న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై ఏ క్షణమైనా రష్యా మరింత భీకర దాడులు జరపవచ్చన్న విశ్లేషణల నేపథ్యంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సేంజీలో క్రూడ్ ఆయిల్, బంగారం ధరలు మంగళవారం ఒక్కసారిగా భగ్గుమన్నాయి.
జెట్ స్పీడ్‌తో
బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర క్రితం ముగింపుతో పోల్చితే 10 డాలర్లలకు పైగా పెరిగి (10 శాతం పైగా అప్) 111.70 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక నైమెక్స్ క్రూడ్ కూడా ఇదే స్థాయిలో ఎగసింది. ఇప్పటి వరకూ క్రూడ్ గరిష్ట స్థాయి 147 డాలర్లు. ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో 2008 జూలైలో క్రూడ్ ఈ స్థాయిని చూసింది.
అదే బాటలో బంగారం
ఇక బంగారం ఔన్స్ (31.1 గ్రాములు) ధర 36 డాలర్లు పెరిగి, 1,938 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలర్ ఇండెక్స్ ఒకశాతం లాభంతో 97.50 వద్ద ట్రేడవుతుండగా, డాలర్‌తో రూపాయి విలువ భారీ నష్టంతో 76కు చేరువలో ఉంది.
ప్రపంచ మార్కెట్లు క్రాష్
ఉక్రెయిన్ నగరాలపై రష్యా భీకర దాడులతో విరుచుకుపడుతున్న నేపథ్యంలో మంగళవారం ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలాయి. యూరప్‌లో బ్రిటన్ మార్కెట్ రెండు శాతం క్షీణించింది. జర్మనీ, ఫ్రాన్స్ స్టాక్ సూచీలు నాలుగు శాతం నష్టపోయాయి. అమెరికా నాస్‌డాక్ ఇండెక్స్ ఒకశాతం, యూఎస్ 500 సూచీ రెండు శాతం నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగిన రష్యాను కట్టడి చేసేందుకు రష్యా బ్యాంకులకు అమెరికా, దాని మిత్ర దేశాలు స్విఫ్ట్ సేవలను నిలిపివేశాయి. ఫలితంగా ఆ దేశ కరెన్సీ రూబెల్ మరోసారి తాజాగా కనిష్టానికి పతనమైంది.
బల్క్ డీజిల్ ధరల పెంపు
నవంబరు మొదటి వారం నుంచి రిటైల్ పెట్రోలు, డీజిల్ ధరలు పెంపు నుంచి సామాన్యులకు ఊరట లభిస్తోంది. కానీ ఉక్రెయిన్ ఉద్రికత్తత మొదలైనప్పటి నుంచి క్రూడ్ అయిల్ ధరలు పెరుగుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం, ఆయిల్ కంపెనీలు రిటైల్ చమురు ధరల పెంపును వాయిదా వేస్తున్నాయి. కానీ ఈ లోటును భర్తీ చేసుకునేందుకు బల్క్ డీజిల్ ధరలను భారీగా పెంచాయి.
రిటైల్ కంటే ఎక్కువ
2022 ఫిబ్రవరి వరకు కూడా రిటైల్ డీజిల్‌తో పోల్చితే బల్క్ డీజిల్ ధర లీటరుకు కనీసం రూ. 4 తక్కువకే లభించేంది. అందువల్లే ఆర్టీసీ వంటి కార్పోరేట్ సంస్థల తరహాలో అనేక కంపెనీలు, అపార్ట్‌మెంట్ సొసైటీలు భారీగా బల్క్ డీజిల్‌ని కొనుగోలు చేసేవి. ఆయిల్ కంపెనీలు సైతం ముందుస్తు ఆర్డర్లపై బల్క్ డీజిల్‌ను ట్యాంకర్ల ద్వారా హోం డెలివరీ చేసేవి. కానీ గత కొన్ని వారాలుగా బల్క్ డీజిల్ ధరలను ఇష్టారీతిన పెంచుతూ పోతున్నారు. ఫలితంగా లీటరు రిటైల్ డీజిల్ కంటే బల్క్ డీజిల్ ధరనే ఎక్కువ అయ్యే స్థాయికి చేరుకుంది.
మారిపోతున్నారు
ప్రస్తుతం హైదరాబాద్‌లో రిటైల్ డీజిల్ లీటరు ధర రూ.94.62లు ఉండగా బల్క్ డీజిల్ 103.70కి చేరుకుంది. అంటే రిటైల్ ధర కంటే బల్క్ ధరనే ఒక లీటరకు రూ.9 ఎక్కువగా ఉంది. దీంతో బల్క్ డీజిల్ కొనాలంటే కార్పోరేట్ సంస్థలు బడా వినియోగదారులు వెనకడుగు వేస్తున్నారు. శ్రమతో కూడిన వ్యవహారమైనా రిటైల్ బంకుల దగ్గరే డీజిల్ పోయించుకుంటున్నారు. ఇప్పటికే ఆర్టీసీ బల్క్ డీజిల్‌కి స్వస్తి పలికి రిటైల్ బంకుల దగ్గర డీజిల్ పోయించుకుంటోంది. రైల్వే సైతం ఇదే బాట పట్టింది. ఒక్క తెలంగాణనే పరిశీలిస్తే ప్రతీ నెల 67,800 లీటర్ల బల్క్ డీజిల్ అమ్ముడవుతోంది. ఇందులో ఒక్క హైదరాబాద్ నగరం వాటానే 40,680 లీటర్లుగా ఉంది. కానీ ప్రస్తుతం పెరిగిన ధరలతో ఈ డిమాండ్ మొత్తం హుష్ కాకి అయ్యే పరిస్థితి నెలకొంది. బల్క్ డీజిల్ కస్టమర్లు రిటైల్ బంకులకు మళ్లడంతో అక్కడ రద్దీ పెరిగిపోతోంది.
ధరల పెంపు
బల్క్‌డీజిల్ ధరల పెంపు ఆర్టీసీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో ధరల పెంపు అంశాన్ని తెలంగాణ ఆర్టీసీ పరిశీలిస్తోంది. యుద్ధం తీవ్రత పెరగడం రష్యాలపై ఆంక్షలు పెరగడంతో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. దీనికి తగ్గట్టు దేశీయంగా రేపోమాపో ధరల సవరణ గ్యారెంటీ అనే అభిప్రాయం నెలకొంది. దీంతో నష్టాలను తగ్గించుకునేందుకు ముందుగానే పెంపు దిశగా ఆలోచన చేస్తోంది ఆర్టీసీ. ప్రస్తుత అంచనాల ప్రకారం కిలోమీటరుకు సగటున 40 పైసల వంతున ఛార్జీలు పెంచే అవకాశం ఉంది.
వంటగ్యాస్ కూడా
రష్యా చేపట్టిన దండయాత్ర ఎఫెక్ట్‌తో గ్యాస్ , పామాయిల్ ధరలు కూడా పెరిగే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను 105 రూపాయలు పెంచాయి ఆయిల్ సంస్థలు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత 14.2 కేజీల వంట గ్యాస్‌సిలిండర్ ధర 50 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే సన్‌ఫ్లవర్, పామాయిల్ వంటనూనె ధరలు లీటరకు సగటున 20 రూపాయలు పెరిగాయి.
చదవండి: Russia: ఆర్థిక ఆంక్షలు.. ప్రభావితమయ్యే రష్యన్ కుబేరులు
Comments
Please login to add a commentAdd a comment