ఆత్మనిర్భర్‌ - డిఫెన్స్‌ షేర్లు కొనొచ్చా? | Expert opinions on Investment in defence equipment shares | Sakshi
Sakshi News home page

ఆత్మనిర్భర్‌ - డిఫెన్స్‌ షేర్లు కొనొచ్చా?

Published Tue, Aug 11 2020 2:06 PM | Last Updated on Tue, Aug 11 2020 2:10 PM

Expert opinions on Investment in defence equipment shares  - Sakshi

కేంద్ర రక్షణ శాఖ వారాంతాన 101 ప్రొడక్టుల దిగుమతులపై నిషేధాన్ని విధించేందుకు వీలుగా ముసాయిదాను సిద్ధం చేయడంతో డిఫెన్స్‌ పరికరాల తయారీ కంపెనీలు వెలుగులో నిలుస్తున్నాయి. 2020-24 మధ్య కాలంలో దశలవారీగా పలు డిఫెన్స్‌ పరికరాలు, ఆయుధాల దిగుమతులపై నిషేధాన్ని విధించాలని రక్షణ శాఖ భావిస్తోంది. తద్వారా దేశీయంగా తయారీ రంగానికి ప్రోత్సాహాన్నివ్వాలని చూస్తోంది. ఇప్పటికే నిషేధిత జాబితాలోని కొన్ని ప్రొడక్డులను దేశీ కంపెనీలు రూపొందిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. రానున్న 5-7 ఏళ్ల కాలంలో డిఫెన్స్‌ ఉత్పత్తులను సొంతంగానే రూపొందించుకునే సామర్థ్యాలను అందుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోంది. ప్రధాని మోడీ ప్రకటించిన ఆత్మనిర్భర్‌ ప్రణాళికలకు అనుగుణంగా దేశీయంగా డిఫెన్స్‌ ప్రొడక్టుల తయారీలో స్వయంసమృద్ధిని సాధించాలని రక్షణ శాఖ ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలు డిఫెన్స్‌ సంబంధ కంపెనీల షేర్లకు డిమాండ్‌ కనిపిస్తోంది. ఈ విభాగంపై మార్కెట్‌ నిపుణుల అభిప్రాయాలు చూద్దాం..

రూ. 4 లక్షల కోట్లు
రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రూపొందించిన తాజా నిషేధ జాబితాలో ఆర్టిలరీ గన్స్‌, ఎసాల్ట్‌ రైఫిల్స్‌, కార్వెటీస్‌, ఎల్‌సీహెచ్‌, రవాణా విమానాలు, రాడార్లు తదితర పలు ప్రొడక్టులు చేరినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. గత 5ఏళ్ల కాలంలో వీటి దిగుమతులపై రూ. 3.5 ట్రిలియన్లను వెచ్చించినట్లు యస్‌ సెక్యూరిటీస్‌కు చెందిన ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ నిపుణులు ఉమేష్‌ రౌట్‌ చెబుతున్నారు. వచ్చే 5ఏళ్ల కాలంలో డిఫెన్స్‌ తయారీలో రూ. 4 లక్షల కోట్లమేర అవకాశాలు లభించనున్నట్లు అంచనా వేస్తున్నారు.

పెట్టుబడులకు ఊతం
రక్షణ రంగ ఆయుధాలు, పరికరాలు, సాఫ్ట్‌వేర్‌ తదితర పలు విభాగాలలో దేశీ కంపెనీలకు ఇకపై భారీ అవకాశాలు లభించనున్నట్లు ఐసీఐసీఐ డైరెక్ట్‌ ఒక నివేదికలో అభిప్రాయపడింది. విదేశీ ప్రొడక్టులకు చెక్‌ పెట్టడం ద్వారా దేశీయంగా మేకిన్‌ ఇండియాకు ఊతమిచ్చేందుకే తాజా పాలసీని రూపొందించినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రక్షణ రంగ ఉత్పత్తులు, ఎగుమతుల ప్రోత్సాహక విధానం 2020 ద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, పెట్టుబడుల ప్రమోషన్‌, ఎస్‌ఎంఈలకు దన్ను, పరిశోధన, అభివృద్ధికి ప్రాధాన్యం వంటి అంశాలకు బూస్ట్‌ లభించనున్నట్లు వివరించారు. రానున్న ఐదేళ్లలో దేశీయంగా డిఫెన్స్‌ రంగ ఉత్పాదకతను రెట్టింపునకు పెంచే యోచనలో ప్రభుత్వమున్నట్లు పేర్కొంటున్నారు. 

