ఓ సంస్థలో పని చేస్తున్న మీనా’కి అత్యవసరంగా డబ్బులు కావాల్సి వచ్చింది. వెంటనే తన పాత శాలరీ అకౌంట్ నుంచి ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్‌ను అమ్మి ఆర్ధిక సమస్య నుంచి బయటపడాలని అనుకుంది. వెంటనే మ్యూచువల్ ఫండ్స్‌ను అమ్మింది. ఆ డబ్బును తన పాత శాలరీ బ్యాంక్ అకౌంటుకు ట్రాన్స్‌ఫర్ చేసుకుంది. కానీ, అప్పుడే బ్యాంక్ అధికారులు ఆమెకు చావుకబురు చల్లాగా చెప్పారు.
ఏమని? మీ బ్యాంక్ అకౌంట్‌కు నాన్ మెయింటెన్స్ ఛార్జీలు ఉన్నాయి. ఇందుకోసం అదనపు ఛార్జీల పేరుతో అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్ మొత్తాన్ని తీసుకుంటున్నట్లు ఓ మెసేజ్ రూపంలో సమాచారం అందించారు. దీంతో ఆ మెసేజ్ చూసి షాక్ తిన్న ఆమె బ్యాంక్ అకౌంట్‌ను చెక్ చేసింది. బ్యాలెన్స్ జీరో.. పైగా బ్యాలెన్స్ నెగిటీవ్‌లోకి వెళ్లింది.
దీంతో మీనాకు ఏం చేయాలో పాలు పోలేదు. వెంటనే ఆర్దిక రంగంలో నిపుణురాలైన తన స్నేహితురాలికి ఫోన్ చేసి బ్యాంక్‌లో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పింది. మరి ఇంతకీ మీనా బ్యాంక్ నుంచి ఎదురైనా సమస్య నుంచి ఓ చిన్న సంతకంతో ఎలా భయటపడింది? మైనస్‌లోకి వెళ్లిన తన శాలరీ అకౌంట్‌ను నెగిటీవ్ లేకుండా ఏం చేసింది?
మైనస్ బ్యాలెన్స్‌తో ఇబ్బందులు
మీనా తన పాత సంస్థలో పనిచేసే సమయంలో ‘xyz’ అనే బ్యాంక్‌లో శాలరీ అకౌంట్ ఓపెన్ చేసింది. నాలుగేళ్ల తర్వాత మరో సంస్థకు వెళ్లింది. అక్కడ కూడా అదే xyz బ్యాంక్ శాలరీ అకౌంటేనని తెలుసుకుంది. తన పాత శాలరీ అకౌంట్‌ను ఓపెన్ చేసింది. అందులో ఇంకా మైనస్ బ్యాలెన్స్ (ఉదాహరణ) రూ.22,000 చూపిస్తుంది. ఆర్‌బీఐ రూల్స్ ప్రకారం.. అకౌంట్ బ్యాలెన్స్ నెగిటీవ్‌లో ఉండకూడదు. ఒకవేళ బ్యాలెన్స్ సున్నా అయితే బ్యాంక్‌లు ఫైన్ విధించకుండా ఆ అకౌంట్‌ను హోల్డ్‌లో పెట్టాలి.
ఈ ఆర్‌బీఐ రూల్ గుర్తు చేస్తూ మీనా తన బ్యాంక్ అకౌంట్‌లో మైనస్ బ్యాలెన్స్ రూ.22,000 ఎందుకు ఉన్నాయని బ్యాంక్ అధికారుల్ని ప్రశ్నించింది. మెయింటెయిన్ ఛార్జీల వల్ల నెగిటీవ్ బ్యాలెన్స్‌లోకి వెళ్లింది. కాబట్టి పైన పేర్కొన్న మొత్తాన్ని కట్టాల్సిందేనని ఆదేశించారు. బ్యాంక్ మేనేజర్‌ను అడిగినా లాభం లేకుండా పోయింది.
మీ ఒక్క సంతకంతో ఇలా బయటపడిండి
వెంటనే, తన స్నేహితురాలి సూచనతో సదరు బ్యాంక్ అధికారిక మెయిల్‌కు, తాను నివాసం ఉంటున్న స్థానిక ఆర్‌బీఐ రీజనల్ బ్రాంచ్‌కు కలిపి సమస్యను వివరిస్తూ ఫిర్యాదు చేసింది. ఆ మరుసటి రోజే ఆ బ్యాంకు మేనేజర్ మీనాకు ఫోన్ చేసి మీరు ఒక సంతకం చేస్తే చాలు అకౌంట్‌ని జీరో బ్యాలెన్స్ చేస్తామని చెప్పారు. వెంటనే బ్యాంక్‌ను సందర్శించి తన సంతకంతో సమస్యను పరిష్కరించుకుంది. ఇలా ఒక్క మీనా’నే కాదు... బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్క ఖాతాదారులు ఈ తరహా సమస్య నుంచి బయట పడొచ్చని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.
బ్యాంక్‌లకు ఆర్‌బీఐ ఆదేశాలు
కస్టమర్లకు బ్యాంకులు విధిస్తున్న అదనపు ఛార్జీల అంశం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. సమావేశాల సందర్భంగా పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ ఖరాద్ మాట్లాడుతూ.. 2018 నుంచి దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఖాతాదారుల నుంచి అదనపు ఛార్జీలు ఎంత విధించాయో వివరించారు. అందులో మినిమమ్ బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోవడంపై రూ.21,044.4 కోట్లు, అదనపు ఏటీఎం లావాదేవీల కోసం రూ.8,289.3 కోట్లు, ఎస్ఎంఎస్ సేవల ద్వారా రూ.6,254.3 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు.
దీనిపై సోషల్ మీడియాలో పెద్దు ఎత్తున చర్చ జరిగింది. అదే సమయంలో ఆర్‌బీఐ సైతం.. బ్యాంక్‌లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఖాతాదారులకు ఒప్పందం ప్రకారం విధించే వడ్డీని మించి అదనపు ఛార్జీలను వసూలు చేయొద్దని ఆర్‌బీఐ బ్యాంకులు సూచించింది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది.
చదవండి👉 ఇళ్ల కొనుగోలు దారులకు ఆర్‌బీఐ భారీ షాక్? వచ్చే ఏడాది వరకు తప్పదంట
Comments
Please login to add a commentAdd a comment