హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వంట నూనెల ధరలు తగ్గాయి. బ్రాండ్, నూనె రకాన్నిబట్టి గరిష్ట ధరపై 10–15 శాతం తగ్గిందని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఈఏ) సోమవారం ప్రకటించింది. ధరలు సవరించిన కంపెనీల జాబితాలో అదానీ విల్మర్ (ఫార్చూన్ బ్రాండ్), రుచి సోయా (మహాకోష్, సన్‌రిచ్, రుచి గోల్డ్, న్యూట్రెల్లా), ఇమామీ (హెల్తీ అండ్ టేస్టీ), జెమిని (ఫ్రీడమ్), బాంజ్ (డాల్డా, గగన్, చంబల్ బ్రాండ్స్) వంటివి ఉన్నాయి. అంతర్జాతీయంగా అధిక ధరల కారణంగా గత కొన్ని నెలలుగా దేశీయంగా వంట నూనెలు ప్రియం కావడం వినియోగదార్లతోపాటు ప్రభుత్వాలను కలవరపెడుతోంది.
ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది అనేకసార్లు శుద్ధి, ముడి వంట నూనెల దిగుమతి సుంకాలను తగ్గించింది. సరఫరాను పెంచడానికి లైసెన్స్ లేకుండా శుద్ధి చేసిన పామాయిల్‌ను దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం డిసెంబర్ 2022 వరకు వ్యాపారులను అనుమతించింది. ముడి పామాయిల్, కొన్ని ఇతర వ్యవసాయ వస్తువుల కొత్త డెరివేటివ్ ఒప్పందాలను ప్రారంభించడాన్ని మార్కెట్ నియంత్రణ సంస్థ నిషేధించింది. భారత్‌లో ఏటా 2.25 కోట్ల టన్నుల వంట నూనెల వినియోగం అవుతోంది. ఇందులో దిగుమతుల వాటా ఏకంగా 65 శాతం దాకా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment