ప్ర. బహుమతులను ఆదాయంగా పరిగణిస్తారా? – యం. రామ్ గౌడ్, నిజామాబాద్
జ. బంధువుల నుంచి వచ్చే బహుమతులను ఆదాయంగా పరిగణించరు. అంటే, ఎటువంటి పన్ను భారం ఉండదు. కానీ స్నేహితుల నుండి తీసుకుంటే అటువంటి మొత్తాన్ని ఆదాయంగా పరిగణిస్తారు. మీరు ముందుగా బంధువు నిర్వచనాన్ని తెలుసుకోవాలి. ఒక వ్యక్తికి సంబంధించి ఈ కింది వారు బంధువుల జాబితాలోకి వస్తారు.
1. జీవిత భాగస్వామి
2. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు
3. జీవిత భాగస్వామి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు
4. తల్లిదండ్రులు, వారి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు
5. అటు తరం, ఇటు తరం వంశస్థులు (ముత్తాత, తాత, నాన్న, కొడుకు, మనవడు, మునిమనవడు)
6. జీవిత భాగస్వామి యొక్క అటు తరం, ఇటు తరం వంశస్థులు
7. (2) నుండి (7)వరకు పేర్కొన్న వారి జీవిత భాగస్వాములు
బీరకాయ పీచు బంధుత్వం
ఒక విధంగా చెప్పాలంటే ‘బంధువు‘ నిర్వచనం అనేది దగ్గర వాళ్లందరినీ చుట్టబెట్టేస్తుందని చెప్పాలి. ఈ పరిధి దాటి వెళ్లకండి. ఎత్తేస్తే ఏడు చెక్కలయ్యే బంధువుల దగ్గరకి, బీరకాయ.. బెండకాయ పీచు చుట్టాలు..బాదరాయణ సంబంధాల జోలికి వెళ్లకండి. ఇక బంధువుల నుంచి వచ్చేవే కాకుండా మరికొన్ని బహుమతులకు కూడా మినహాయింపు ఉంది. ఒక వ్యక్తికి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 50,000 విలువ దాటి బహుమతులు వస్తే మొత్తం విలువ మీద ఎటువంటి బేసిక్ లిమిట్ లేకుండా ఆదాయంగా భావిస్తారు. కానీ ఈ కింది సందర్భాల్లో మినహాయింపు ఉంటుంది.
1. వివాహ సందర్భంలో
2. వీలునామా ద్వారా
3. ఇచ్చే వ్యక్తి (దాత) చనిపోయే సందర్భంలో
4. స్థానిక సంస్థలు, విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, వైద్య సంస్థలు, ట్రస్టులు మొదలైనవి ఇచ్చినవి (కొన్ని పరిమితుల మేరకు)
5.‘బదిలీ‘ కాని వ్యవహారాల నుండి వచ్చినవి అయితే, వ్యవహారం జరిపే ముందు తగిన జాగ్రత్త వహించాలి.
దాత ఎవరైనా సరే మూడు విషయాలు గుర్తుంచుకోవాల్సిన విషయాలు
1. దాత ఐడెంటిటీ (డమ్మీని సృష్టించకండి)
2. ఇచ్చే విషయంలో దాత సామర్థ్యం (దాతకు నిర్దిష్ట సోర్స్ ఉండాలి)
3. వ్యవహారానికి సంబంధించి సాక్ష్యాలు, ఆధారాలు ఇవి చూపించకపోతే, స్థాపించకపోతే ఈ మొత్తాన్ని మీ ఆదాయంగా పరిగణించే అవకాశం ఉంది.
ప్ర. ఆదాయపు పన్ను రిటర్నులలో ఏమేమి ఫారాలు దాఖలు చేయాలి? – మహ్మద్ ఖదీర్ బాషా, నల్గొండ
జ. ఒక్క వాక్యంలో చెప్పాలంటే రిటర్నులతో పాటు ఏ కాగితం దాఖలు చేయనక్కర్లేదు. ఇప్పుడు అమలవుతున్న నియమం ప్రకారం ఎటువంటి అటాచ్‌మెంటు ఇవ్వనవసరం లేదు. ఆన్‌లైన్‌లో వేసినా, ఆఫ్‌లైన్‌లో వేసినా ఇదే రూలు. అయితే, మీరు ఒక స్టేట్‌మెంట్ తయారు చేసుకోండి. అన్ని సోర్స్‌లకు సంబంధించి ఆదాయాలు, లెక్కలు, కాగితాలు, రుజువులు, సర్టిఫికెట్లు, టీడీఎస్ పత్రాలు, ట్యాక్స్ చలాన్లు, ఫారం 16, ఫారం 16 అ, ఫారం 26 అ , ధృవపత్రాలు, కన్ఫర్మేషన్ లెటర్లు, ఉత్తర ప్రత్యుత్తరాలు, ఈమెయిల్స్, బ్యాంకు అకౌంటు స్టేట్‌మెంట్లు, అగ్రిమెంట్లు, సేల్ డీడ్‌లు, డివిడెండు వారంట్లు .. ఇలా అవసరమైనవన్నీ భద్రపర్చుకోండి.
కేసీహెచ్ ఏవీఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment