సాగు భూమిలో సిరులు పండించండి ఇలా... | Cultivate veins in arable lands | Sakshi
Sakshi News home page

సాగు భూమిలో సిరులు పండించండి ఇలా...

Published Mon, Aug 3 2020 5:28 AM | Last Updated on Mon, Aug 3 2020 5:28 AM

Cultivate veins in arable lands - Sakshi

ఆరోగ్యాన్నిచ్చే ఆహారం, ప్రశాంతతో కూడిన ఆరోగ్యకరమైన జీవనశైలి.. వ్యాధి నిరోధకత ప్రాముఖ్యాన్ని కరోనా మహమ్మారి దాదాపు అందరికీ తెలిసేలా చేసింది. ఎంతో దూరంలో ఉన్నా కానీ ఇంటి నుంచే పని చేసే సౌలభ్యాన్ని (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌) తీసుకొచ్చింది. దీంతో పల్లెకు పోయి ప్రశాంతంగా జీవించేద్దాం అన్న ధోరణి చాలా మందిలో కలిగింది. అందుకే నగరాలు, పట్టణాల నుంచి పల్లెలకు వలసలు పెరిగిపోయాయి. పనిలో పనిగా పల్లె పట్టున పచ్చని పొలాల్లో సాగు చేసుకుంటూ జీవించడంలో ప్రశాంతతను అనుభవిద్దామన్న అభిలాష పెరుగుతోంది.

పట్టణ వాసుల్లో సాగు పట్ల మమకారం పెరగడం కరోనా ముందు నుంచే ఉంది. కానీ, కరోనా ఆగమనంతో అది కాస్త బలపడుతోంది. ఈ పరిణామాలు వ్యవసాయ భూములకు డిమాండ్‌ను తీసుకొస్తున్నాయి. సాగు భూములపై ఇన్వెస్ట్‌ చేద్దామన్న ఆసక్తిని కలిగిస్తున్నాయి. మరి పెట్టుబడుల పరంగా సాగు భూములు సిరులు కురిపిస్తాయా? దీనికి సమాధానం వెతుక్కునే ముందు.. ఇందులో ఉండే కష్ట, నష్టాల గురించి తప్పక తెలుసుకోవాలి. ఆ వివరాలను అందించే కథనమే ఇది.

వ్యవసాయ భూములపై పెట్టుబడులకు ఆకర్షణీయమైన అంశాలు కొన్ని ఉన్నాయి. మీరు రియల్‌ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటే.. సంప్రదాయంగా వాణిజ్య ఆస్తులైన మాల్స్, కార్యాలయాలు, రిటైల్‌ స్టోర్ల స్థలాలతోపాటు నివాసిత భవనాలు అందుబాటులో ఉంటాయి. కానీ, వీటన్నింటిలోనూ రిస్క్‌ పాళ్లు ఎక్కువ. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగ వృద్ధి అన్నవి కొత్త థీమ్‌లుగా అవతరిస్తున్నాయి.

గ్రామీణాభివృద్ధిపై ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఫోకస్‌ పెడుతున్నాయి. ఈ క్రమంలో వ్యవసాయ భూములపై పెట్టుబడులు భవిష్యత్తులో మంచి రాబడులకు అవకాశం కల్పించేవేనంటున్నారు నిపుణులు. సంప్రదాయ రియల్‌ఎస్టేట్‌ సాధనాలతో పోలిస్తే సాగు భూముల కొనుగోలులో సౌలభ్యత కూడా ఉంది. తక్కువ పెట్టుబడి ఉన్నా సాగుభూమిని సొంతం చేసుకోవచ్చు.

ఎకరం రూ.2 లక్షల నుంచి కూడా అందుబాటులో ఉండడం ఇందుకు అనుకూలం. ఒకవేళ ఫ్లాట్‌ కొనుగోలు చేయా లంటే కనీసం రూ.20–30 లక్షలు అయినా ఉండాల్సిందే. ఒకవేళ నగరం/పట్టణానికి ఆమడ దూరంలో చిన్న ప్లాట్‌ను తక్కువ పెట్టుబడికి కొనుగోలు చేసుకున్నా.. దానిపై రెగ్యులర్‌గా వచ్చే రాబడులు ఏవీ ఉండవు. పైగా ఆ ప్లాట్‌ సంరక్షణ బాధ్యత కూడా ఉంటుంది.

కానీ, సాగు భూమిపై ఎంతో కొంత రాబడి కొనుగోలు చేసిన తర్వాత నుంచే రావడం మరింత ఆకర్షణీయమైన అంశం. ఎకరంపై ఎంత లేదన్నా ఒక ఏడాదిలో రూ.30వేల వరకు వచ్చే అవకాశం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఎకరాకు ఇంత చొప్పున కనీస ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాయి. ఖర్చులు తీసేసి చూసినా సాగు భూములపై రాబడి 3–5 శాతం మధ్య ఉంటోంది.

భూములు పెద్ద మొత్తంలో ఉంటే వచ్చే రాబడి ఇంకా ఎక్కువగానూ ఉంటుంది. పైగా అందులో ఏం సాగు చేస్తున్నారు, వాటిని విక్రయించడం ఎలా? డిమాండ్‌ పరిస్థితులు కూడా రాబడులను నిర్ణయిస్తాయి. కొనుగోలు చేసిన వ్యవసాయ భూమిని ప్రకృతి సిద్ధమైన సహజ సాగుకు (ఆర్గానిక్‌) అనుకూలంగా మార్చారనుకోండి రాబడులను ఇంకా పెంచుకోవచ్చు. ఇది కొనుగోలు దారుల నుంచి డిమాండ్‌ను సైతం పెంచుతుంది.

నీటి వసతి, ఇతర సదుపాయాలను కల్పించడం ద్వారానూ  మీ భూమికి డిమాండ్‌ను పెంచుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో తక్కువ దిగుబడులను ఇచ్చే భూములున్నాయి. వాటిని ఆర్గానిక్‌ ఫార్మిం గ్‌ లేదా పారిశ్రామిక యోగ్యమైన భూములుగా మార్చడం అన్నది మంచి ఆలోచనే. తద్వారా అధిక రాబడులకు దారి కల్పించుకోవచ్చు.

రహదారుల అభివృద్ధి, ప్రత్యేక ఆర్థిక మండళ్ల కోసం ప్రభుత్వం సమీకరించే భూములకు చెల్లించే పరిహారం కూడా ఇటీవలి కాలంలో గణనీయంగానే పెరగడం గమనార్హం. ఎందుకంటే భూసమీకరణ చట్టం కింద సమీకరించే భూమికి మార్కెట్‌ ధర కంటే రెండింతలు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి అదనంగా గ్రామీణ ప్రాంతాల్లో భూ సమీకరణ కారణంగా ఇతర నష్టాలు ఏవైనా ఉంటే వాటిని కూడా భూ యజమానికి చెల్లించాలని చట్టం చెబుతోంది.  

వైవిధ్యానికి అవకాశం
ప్రతీ పెట్టుబడికి సంబంధించి అనుకూలతలు, రిస్క్‌లన్నవి సర్వ సాధారణం. కనుక సాగు భూమిపై పెట్టుబడి అన్నది పెట్టుబడుల సాధనాల పరంగా మంచి వైవిధ్యానికి అవకాశం కల్పిస్తుంది. కనీసం 10 ఏళ్లు అంతకంటే ఎక్కువ కాలం పాటు కొనసాగించేవారికి ఇది మంచి సాధనమే అవుతుంది. పెట్టుబడే కాకుండా సాగు పట్ల ఆసక్తి కూడా ఉంటే అదనపు రాబడులకు ఇం దులో వీలుంటుంది.

సమీప పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తూ వారాంతాల్లో వచ్చి సాగును పర్యవేక్షించుకునే వారికి కూడా అనుకూలమే. ఇక వ్యవసాయమే మా నూతన కెరీర్‌ అనుకునే వారికి మంచి మార్గమే అవు తుంది. కాకపోతే తగిన నైపుణ్యాల కోసం, ఎక్విప్‌మెంట్‌ కోసం కొంత పెట్టుబడి అవసర పడుతుంది. అయితే, ఇవి ఒక్కసారి చేసే ఖర్చు లే. అన్ని గాడిన పడితే మంచి రాబడులు అందుకోవచ్చు. పెట్టుబడికి అయినా.. సాగు పట్ల ఉన్న ఆసక్తి కోసం అయినా వ్యవసాయ భూమిని కొనుగోలు చేయడానికి ముందు నిపుణుల సూచనలు, సలహాలు తీసుకోవడం  మంచిది.

రిస్క్‌లూ ఉన్నాయ్‌..
ఇన్ని లాభాలు ఉన్నాయని చెప్పి వ్యవసాయ భూములపై పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకునే ముందు పరిగణనలోకి తీసుకోవాల్సిన సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి. సరైన భూ రికార్డులు లేకపోవడం, తండ్రులు, తాతముత్తాతల పేరు మీద భూములు ఉండి, వారసులు అనుభవిస్తున్నట్టయితే.. చట్టబద్ధంగా వారసులకు సంబంధించి డాక్యుమెంట్లు ఉన్నాయా ఇత్యాది అంశాలను పరిశీలించాలి. ఇంటి ప్లాట్‌ మాదిరిగా కొని వదిలేయడం కాకుండా.. వ్యవసాయ భూమికి నిర్వహణ బాధ్యతలు కూడా ఉంటాయి.

అందుకు కొంత ఖర్చులు కూడా అవుతాయి. సాగు చేస్తున్నట్టయితే వాతావరణ పరిస్థితులు, ఉత్పత్తికి మార్కెట్లో ఉండే డిమాండ్, ధరలు, రవాణా ఖర్చులు ఇత్యాది అంశాలు రాబడులపై ప్రభావం చూపిస్తాయి. ఒకవేళ కొత్తగా వ్యవసాయంలోకి అడుగుపెట్టిన వారు అయితే.. కూలీల ఖర్చులు, ఎక్విప్‌మెంట్‌ కోసం పెట్టుబడులు ఇత్యాదివన్నీ భరించాల్సి వస్తుంది. కుదురుకునే వరకు కొన్ని సంవత్సరాల పాటు నష్టాలు రావచ్చు. పూర్తి అవగాహన ఏర్పడి, అన్నింటినీ సవ్యంగా నిర్వహించగలిగితే మంచి లాభాలు చవిచూస్తారు.  

ఇక ఏదైనా ప్రాజెక్టు వస్తుందని, ఆ ప్రాజెక్టు కింద భూ సమీకరణలో పాల్గొనడం ద్వారా లాభపడాలన్న ఆకాంక్షతో భూమి కొనుగోలు చేసినట్టయితే.. అందుకు కొన్నేళ్ల పాటు ఆగాల్సి రావచ్చు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో భూ సమీకరణ చేసి డబ్బులు చెల్లించే దశలో కొందరు కోర్టులను ఆశ్రయిస్తుంటారు. అటువంటి సందర్భాల్లోనూ జాప్యానికి దారితీస్తుంది. ఇక రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడి అంటేనే లిక్విడిటీ పాళ్లు తక్కువ. అంటే అవసరమైన వెంటనే అమ్మి డబ్బు చేసుకోవడానికి అవకాశాలు తక్కువ. మీరు ఆశించే ధరకు కొనుగోలుదారులు ముందుకు రావడానికి ఒక్కోసారి నెలలు, సంవత్సరాలు కూడా పట్టొచ్చు. వీటికి సంబంధించి న్యాయ, లావాదేవీ తదితర ఖర్చులు కూడా భరించాల్సి ఉంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement