న్యూఢిల్లీ: కోవిడ్-19 కొత్త వేరియంట్ ఓమిక్రాన్ దేశంలో వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ, ఆర్‌బీఐ, ఈపీఎఫ్ఓలు ముఖ్యమైన తేదీల గడువును పొడగిస్తూ ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) కెవైసీ అప్‌డేట్ విషయంలో బ్యాంకులకు విధించిన గడువును మార్చి 31, 2022 వరకు పొడగిస్తున్నట్లు పేర్కొంది. ఆర్‌బీఐతో పాటు ఆదాయపు పన్ను శాఖ, ఈపీఎఫ్ఓ కూడా కొన్ని కీలక నిర్ణయం తీసుకున్నాయి. అవేంటి ఇప్పుడు తెలుసుకుందాం..
ఈపీఎఎఫ్‌ఓ ఈ-నామినేషన్
ఈపీఎఎఫ్‌ఓ తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. డిసెంబరు 31 తరువాత కూడా ఈ-నామినేషన్ చేయవచ్చు అని ఈపీఎఫ్ఓ తన ట్విటర్ వేదికగా తెలిపింది. గత కొద్ది రోజుల నుంచి చందాదారుల తమ సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివరాలను జత చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికి, ఈపీఎఫ్ఓ పోర్టల్ సర్వర్ డౌన్ సమస్య కారణంగా చందాదారులు అసౌకర్యానికి గురి అయ్యారు. ఈ సమస్య గురించి ట్విటర్ వేదికగా ఖాతాదారులు ఇచ్చిన ఫిర్యాదును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్ఓ తెలిపిన వివరాల ప్రకారం చందాదారులు డిసెంబరు 31 తర్వాత కూడా ఈ-నామినేషన్ దాఖలు చేయవచ్చు.
(చదవండి: పన్ను చెల్లింపుదారులకు కేంద్రం షాక్..!)
ఐటీఆర్ ఈ-వెరిఫై
2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆన్‌లైన్‌లో తమ ఆదాయపు పన్ను రిటర్ను(ఐటీఆర్)లను ఈ-వెరిఫై చేయని పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ మరో అవకాశం కల్పించింది. ఐటీఆర్‌లను వెరిఫై చేయడానికి ఐటీ శాఖ ఈ ఏడాది డిసెంబర్ 21 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు గడువును పొడిగించింది. చట్టం ప్రకారం.. డిజిటల్ సంతకం లేకుండా దాఖలు చేసిన ఐటీఆర్‌లను ఆధార్ ఓటీపీ, నెట్ బ్యాంకింగ్, డీమ్యాట్ ఖాతా ద్వారా పంపిన కోడ్, ప్రీ వాలిడేటెడ్ బ్యాంక్ ఖాతా, ఏటిఎమ్ ద్వారా రిటర్న్ దాఖలు చేసిన 120 రోజుల్లోగా ఈ-వెరిఫై చేయాల్సి ఉంటుంది.
జీఎస్‌టీ వార్షిక రిటర్న్
2020-21 సంవత్సరానికి సంబంధించి వ్యాపార జీఎస్‌టీ వార్షిక రిటర్న్‌లను దాఖలు చేసే తేదీని ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. జీఎస్‌టీఆర్-9ను వార్షిక రిటర్న్‌గా జీఎస్‌టీ కింద నమోదైన పన్ను చెల్లింపుదార్లు సమర్పిస్తారు. జీఎస్‌టీఆర్-9, ఆడిటెడ్ వార్షిక ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ మధ్య రీకాన్సిలేషన్ స్టేట్‌మెంట్‌ను జీఎస్‌టీఆర్-9సీగా సమర్పిస్తారు. రూ.2 కోట్లకు మించి టర్నోవరు ఉన్న వ్యాపారులు జీఎస్‌టీఆర్-9ను సమర్పించడం తప్పనిసరి. రూ.5 కోట్లకు మించి టర్నోవరు ఉంటే.. జీఎస్‌టీఆర్-9సీని సమర్పించాల్సి ఉంటుంది.
కెవైసీ గడువు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) బ్యాంక్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్ తెలిపింది. కెవైసీ అప్‌డేట్ గడువును మార్చి 31, 2022 వరకు పొడగిస్తున్నట్లు పేర్కొంది. కోవిడ్-19 కొత్త రకం ఓమిక్రాన్ ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. గతంలో ఈ గడువు డిసెంబర్ 31, 2021 వరకు ఉండేది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం-2002, మనీ లాండరింగ్ నిరోధక(రికార్డుల నిర్వహణ) నియమాలు-2005 నిబంధనల పరంగా ఖాతాదారుల కెవైసీ అప్‌డేట్ ఆర్‌బీఐ 2016లో నియంత్రిత సంస్థలను ఆదేశించింది. కేవైసీ కేవలం బ్యాంకింగ్ లావాదేవీలకు మాత్రమే కాదు, నగదుతో ముడిపడి ఉన్న అన్ని లావాదేవీలకు కేవైసీ చేయాల్సి ఉంటుంది.
(చదవండి: యూజర్లకు యూట్యూబ్ భారీ షాక్!)
Comments
Please login to add a commentAdd a comment