Edelweiss MF CEO Radhika Gupta Success Life Story In Telugu - Sakshi
Sakshi News home page

MF CEO Radhika Gupta Life Story: ‘అవమానాలు భరించలేక కిటికిలోంచి దూకేద్దాం అనుకున్నా’

Published Tue, Jun 7 2022 11:18 AM | Last Updated on Tue, Jun 7 2022 1:40 PM

Edelweiss MF CEO Radhika Gupta Success Story - Sakshi

దేశ చరిత్రలో అతి పిన్న వయస్సులో ఓ కార్పొరేట్‌ కంపెనీకి సీఈవోగా నియమితులైన మహిళగా సంచలనం సృష్టించారు రాధిక గుప్తా. స్టాక్‌మార్కెట్‌ సర్వీసెస్‌ అందించే ఎడిల్‌వైజ్‌ ఎంఎఫ్‌ సంస్థకు సీఈవోగా ఎన్నికైనప్పుడు ఆమె వయస్సు కేవలం 33 ఏళ్లు. ఇలాంటి అదృష్టం ఉండాలంటే ఎంతో పెట్టిపుట్టాలని అనుకుంటారు. రాధిక గుప్తా కూడా అలాగే పెట్టి పుట్టింది అయితే అందం, ఐశ్వర్యంతో కాదు అవమనాలు, అవకరణాలతో ఆమె పుట్టి పెరిగింది. జీవితంలో తొలి అడుగు నుంచి ఎదురవుతున్న అవమానాలు ఎదుర్కొంటూ ఆమె సాగిస్తున్న విజయ ప్రస్థానం...

రాధికగుప్తా తండ్రి విదేశీ సర్వీసుల్లో పని చేశారు. రాధిక గుప్త తల్లి గొప్ప అందగత్తె, స్కూల్‌ టీచరుగా పని చేసే వారు. తండ్రి వృత్తిరీత్యా రాధిక బాల్యం, విద్యాభాస్యం అంతా ఢిల్లీ , పాకిస్తాన్‌, అమెరికా, నైజీరియాలలో జరిగింది.  కానీ రాధికకు పుట్టుకతోనే మెడలు కొంచె వంకరగా ఉండేవి. మాట్లాడుతున్నప్పుడు, కదులుతున్నప్పుడు అబ్‌నార్మల్‌గా కనిపిచేంది. దీంతో ఏ కొత్త ప్రాంతానికి వెళ్లినా ఆమెను వింతగా చూసేవారు. సౌందర్యవతైన ఆమె తల్లితో పోలిక తెస్తూ సూటిపోటీ మాటలతో రాధికగుప్తా మనసును గాయపరిచేవారు. ‘అంత అందమైన మహిళకి ఇలాంటి అమ్మాయి పుట్టడమేంటీ’ అంటూ ఆమె ముందే కామెంట్లు చేసేవారు. పైగా తండ్రి వృత్తిరీత్యా వివిధ దేశాల్లో ఉండాల్సి రావడం ఆమె మాట్లాడే భాష స్థానికుల భాషలా కాకుండా ఇండియన్‌ యాసలో ఉండటం ఆమెకు కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. రాధిక భాషను వెక్కిరిస్తూ కామెడీ కార్టూన్‌ క్యారెక్టర్ల పేర్లతో నిత్యం నరకం చూపించే మిత్ర బృందం రాధిక వెంట పడేది.

కేరాఫ్‌ పరాజయం
అడుగడుగునా అవమానాలు, చీత్కారపు చూపుల కారణంగా రాధికగుప్తాలో ఆత్మన్యూనతా భావం వయసుతో పాటే పెరిగిపోతూ వచ్చింది. డిగ్రీ పట్టా పుచ్చుకుని బయటకు వచ్చినా ఇన్‌ఫియారిటీ కాంప్లెక్స్‌ ఆమెను వదల్లేదు.  అమెరికాలో ఉద్యోగ వేటలో ఉంటూ ఏ ఇంటర్వ్యూకి వెళ్లినా పరాజయమే పలకరించేంది. అలా ఓ సందర్భంగా వరుసగా ఆరు ఇంటర్యూల్లో ఆమెను వద్దుపొమన్నారు.

ఎందుకీ జీవితం
చిన్నతనం నుంచి వెంటాడిన అవమానాలు, పెద్దయ్యాక ఎంతకీ వదలని అపజయాలతో మానసికంగా కుంగుబాటుకు గురైంది రాధిక గుప్త. ఓరోజు ఆలోచనల ఒత్తిడి తట్టుకోలేక తానుండే గది కిటీలోంచి దూకి చనిపోవాలని డిసైడ్‌ అయ్యింది. చివరి ప్రయత్నంగా తన స్నేహితురాలికి తన బాధను చెప్పుకుని తనువు చాలించాలనుకుంది.  అప్పుడు ఆమె వయస్సు 22 ఏళ్లు.

ఆఖరి ప్రయత్నం
రాధిక గుప్తా మానసిక పరిస్థితి గమనించిన ఆమె స్నేహితురాలు వెంటనే సైకియాట్రిస్ట్‌ దగ్గరికి తీసుకెళ్లింది. కొన్నాళ్లుగా అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో మరో ఇంటర్వ్యూ కాల్‌ వచ్చింది. ఇక తన జీవితంలో ఇదే ఆఖరి ఇంటర్వ్యూ.. మళ్లీ ఏ ఇంటర్వ్యూకి హాజరుకావొద్దనే లక్ష్యంతో రాధిక వెళ్లింది. ఈసారి ఆమె పట్టుదల ముందు అవమానాలు, దెప్పిపొడుపులు తలవంచాయి. అలా మెకెన్సీ కంపెనీలో ఉద్యోగం సాధించింది.

