న్యూఢిల్లీ: దేశంలో సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ తయారీ ప్లాంట్ల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ విభాగంలో అంతర్జాతీయంగా దిగ్గజ సంస్థలను భారత్‌కు రప్పించడంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ప్రయత్నాలు మొదలుపెట్టింది. తైవాన్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, వీఐఏ టెక్నాలజీస్, యునైటెడ్ మైక్రో ఎలక్ట్రానిక్ కార్పొరేషన్, ఇంటెల్, మైక్రాన్ టెక్నాలజీ, ఎన్‌ఎక్స్‌పీ సెమీకండక్టర్స్, టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్, ఫుజి ఎలక్ట్రిక్ కంపెనీ, ప్యానాసోనిక్, ఇన్ఫీనియాన్ టెక్నాలజీస్ ఏజీ, ఎస్‌టీ మైక్రో ఎలక్ట్రానిక్స్, ఎస్‌కే మైనిక్స్, శామ్‌సంగ్ కంపెనీలతో ఒక జాబితాను రూపొందించింది. అంతర్జాతీయ కంపెనీలతోపాటు, దేశీయ కంపెనీల జాయింట్ వెంచర్ల నుంచి ఆసక్తి వ్యక్తీకరణలకు ఇప్పటికే ఎలక్ట్రానిక్స్ శాఖా ఆహ్వానం పలికింది. ప్రాథమిక స్థాయి ప్రాజెక్టు నివేదికను సమర్పించేందుకు ఈ నెల 31వతేదీ వరకు గడువు ఇచ్చింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం కింద అంతర్జాతీయంగా పేరొందిన కంపెనీలను రాబట్టే చర్యలను మొదలు పెట్టింది. 400 డాలర్లకు పైగా (రూ.30వేలు) ఖరీదైన ల్యాప్‌టాప్‌లను తయారు చేసే, 200 డాలర్లకు పైగా ఖరీదైన ట్యాబ్లెట్లను (రూ.15వేలు) తయారు చేసే సంస్థలకు, సర్వర్లు, పర్సనల్ కంప్యూటర్ల తయారీ సంస్థలకు పీఎల్‌ఐ పథకం కింద విక్రయాలపై 2–4 శాతం వరకు ప్రోత్సాహకంగా ఇచ్చే ప్రణాళికలతో ఎలక్ట్రానిక్స్ శాఖా ఉంది.
మూడు దశల్లో..
తైవాన్‌కు చెందిన క్వాంటా కంప్యూటర్ ఇన్‌కార్పొరేటెడ్, ఫాక్స్‌కాన్, ఏసర్, ఆసుస్, ఇన్వెంటెక్ కార్పొరేషన్.. అమెరికాకు చెందిన డెల్, యాపిల్, సిస్కో సిస్టమ్స్, ఫ్లెక్స్, భారత్‌కు చెందిన కోకోనిక్స్, హెచ్‌ఎల్‌బీఎస్ టెక్నాలజీస్‌లను ఆకర్షించే ప్రణాళికలతో కేంద్ర ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖా ఉంది. పీఎల్‌ఐ పథకం కింద రూ.7,350 కోట్ల ప్రోత్సాహకాలను ఇవ్వనుంది. ఫ్యాబ్రికేషన్ ప్లాంట్లను రాబట్టడంలో మూడు దశలను అనుసరించనుంది. మొదట ఇంటెగ్రేటెడ్ డిజైన్ తయారీదారులు, ఫౌండ్రీలు లేదా భారత కంపెనీల భాగస్వామ్యంతో ఫ్యాబ్రికేషన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయదలిచిన సంస్థలను తీసుకురావాలన్న ప్రణాళికతో ఉంది. లేదా ఇప్పటికే ఉన్న ప్లాంట్ విస్తరణ ప్రతిపాదలను అయినా అనుమతించనుంది. ప్రతీ నెలా 30,000 వేఫర్ స్టార్స్ సామర్థ్యంతో (300ఎంఎం వేఫర్ సైజ్) కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సయిడ్ సెమీకండక్టర్ టెక్నాలజీతో చిప్‌లను తయారు చేయాల్సి ఉంటుంది. ఇక రెండో దశలో 200 ఎంఎం వేఫర్‌సైజ్‌తో కూడిన చిప్‌లను అత్యాధునిక టెక్నాలజీల సాయంతో తయారు చేసే సంస్థలకు ఆహ్వానం పలకనుంది. మూడో దశలో భారత సంస్థల భాగస్వామ్యంతో సెంమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్లను ఏర్పాటు చేసే సంస్థలను తీసుకురానుంది.
ఎటువంటి మద్దతుకైనా సిద్ధమే..
తమ నుంచి ఏ తరహా ఆర్థిక మద్దతు కావాలో చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సంస్థలను కోరింది. ఈక్విటీ రూపంలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ డేలా వయబులిటీ గ్యాప్ ఫండ్, దీర్ఘకాల వడ్డీ లేని రుణాలు, పన్ను ప్రయోజనాలు, మౌలిక సదుపాయాలు.. ఏ విధమైన మద్దతు కావాలో చెప్పాలని కోరింది. ఆసక్తి కలిగిన కంపెనీలు తమ పెట్టుబడుల ప్రతిపాదనలను, టెక్నాలజీల వినయోగం వివరాలను సమర్పించాలంటూ కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖా ఇప్పటికే స్పష్టం చేసింది. కంపెనీల నుంచి వచ్చే ప్రతిపాదనల ఆధారంగా దేశంలో ఫ్యాబ్రికేషన్ సెమీ కండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ఆకర్షణీయమైన పథకాన్ని రూపొందించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment