
న్యూఢిల్లీ: డ్రోన్ తయారీ కంపెనీ ఐడియాఫోర్జ్ టెక్నాలజీ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని ఐపీవోలో భాగంగా కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 48,69,712 షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు.
ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 50 కోట్లను రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు రూ. 135 కోట్లు, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌కు రూ. 40 కోట్లు చొప్పున వెచ్చించనుంది. 2007లో ఏర్పాటైన కంపెనీ దేశీయంగా మానవరహిత ఏరియల్ వాహనా(యూఏవీ)లను రూపొందిస్తోంది. తద్వారా ఈ విభాగంలో అతిపెద్ద కంపెనీగా నిలుస్తోంది. కంపెనీ కస్టమర్ల జాబితాలో సాయుధ దళాలు, పోలీసు, అటవీ శాఖలు, విపత్తు నిర్వహణా దళాలు తదితరాలున్నాయి.