెప్పించేందుకో కాకుండా.. ప్రతీ సబ్జెక్టుకు సంబంధించిన మూల విషయాలు విద్యార్థులకు అర్థమయ్యేలా సులభమైన పద్దతిలో నవ్వించే వివరణలతో ఆ పాఠాలు హాయిగా సాగిపోతాయి. ఈ చెవితో విన్నది ఆ చెవి గుండా బయటకు పోవడం కాకుండా బుర్రలో నిక్షిప్తమవుతాయి. అవే ఆ తర్వాత పరీక్షల్లో ఫలితాలుగా కనిపిస్తాయి. 

దివ్యమంత్రం
జీఆర్‌ఈ ఎంట్రన్స్‌ కోచింగ్‌ కోసం దివ్య గోకుల్‌నాథ్‌ అనే విద్యార్థి రవీంద్రన్‌ దగ్గర టీచర్‌గా జాయిన్‌ అయ్యింది. మిగిలిన విద్యార్థులకంటే భిన్నంగా ప్రశ్నలు అడగడంతో రవీంద్రన్‌కి ఆమెపై అభిమానం ఏర్పడింది. అదే కోచింగ్‌ సెంటర్‌లో కింది తరగతులకి లెక్కల క్లాస్‌ తీసుకోమ్మని ప్రోత్సహించాడు. అంతేకాకుండా ఇద్దరీ ఫేవరేట్‌ సబ్జెక్ట్‌ మ్యాథ్స్‌ కావడంతో.. ఓ రకంగా వాళ్లు గణితంలోనే మాట్లాడుకోవడం మొదలైంది. అలా లెక్కల చిక్కులతో వారు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. బైజూస్‌లో రూపొందించే ఆన్‌లైన్‌ పాఠాల రూపకల్పనలో దివ్యది కీలక పాత్ర. బైజూస్‌కి ఆమె కోఫౌండర్‌గా ఉండటంతో పాటు ప్రస్తుతం డైరెక్టరుగా కూడా వ్యవహరిస్తున్నారు. 

నాకు ఇదే ముఖ్యం
లక్ష కోట్ల రూపాయలకు చేరుకున్న బైజూస్‌ మార్కెట్‌ విలువపై రవీంద్రన్‌ స్పందిస్తూ.. ‘మార్కెట్‌ వ్యాల్యూ ఎంత ఉంది అనే దాని కంటే మేం చెప్పే పాఠాలు ఎంత సమర్థంగా ఉన్నాయి...  అది వినేవాళ్లకు ఎంత బాగా అర్థం అవుతుంది.. అనే దానిపైనే తన దృష్టి ఉంటుంది. మిగిలినవన్నీ దాని తర్వాతే అన్నారు. ఇక మార్కులు, ర్యాంకులు సాధించడం తమ టార్గెట్‌ కాదని పాఠం పూర్తిగా అర్థం అవడమే తమ లక్ష్యమని ఎప్పుడు చెబుతుంటారు. 
- సాక్షి, వెబ్‌ ప్రత్యేకం

చదవండి: చేతిలో చిల్లిగవ్వ లేదు.. ఇంగ్లీష్‌ రాదు.. ఇప్పుడు బిలియనీర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement