రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో బ్యారెల్ క్రూడాయిల్ ధరలు ఏకంగా 140 డాలర్లకు ఎగబాకింది. పలుదేశాల్లో ఇంధన ధరలు భారీగా పెరిగినప్పటికీ భారత్‌లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. గతేడాది నవంబర్ 4 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు. ఎన్నికల ఫలితాలు తరువాత ధరలు పెరుగుతాయని భావించడంతో ఎన్నడూ లేనంతగా జనాలు పెట్రోలు, డిజీల్‌ను భారీగా నిల్వ చేసుకున్నారు. అయితే బడ్జెట్ రెండో విడత సమావేశాల నేపథ్యంలో ధరల పెంపుపై కేంద్రం వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు లేదు. అయితే బల్క్ కస్టమర్లకు చమురు సంస్థలు గట్టి షాకిస్తూ బాదుడు షురూ చేశాయి.
లీటరుకు రూ. 25 పెంపు..!
బల్క్ కస్టమర్లకు డీజిల్ రేట్లను భారీగా పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఒకేసారి లీటరు డీజిల్‌పై రూ.25 మేర పెంచేశాయి. రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 40 శాతం మేర పెరగడంతో ధరల పెంపు అనివార్యమైందని పలు సంస్థలు వెల్లడించాయి. కాగా పెట్రోల్ బంకుల్లో విక్రయించే డీజిల్ రిటైల్ ధరలు ప్రస్తుతానికి యథాతథంగా ఉండనున్నాయి.ప్రస్తుతం ముంబయిలో లీటరు బల్క్ డీజిల్ ధర రూ.122.05 ఉండగా.. రిటైల్ పెట్రోల్ బంకుల్లో రేటు రూ.94.14గా ఉంది. ఢిల్లీలో బల్క్ డీజిల్ ధర రూ.115 ఉంటే.. రిటైల్ ధర రూ.86.67 ఉంది.
బంకుల మూసివేత యోచనలో..!
బల్క్ డీజిల్ ధరలు భారీగా పెరగడంతో ప్రైవేట్ రిటైల్ కంపెనీలకు బంకుల నిర్వహణ కష్టంగా మారే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం ఉన్న ధరలతో ఇంధనాన్ని విక్రయించడం వల్ల రిటైలర్లకు భారీగా నష్టాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. నయారా ఎనర్జీ, జియో-బీపీ, షెల్ వంటి సంస్థలకు నష్టాలు భారీగా పెరగనున్నాయి. తక్కువ ధరకు ఇంధనాన్ని విక్రయించే బదులు.. బంకులను మూసివేయడమే మంచిదనే యోచనలో ఈ సంస్థలు ఉన్నాయని తెలుస్తోంది.
బస్సులకు ఇంధనం.. బంకుల్లోనే..
బల్క్ డిజీల్ ధరలు మార్కెట్ రేట్ల కన్నా అధికంగా ఉన్న నేపథ్యంలో.. బస్సులు సాధారణ పెట్రోల్ బంకుల్లోనే ఇంధనాన్ని నింపుకొంటున్నాయి. చమురు సంస్థల నుంచి నేరుగా పెట్రోల్, డీజిల్‌ను ఆర్డర్ చేసుకునే మాల్స్, ట్రావెల్స్ సర్వీసులు సైతం.. బంకులపైనే ఆధారపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్ బంకుల్లో ఇంధన విక్రయాలు భారీగా పెరిగాయి. దీంతో రిటైలర్లకు నష్టాలూ పెరుగుతున్నాయి.
చదవండి: తీవ్రమైన ఒత్తిడిలో కంపెనీలు..సామాన్యుడిపై బాంబు వేసేందుకు సిద్ధం..! వీటి ధరలకు రెక్కలు
Comments
Please login to add a commentAdd a comment