బీఈఎల్‌, సోలార్‌..
తాజా డిఫెన్స్‌ పాలసీల ద్వారా పలు పీఎస్‌యూ, ప్రయివేట్‌ రంగ కంపెనీలకు లబ్డి చేకూరనున్నట్లు పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. పీఎస్‌యూలు..  భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌కు ఎయిర్‌ఫోర్స్‌, మిలటరీ విభాగాల నుంచి ఆర్డర్లు పెరిగే వీలున్నట్లు ఆషికా ఇంటర్నేషనల్‌ డెస్క్‌ నిపుణులు సంతోష్‌ యెల్లపు పేర్కొన్నారు. గ్రెనేడ్స్‌, మైన్స్‌ తదితర విభాగాలలో సోలార్‌ ఇండస్ట్రీస్‌కు పలు అవకాశాలు లభించనున్నట్లు అంచనా వేశారు. ఇదేవిధంగా సిమ్యులేటర్స్‌ విభాగంలో జెన్‌ టెక్నాలజీస్‌ లబ్ది పొందే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు.

సెంట్రమ్‌, ఆస్ట్రా..
పలు పరికరాలు, ఆయుధాల దిగుమతులపై నిషేధం కారణంగా దేశీయంగా సెంట్రమ్‌ ఎలక్ట్రానిక్స్‌, ఆస్ట్రా మైక్రోవేవ్, అపోలో మైక్రో సిస్టమ్స్‌ తదితర చిన్న కంపెనీలకు అవకాశాలు మెరుగుపడనున్నట్లు యస్‌ సెక్యూరిటీస్‌ నిపుణులు ఉమేష్ పేర్కొన్నారు. బీఈఎల్‌, హెచ్‌ఏఎల్‌, భారత్‌ డైమిక్స్‌, గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ వంటి భారీ కంపెనీలతో పోలిస్తే చిన్న సంస్థలు ఆర్‌ అండ్‌ డీపై అధికంగా దృష్టి పెట్టగలుగుతాయని అభిప్రాయపడ్డారు. దేశీయంగా తయారీకి ఊతం లభిస్తే ఈ కంపెనీలన్నిటికీ ప్రొక్యూర్‌మెంట్‌ వంటి వ్యయాలు తగ్గేందుకు వీలుంటుందని తెలియజేశారు. డిఫెన్స్‌ రంగంలో వివిధ విభాగాలు, విభిన్న కంపెనీలు కార్యకలాపాలను విస్తరించాయని ఇన్వెస్టర్లు పెట్టుబడి విషయంలో యాజమాన్యం, బ్యాలన్స్‌షీట్‌, ప్రొడక్టులపై పట్టు తదితర పలు అంశాలను పరిగణించవలసి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల బీఈఎల్‌, హెచ్‌ఏఎల్‌, సోలార్‌ ఇండస్ట్రీస్‌ తదితర పలు కంపెనీల షేర్లు ర్యాలీ చేసినట్లు తెలియజేశారు. ఎల్‌అండ్‌టీ, భారత్‌ ఫోర్జ్‌ వంటి దిగ్గజాలతోపాటు.. వాల్‌చంద్‌నగర్‌ తదితర విభిన్న కంపెనీలకు అవకాశాలు పెరిగే వీలున్నదని తెలియజేశారు. అయితే షేర్ల ధరలు దిద్దుబాటుకు లోనైనప్పుడు.. నిపుణుల సలహాలమేరకు దీర్ఘకాలిక ధృక్పథంతో మాత్రమే ఇన్వెస్ట్‌మెంట్స్‌ నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందని సూచిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement