
Daily Stock market: ఉక్రెయిన్ కేంద్రంగా నాటో, రష్యాల మధ్య నెలకొన్న వివాదం మరింత తీవ్రమైంది. దీని ప్రభావం నేరుగా స్టాక్ మార్కెట్‌పై మంగళవారం కనిపించింది. ఉక్రెయిన్ విషయంలో ఇటు రష్యా, అటూ అమెరికా వెనక్కి తగ్గకపోవడంతో యుద్ధం తప్పదనే పరిస్థితి నెలకొంది. దీంతో ఇన్వెస్టర్లు మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. మరోవైపు ఈ వివాదం కారణంగానే విదేశీ మార్కెట్లు సైతం అతలాకుతలం అవుతున్నాయి.
క్రితం రోజు బీఎస్‌ఈ సెన్సెక్స్ 57,683 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ రోజు ఉదయం మార్కెట్ ప్రారంభం కావడంతోనే నష్టాలు మొదలయ్యాయి. మొదటి పది నిమిషాల లోపే బీఎస్‌ఈ సెన్సెక్స్ ఏకంగా 1261 పాయింట్లు నష్టపోయింది. మరోవైపు నిఫ్టీ సైతం 358 పాయింట్లు నష్టపోయింది. ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి తీవ్రమైంది. దీంతో నిఫ్టీ 17 వేల దిగువకు చేరుకోగా సెన్సెక్స్ 57 వేల కిందకు పడిపోయింది.
ఉదయం 9:20 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్ 916 పాయింట్ల నష్టంతో 1.59 శాతం క్షీణించి 56,767 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 287 పాయింట్లు నష్టంతో 1.67 శాతం క్షీణించి 16,919 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. స్మాల్, మిడ్, లార్జ్ క్యాప్ షేర్లలో అమ్మకాలు కొనసాగుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. అయితే ఉక్రెయిన్ వివాదంపై ఈ రోజు ఐక్యరాజ్య సమితి భద్రత మండలి అత్యవసర సమావేశం నిర్వహిస్తామని ప్రకటించింది. దీంతో మార్కెట్ నష్టాలకు కొంతైనా బ్రేక్ పడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment