
న్యూఢిల్లీ: ఈ ఏడాది ద్వితీయార్థంలో (జులై–డిసెంబర్) అప్రెంటీస్‌లను గణనీయంగా తీసుకోవడంపై దేశీయంగా దాదాపు 45 శాతం కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయి. జనవరి–జూన్ వ్యవధితో పోలిస్తే ఇది 4 శాతం అధికం. అప్రెంటిస్‌ల నియామకాల ద్వారా నిపుణులు, సిబ్బంది కొరత సమస్యను అధిగమించవచ్చని సంస్థలు భావిస్తున్నాయి. నేషనల్ ఎంప్లాయబిలిటీ థ్రూ అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రాం (టీమ్‌లీజ్ స్కిల్స్ యూనివర్సిటీలో భాగం) ఈ ఏడాది ద్వితీయార్థంపై రూపొందించిన అప్రెంటిస్‌షిప్ అంచనాల నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 64 శాతం కంపెనీలు ప్రస్తుతం తాము తీసుకుంటున్న అప్రెంటిస్‌ల సంఖ్యను మరింత పెంచుకోవాలని భావిస్తున్నాయి. ప్రథమార్ధంతో పోలిస్తే ఇది ఆరు శాతం అదికం. 14 నగరాల్లో, 18 రంగాలకు చెందిన 833 సంస్థలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. వీటిలో 17 రంగాల్లో అప్రెంటిస్‌ల నియామకాలపై ఆశావహ అంచనాలు నెలకొన్నాయి. హైరింగ్ విషయంలో తయారీ.. ఇంజినీరింగ్ (68 శాతం), రిటైల్ (58 శాతం), ఆటోమొబైల్.. అనుబంధ రంగాలు (58 శాతం) టాప్‌లో ఉన్నాయి. మెట్రో, మెట్రోయేతర నగరాల్లోనూ అప్రెంటిస్‌ల నియామకాలపై సానుకూల అంచనాలు ఉన్నాయి.
మెరుగ్గా లక్నో, అహ్మదాబాద్..
మెట్రో నగరాలతో పోలిస్తే నియామకాల విషయంలో లక్నో (79 శాతం), అహ్మదాబాద్ (69 శాతం) మెరుగ్గా ఉన్నాయి. ఇక మెట్రో నగరాల్లో చెన్నై (65 శాతం), ఢిల్లీ (58 శాతం).. అప్రెంటిస్‌లకు ఆకర్షణీయంగా నిల్చాయి. మహిళలకన్నా (32 శాతం) పురుషులను (36 శాతం) నియమించుకోవడంపై కంపెనీలు ఎక్కువ ఆసక్తిగా ఉన్నాయి. వ్యవసాయ, తయారీ పరిశ్రమల్లో పురుషుల కన్నా (వరుసగా 29 శాతం, 28 శాతం) మహిళలకు (33 శాతం, 34 శాతం) అధిక ప్రాధాన్యం లభిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment