ప్ర. నేను 31–07–2022న రిటర్న్ దాఖలు చేశాను. ఆ రోజు నాటికి రూ. 1,00,000 ట్యాక్స్ చెల్లించాలి. నగదు లేకపోవటం వల్ల ‘పే లేటర్‘ అని ఆప్షన్ పెట్టి ఫైల్ చేశాను. నిన్ననే ఆర్డర్లు వచ్చాయి. రూ. 5,000 పెనాల్టీ కట్టమని. ఏం చేయాలి? – విశ్వనాధ లక్ష్మీ, హైదరాబాద్
జ. చట్టప్రకారం ట్యాక్స్ కట్టలేని పరిస్థితుల్లో గడువు తేదీ లోపల రిటర్ను వేసుకోవడానికి అవకాశం ఇది. సాధారణంగా పూర్తిగా పన్నులు చెల్లించి, రిటర్నులు వేయాలి. విధిలేని పరిస్థితుల్లో ‘పే లేటర్‘ ఆప్షన్‌ను ఉపయోగించి కూడా రిటర్ను వేయవచ్చు. నిజానికి చాలామంది మీలాగే రిటర్నులు వేశారు. కానీ పెనాల్టీ రూ. 5,000 పడకుండా బయటపడవచ్చు. అయితే, జరుగుతున్నది ఏమిటంటే..
► సాధారణంగా ఇలాంటి రిటర్నుని డిఫెక్టివ్ రిటర్నుగా భావిస్తారు.
►డిఫెక్టివ్ రిటర్నుగా భావించినప్పుడు నోటీసు ఇచ్చి 15 రోజుల లోపు సర్దుబాటు చేస్తారు.
►అలా చేయకపోతే రిటర్ను వేసినట్లు కాదు. 31–07–2022 లోపల రిటర్ను వేసి, ఆ తేదీలోపల ‘వెరిఫికేషన్‘ పూర్తయితే, ఇటువంటి కేసుల్లో రూ. 5,000 చెల్లించమని ఆర్డర్లు రావటం లేదు. కానీ ఏదో ఒక కారణం వల్ల .. ఉదాహరణకు, సైటు మొరాయించడమో, రిజక్ట్ అవ్వటమో, ఇతర సాంకేతికలోపం వల్లో 31–07–2022 లోగా రిటర్ను వెరిఫికేషన్ పూర్తి కాకపోతే, రూ. 5,000 చెల్లించమని నోటీసులు వస్తున్నాయి. ఇంకా వివరంగా చెప్పాలంటే..
►మీ రిటర్ను ..డిఫెక్టివ్ రిటర్ను అయినట్లు
►మీరు పెనాల్టీ రూ. 5,000 చెల్లించాలి. ఎందుకంటే, రిటర్ను లేటుగా వేశారు కాబట్టి.
►ఆలస్యంగా వేసినందుకు 234 అ ప్రకారం వడ్డీ కూడా చెల్లించాలి.
►పన్నుభారం లేకపోతే 234 అ వడ్డీ పడదు.
►రిఫండు మీద వడ్డీ రాదు.
►నష్టాలుంటే రాబోయే సంవత్సరానికి సర్దుబాటు చేయరు.
►చెల్లించాల్సిన పన్నులు చెల్లించాలి.
►రివైజ్డ్ రిటర్న్ వేయనవసరం లేదు. రిటర్న్‌ని రివైజ్ చేయనక్కర్లేదు.
►నోటీసుకి జవాబు ఇవ్వాలి. జవాబు ఇవ్వటం అంటే కట్టిన చలాన్ల వివరాలు ఇవ్వడమే. చివరిగా చెప్పాలంటే ఈ ‘పే లేటర్‘ ఆప్షన్ కంటికి ఆకర్షణీయంగా కనబడేది. ‘దూరపు కొండలు నునుపు‘ అన్న సామెతలాంటిది. ఇదొక ‘చిక్కు‘ లాంటిది. పెనాల్టీ తప్పదు. వడ్డీ తప్పదు. వివరణ తప్పదు. సవరణ తప్పదు. జవాబు తప్పదు. చెల్లింపూ తప్పదు. అందుకే ‘పే లేటర్‘ జోలికి పోకండి. ఎలాగూ ట్యాక్స్ చెల్లించక తప్పదు, రిటర్ను వేయకాతప్పదు. ’ఆలస్యం అమృతం విషం’ అని గుర్తెరిగి ముందుగానే జాగ్రత్తలు తీసుకోండి.
పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్‌కు పంపించగలరు.
Comments
Please login to add a commentAdd a comment