మరోసారి
పాతికేళ్ల జీవితం ప్రస్థానంలో దాదాపు 22 ఏళ్లు అవమానాలు, కన్నీళ్లు దిగమింగుతూ వచ్చి... అప్పుడప్పుడే ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకుపోతున్న రాధిక గుప్తాకు మరోసారి షాక్‌ తగిలింది. 2008లో ఏర్పడిన ప్రపంచ ఆర్థిక మందగమనంతో అనేక కంపెనీలు కుదేలయ్యాయి. రాధిక మీద కూడా ఆ ప్రభావం చూపింది. భారీ నష్టాల నుంచి తప్పించుకున్నా అమెరికాలో కట్టుకున్న కలల కోట కూలిపోయింది.

భారత్‌కి రాక
రెసిషన్‌ టైమ్‌లోనే నళిన్‌ మోనిజ్‌తో రాధికకు పరిచయం అయ్యింది. ఇద్దరు ఆర్థిక రంగంలో నిపుణులు. దీంతో ఒకరి మీద ఆధారపడకుండా వాళ్లిద్దరు కలిసి అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసులు సొంతంగా ఇండియాలో ప్రారంభించారు. ఆ తర్వాత మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అనతి కాలంలోనే ఈ దంపతుల పేరు మార్కెట్‌లో మార్మోగిపోయింది. దీంతో ఎడిల్‌వైజ్‌ అనే భారీ సంస్థ రాధికగుప్తా కంపెనీలో భారీ పెట్టుబడులు పెట్టి సొంతం చేసుకుంది.

నీకు ఏం తక్కువ?
ఎడిల్‌వైజ్‌ కంపెనీకి కొత్తగా బాస్‌గా ఎవరిని నియమించాలనే చర్చలు తీవ్రంగా జరుగుతున్న రోజుల్లో రాధిక గుప్తాకి ఆమె భర్త నుంచి ఊహించని ప్రతిపాదన ఎదురైంది. కొత్త సీఈవో నువ్వే ఎందుకు కాకూడంటూ ఆమె భర్త ప్రశ్నించాడు. ఈ కంపెనీకి మరింత ఎత్తులకు తీసుకెళ్లే తెలివితేటలు, సామర్థ్యం నీకున్నాయంటూ ఆమెపై నమ్మకం చూపించాడు. జీవితంలో ఎక్కువ కాలం అవమానాలు, ఛీత్కారాలే ఎక్కువగా ఎదుర్కొన్న రాధికకు భర్త మాటలు టానిక్‌లా పని చేశాయి.

సీఈవోగా రికార్డ్‌
భర్త అందించిన ‍ప్రోత్సాహంతో ఎడిల్‌వైజ్‌ మేనేజ్‌మెంట్‌ను నేరుగా కలుసుకుని సీఈవో పోస్టు పట్ల తనకు ఆసక్తి ఉన్నట్టు ధైర్యంగా చెప్పింది రాధిక. ఒక సీఈవోగా తనకు అనుభవం లేకపోయినా కంపెనీని మరింత ఎత్తులకు తీసుకెళ్లాలనే తపన ఉందంటూ ఆత్మవిశ్వాసం చూపించింది. ఇది జరిగిన రెండుమూడు నెలల తర్వాత 33 ఏళ్ల వయస్సుల్లో ఎడిల్‌వైజ్‌ వంటి ప్రతిష్టాత్మక కంపెనీకి రాధికా గుప్తా సీఈవోగా ఎంపికై రికార్డు సృష్టించింది. ఇప్పటికీ ఆ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తోంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, లేడీ ఎంట్రీప్యూనర్లకు రోల్‌మోడల్‌గా నిలుస్తోంది.

అదే నా ప్రత్యేకత
ఒకప్పుడు వంకరగా ఉన్న నా మెడ నాకో పెద్ద అవకరంలా అనిపించేంది. నాలోని లోపాన్ని ఎత్తి చూపుతూ ఎవరైనా ఏమైనా అంటే కుమిలిపోయేదాన్ని. ఆత్మవిశ్వాసం సన్నగిల్లేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అవును...? మెడ వంకర అన్నది నాలోని ప్రత్యేకత. మరీ మీలో ప్రత్యేకత ఏం ఉందంటూ ఎదురు ప్రశ్నించే స్థాయికి చేరుకున్నాను. అందుకే ఆమె జీవిత అనుభవాలతో లిమిట్‌లెస్‌ అనే పుస్తకాన్ని రాస్తున్నారు. అంతేకాదు ఆత్మన్యూనతతో బాధపడే వారిలో స్ఫూర్తి రగిలించేందుకు క్రమం తప్పకుండా తన అనుభవాలు వివిధ వేదికల మీద పంచుకుంటూ ఉంటారు.
 

చదవండి: రూ.3.5 కోట్ల జీతం బాగుంది కానీ జాబ్‌ బోరుకొడుతోంది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement