న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ మార్చి 31వ తేదీతో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) ఆర్థిక సంవత్సరంలో 8.9 శాతం వృద్ధి నమోదుచేసుకుంటుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తన నివేదికలో అంచనావేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే 2022–23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.8 శాతంగా ఉంటుందని పేర్కొన్న నివేదిక, మౌలిక రంగంపై ప్రభుత్వ వ్యయాలు, ప్రైవేటు పెట్టుబడులు ఇందుకు దోహదం చేస్తాయని వివరించింది.
అయితే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తదనంతర పరిణామాలు ఎకానమీకి తీవ్ర ప్రతికూల అంశాలని పేర్కొంది. ప్రత్యేకించి క్రూడ్ ధరల తీవ్రతను ప్రస్తావించింది. ‘ఇండియా అవుట్‌లుక్, ఫిస్కల్ 2023’ పేరుతో రూపొందించిన నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను విశ్లేషిస్తే...
► కోవిడ్–19 మహమ్మారికి సంబంధించి మూడవవేవ్ ఒమిక్రాన్ ప్రభావం అంతగా లేకపోవడం ఎకానమీకి లాభించింది. అయితే తద్వారా లభించిన ప్రయోజనం ఎకానమీకి ఏదైనా ఉందంటే, అది ఉక్రెయిన్‌పై రష్యా దాడి నుండి ఉత్పన్నమైన భౌగోళిక రాజకీయ కలహాల ద్వారా నీరుగారిపోయే పరిస్థితి తలెత్తింది. యుద్ధం ప్రపంచ వృద్ధి మందగమనానికి దారితీసే అంశం. చమురు సంబంధిత ఉత్పత్తుల ధరలు దీనివల్ల భారీగా పెరుగుతాయి. ప్రపంచ వృద్ధికి పొంచిఉన్న సవాళ్లలో ఇది తీవ్రమైనది. ఇది దేశీయ ఎకానమీపై కూడా తీవ్ర ప్రతికూలత చూపుతుంది.
► ప్రైవేటు వినియోగం ఇంకా బలహీనంగానే కొనసాగుతోంది. ప్రభుత్వం నుంచి ద్రవ్యపరమైన మద్దతు కూడా అంతగా లేదు.
► రిటైల్‌ద్రవ్యోల్బణం విషయానికొస్తే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది 5.4 శాతం వద్ద స్థిరంగా ఉంటుంది. అయితే దీనికి ముడి చమురు ధర సగటు బ్యారల్‌కు 85 నుంచి 90 డాలర్ల మధ్య ఉండాలి. గత సంవత్సరం ప్రకటించిన ఎక్సైజ్ సుంకం తగ్గింపులను పరిగణనలోకి తీసుకోవాలి.
► చమురు ధరల తీవ్రత దీర్ఘకాలం కొనసాగితే ఎకానమీ పురోగతికి తీవ్ర విఘాతం కలుగుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న సూచనల ప్రకారం వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2–6 శాతం శ్రేణిలో కొనసాగాలి. అయితే జనవరిలో ఈ రేటు నిర్దేశ శ్రేణికి మించి 6.01 శాతంగా నమోదయ్యింది. రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగటున 5.3 శాతంగా కొనసాగుతుందని, 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 4.5 శాతానికి దిగివస్తుందని ఆర్‌బీఐ గత జరిగిన జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా అంచనావేసింది. యుద్ధం, క్రూడ్ ధరల తీవ్రత కొనసాగితే ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. 2022–23లో క్రూడ్ బ్యారల్ ధర 75 డాలర్లగా లెక్కించి, ఈ ప్రాతిపదిన బడ్జెట్ రూపకల్పన జరిగింది. భౌగోళిక ఉద్రిక్తతలు ఈ అంచనాలను దెబ్బతీయవచ్చు.
►వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక విధానాల అమల్లో కొంత దూకుడును ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ఉపాధి కల్పించే పథకాల ప్రకటన, ఆహార సబ్సిడీలకు కేటాయింపులను పెంచడం, పెట్రోలియం ఉత్పత్తులపై సుంకాన్ని తగ్గించడం వంటి చర్యలను చేపట్టాల్సి ఉంటుంది. మహమ్మారి వల్ల తీవ్రంగా నష్టపోయిన వర్గానికి ఈ చర్యలు దోహదపడతాయి. అలాగే ఈ చర్యల వల్ల ప్రైవేట్ వినియోగ డిమాండ్ స్థిరంగా పురోగమిస్తుంది.
► ముడి చమురు ధరల తీవ్రత వల్ల, దిగుమతుల భారం పెరిగి 2022– 2023 ఆర్థిక సంవత్సరంలో దేశ కరెంట్ ఖాతా లోటు (దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) 2.2 శాతానికి పెరుగుతుందని అంచనా. సాధారణంగా ముడి చమురు ధరలో 10 డాలర్ల పెరుగుదల వల్ల క్యాడ్ 40 బేసిస్ పాయింట్లు (జీడీపీలో) పెరుగుతుంది.
కార్పొరేట్ రంగం ఇప్పటికి సానుకూలం
రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ నివేదిక ప్రకారం, చమురు ఎక్కువ కాలం పాటు బ్యారెల్‌కు 100 డాలర్లకు మించి కొనసాగితే ఎకానమీలోని పలు విభాగాలపై దీని ప్రతికూల ప్రభావం ఉంటుంది. పలు భారత్ కంపెనీల నిర్వహనా లాభాలు భారీగా పడిపోతాయి. ఇప్పటి వరకూ పరిస్థితిని పరిశీలిస్తే, దాదాపు 700 దేశీయ కంపెనీల స్థూల ఆదాయాలు బాగున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వరుసగా రెండవ ఏడాది 20 శాతం వృద్ధిని నమోదుచేసుకునే పరిస్థితి ఉంది. అయితే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవలు, బీమా రంగాలు ఈ విషయంలో వెనుకబడి ఉన్నాయి.
భౌగోళిక రాజకీయాలు, ఇతర ఊహించని సంఘటనలు ఎదురుకాకుంటే, 2022–23లో ఆర్థిక రికవరీ విస్తృత ప్రాతిపదికన ఉంటుంది. 10 నుంచి 14 శాతం కార్పొరేట్ ఆదాయ వృద్ధి నమోదవుతుందని భావిస్తున్నాం. పరిశ్రమలకు సంబంధించి కేంద్రం ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) వంటి పథకాలు ఎంతో ప్రయోజనం చేకూర్చుతాయి. 2019–20 ఆర్థిక సంవత్సరంతో ముగిసిన త్రైమాసికంలో పారిశ్రామిక మూలధన పెట్టుబడులు రూ.3 నుంచి 3.5 లక్షల కోట్లు ఉంటే, 2025–25 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ శ్రేణి రూ.4 నుంచి 4.5 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉంది. భారతదేశ పెట్టుబడి దృష్టి ఇప్పుడు గ్రీన్ (పర్యావరణ అనుకూల) క్యాపిటల్ వ్యయం వైపు మళ్లుతోంది. 2023 నుండి 2030 ఆర్థిక సంవత్సరం మధ్య వార్షికంగా రూ. 2.85 లక్షల కోట్లకు పైగా ఈ విభాగాలపై వ్యయం ఉంటుందని అంచనా. ఈ కాలంలో వార్షికంగా మొత్తం పెట్టుబడులలో దాదాపు 15–20 శాతం మౌలిక, పారిశ్రామిక రంగాల్లో ఉంటాయని భావిస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment