
న్యూఢిల్లీ: రెట్రో ట్యాక్స్ వివాదాలను సత్వరం పరిష్కరించే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కెయిర్న్ ఎనర్జీ సమర్పించిన ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం అంతర్జాతీయ కోర్టుల్లో భారత్‌పై వేసిన కేసులన్నింటినీ కెయిర్న్ ఉపసంహరించుకోవడం ప్రారంభిస్తుంది. ఇది పూర్తయ్యాక, కంపెనీకి ప్రభుత్వం దాదాపు రూ. 7,900 కోట్ల పన్నులను రీఫండ్ చేయనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కేసుల ఉపసంహరణకు మూడు–నాలుగు వారాలు పట్టొచ్చని వివరించాయి.
గత లావాదేవీలకు కూడా పన్నులు విధించేందుకు వెసులుబాటు నిచ్చే చట్ట సవరణ (రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్) ద్వారా ట్యాక్స్‌లు వసూలు చేయడంపై కెయిర్న్ సహా పలు కంపెనీలు, కేంద్రం మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో వివాదాస్పదం కావడంతో ఈ చట్టాన్ని పక్కన పెట్టి, ఆయా కంపెనీల నుంచి వసూలు చేసిన పన్నులను తిరిగి ఇవ్వడం ద్వారా వివాదాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని కేంద్రం భావించింది. అయితే, ఇందుకోసం భారత్‌పై అంతర్జాతీయ కోర్టుల్లో పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని సంస్థలకు షరతు విధించింది. దానికి అనుగుణంగానే కెయిర్న్ తాజా ఆఫర్ ఇచ్చింది.