యాప్‌ల కొనుగోళ్లకు కంపెనీల పన్నాగం.. ఎలా మోసం చేస్తున్నారంటే.. | Consumers Experienced App Subscription Trap | Sakshi
Sakshi News home page

యాప్‌ల కొనుగోళ్లకు కంపెనీల పన్నాగం.. ఎలా మోసం చేస్తున్నారంటే..

Published Tue, Feb 20 2024 1:16 PM | Last Updated on Tue, Feb 20 2024 2:06 PM

Consumers Experienced App Subscription Trap - Sakshi

మొబైల్‌ అప్లికేషన్‌ స్టోర్స్‌ నుంచి యాప్‌లు లేదా ఇతరత్రా సాఫ్ట్‌వేర్‌లను కొనుగోలు చేస్తున్న వారిలో చాలా మంది సబ్‌స్కిప్షన్‌ వలలో చిక్కుకుంటున్నారు. ముందుగా చెప్పకుండా తర్వాత వడ్డించే ఛార్జీలతో (హిడెన్‌ చార్జీలు) నానా తంటాలు పడుతున్నారు. 

ఆన్‌లైన్‌ రీసెర్చ్‌ సంస్థ లోకల్‌సర్కిల్స్‌ నిర్వహించిన సర్వేలో సగం మంది పైగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు. ఉచిత యాప్‌ను లేదా వన్‌–టైమ్‌ సర్వీస్‌ను ఎంచుకున్న వినియోగదారులు ఆ తర్వాత సబ్‌స్కిప్షన్‌ ఉచ్చులో పడుతున్న సందర్భాలు పెరుగుతున్న నేపథ్యంలో లోకల్‌సర్కిల్స్‌ సర్వే ప్రాధాన్యం సంతరించుకుంది.

డార్క్‌ ప్యాటర్న్‌లను (మోసపూరితంగా కస్టమర్లను ఆకర్షించడం) నిషేధిస్తూ కేంద్రీయ వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ  ప్రాధికార సంస్థ (సీసీపీఏ) నవంబర్‌ 30న ఒక గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో 13 రకాల డార్క్‌ ప్యాటర్న్‌లను ప్రస్తావించింది. అప్పటికప్పుడు వెంటనే చర్యలు తీసుకునేలా తొందరపెట్టడం, సబ్‌స్కిప్షన్‌ వల వేయడం, విసిగించడం మొదలైనవి వీటిలో ఉన్నాయి. తాజాగా లోకల్‌సర్కిల్స్‌ సర్వేలో వెల్లడైన మరిన్ని విషయాలను చూస్తే.. 

  • యాప్‌ ప్లాట్‌ఫాంలు, ఎస్‌ఏఏఎస్‌ ప్లాట్‌ఫాంల ద్వారా వన్‌–టైమ్‌ సాఫ్ట్‌వేర్‌ లేదా సర్వీస్‌ అంటూ తమకు అంటగట్టిన వాటిల్లో చాలా మటుకు సబ్‌స్క్రిప్షన్‌ కోసం పన్నిన పన్నాగాలేనని సర్వేలో పాల్గొన్న వారిలో 67 శాతం మంది వినియోగదారులు తెలిపారు. 
  • కొనుగోలుకు సంబంధించి చెల్లింపులు జరిపేటప్పుడు ముందుగా చెప్పని బోలెడన్ని హిడెన్‌ చార్జీలు తెరపైకి వచ్చినట్లు 71 శాతం మంది పేర్కొన్నారు. 
  • యాప్‌ ప్లాట్‌ఫాంలు, ఎస్‌ఏఏఎస్‌ ప్లాట్‌ఫాంల ద్వారా తాము కొన్నది ఒకటైతే తమకు అందినది మరొకటని 50 శాతం మంది వినియోగదారులు తెలిపారు. 
  • యాప్‌ ప్లాట్‌ఫాంల ద్వారా తాము డౌన్‌లోడ్‌ చేసుకున్న కొన్ని యాప్‌లలో మాల్‌వేర్‌ ఉందని, ఫలితంగా తమ డివైజ్‌ల నుంచి ప్రైవేట్‌ సమాచారం చోరీకి గురైందని 25 శాతం మంది వినియోగదారులు వివరించారు.  

ఇదీ చదవండి: ఆన్‌లైన్‌ గేమ్‌ల కోసం ప్రభుత్వంతో ఒప్పందం.. ఎందుకంటే..

  • యాప్‌లు లేదా సాఫ్ట్‌వేర్‌ సర్వీసుల యూజర్లపై 2023 డిసెంబర్‌ 1 నుంచి 2024 జనవరి 30 వరకు 331 జిల్లాల్లో నిర్వహించిన ఈ సర్వేకు 44,000 పైచిలుకు సమాధానాలు వచ్చాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement