ముంబై: గత వారం రెండున్నర శాతం దిద్దుబాటుకు గురైన దేశీయ సూచీల్లో ఈ వారం కొంత రికవరీ కనిపించవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అయితే అదానీ గ్రూప్ షేర్లలో కొనసాగుతున్న అమ్మకాలు, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని బలహీనతల కారణంగా భారీ లాభాలైతే ఉండకపోవచ్చు. అంతర్జాతీయ పరిణామాలు కీలకం కానున్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) డిసెంబర్ క్వార్టర్ జీడీపీ గణాంకాలు, ఫిబ్రవరి ఆటో అమ్మకాలు, తయారీ, సేవారంగ పీఎంఐ డేటాను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. అలాగే విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలు తదితర సాధారణ అంశాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు.
ఫెడ్ రిజర్వ్, ఆర్‌బీఐ కఠిన ద్రవ్య విధాన వైఖరి కొనసాగింపు సంకేతాలు, రష్యా – ఉక్రెయిన్– అమెరికా దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తెరపైకి రావడంతో సూచీలు గడిచిన ఎనిమిది నెలల్లో ఒకవారంలో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. మొత్తం ఐదు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,539 పాయింట్లు, నిఫ్టీ 478 పాయింట్ల చొప్పున క్షీణించాయి.
‘‘వరుస నష్టాల మార్కెట్ వచ్చే వారం గట్టెక్కే వీలుంది. అయితే అగ్రరాజ్యమైన అమెరికా మార్కెట్లలో కరెక్షన్ ఆందోళన రేకెత్తిస్తోంది. మొత్తంగా., సూచీలు ఒడిదుడుకులకు లోనవుతూ పరిమిత శ్రేణిలో ట్రేడవొచ్చు. సాంకేతికంగా నిఫ్టీ కీలక మద్దతు స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది. అమ్మకాలు కొనసాగి బడ్జెట్ రోజునాటి కనిష్ట స్థాయి(17,353)ని కోల్పోతే 17,050 –17,000 శ్రేణిలో తక్షణ మద్దతు లభించవచ్చు. అనుకున్నట్లే రికవరీ కొనసాగితే 17,750–17,800 పాయింట్ల పరిధిలో నిరోధం ఎదురయ్యే అవకాశం ఉంది’’ అని ఏంజెల్ వన్ సాంకేతిక నిపుణుడు రాజేశ్ భోంస్లే తెలిపారు.
బుధవారం డివ్గీ టార్క్‌ట్రాన్స్‌ఫర్ ఐపీవో
కొన్ని నెలల విరామం తర్వాత ప్రైమరీ మార్కెట్ మళ్లీ యాక్టివ్ అయ్యింది. ఆటోమోటివ్ ఉపకరణాల తయారీ సంస్థ డివ్గీ టార్క్‌ట్రాన్స్‌ఫర్ ఐపీవో మార్చి ఒకటిన మొదలవనుంది. శుక్రవారం ముగియనున్న ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ మొత్తం రూ.180 కోట్లను సమీకరించనుంది. ఇందుకు 39 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయానికి పెట్టింది. ధర శ్రేణిని సోమవారం కంపెనీ వెల్లడించనుంది.
కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు
దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతోంది. ఫెడ్ రిజర్వ్ మినిట్స్ వెల్లడి నేపథ్యంలో ఈ ఫిబ్రవరి 24 తేదీ నాటికి ఎఫ్‌ఐఐలు రూ.2,313 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించినట్లు ఎన్‌సీడీఎల్ డేటా చెబుతోంది. అయితే ఈ ఏడాది జన వరి విక్రయాలు రూ.28,852 కోట్లతో పోలిస్తే అమ్మకాలు భారీగానే తగ్గాయి.
‘‘అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు సంకేతాలు వెలువడిన నేపథ్యంలో వర్ధమాన మార్కెట్ల నుంచి ఎఫ్‌ఐఐ లు వైదొలుగుతున్నారు. అయితే దక్షిణ కొరి యా, తైవాన్, చైనా దేశాలు ఈక్విటీలు చౌకగా లభిస్తున్నందున ఇన్వెస్టర్లు ఈ దేశాల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహకర్త వీకే విజయ్‌కుమార్ తెలిపారు.
స్థూల ఆర్థిక గణాంకాలపై దృష్టి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్(క్యూ3) జీడీపీ గణాంకాలు ఈ మంగళవారం(ఫిబ్రవరి 28) కేంద్రం వెల్లడిస్తుంది. అదేరోజున జనవరి ద్రవ్యలోటు డేటా వెలువడుతుంది. మార్చి ఒకటిన(బుధవారం) ఆటో కంపెనీలు ఫిబ్రవరి హోల్‌సేల్ అమ్మకాల వివరాలు, ఫిబ్రవరి తయారీ పీఎంఐ డేటా వెల్లడి అవుతాయి. వారాంతాపు రోజైన శుక్రవారం సేవారంగ పీఎంఐ డేటా విడుదల అవుతుంది.
అదే రోజున ఆర్‌బీఐ ఫిబ్రవరి 24 తేదీన ముగిసిన వారం నాటి ఫారెక్స్ నిల్వలు డిసెంబర్ 19వ తేదీతో ముగిసిన బ్యాంక్ రుణాలు–డిపాజిట్ వృద్ది గణాంకాలను విడుదల చేయనుంది. ఇక అంతర్జాతీయంగా నేడు(సోమవారం) యూరోజోన్ ఫిబ్రవరి ఎకనామిక్స్, సర్విసెస్, పారిశ్రామిక సెంటిమెంట్ వివరాలు వెల్లడికానున్నాయి.
అమెరికా, యూరోజోన్‌తో పాటు ఇతర ప్రధాన దేశాల తయారీ రంగ డేటా మార్చి ఒకటిన(బుధవారం) విడుదల అవుతుంది. యూరోజోన్ ద్రవ్యోల్బణ డేటా మార్చి రెండో తేదీన వెల్లడి కానుంది. ఆయా దేశాలకు సంబంధించిన ఆర్థిక స్థితిగతులను తెలియజేసే ఈ కీలక స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment