ఫ్యాషన్‌ మార్కెట్‌ ఢమాల్‌ | Fashion brands sales dip in Covid-19 second wave | Sakshi
Sakshi News home page

ఫ్యాషన్‌ మార్కెట్‌ ఢమాల్‌

Published Fri, Jun 4 2021 2:26 AM | Last Updated on Fri, Jun 4 2021 2:26 AM

Fashion brands sales dip in Covid-19 second wave - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కోవిడ్‌–19 సెకండ్‌ వేవ్‌ అన్ని రంగాలనూ దెబ్బ తీసింది. ముఖ్యంగా ఫ్యాషన్‌ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. మొదటి వేవ్‌ నుంచి పరిశ్రమ కోలుకుంటున్న సమయంలో సెకండ్‌ వేవ్‌ ఒక్కసారిగా ముంచెత్తడంతో విక్రయాలు ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. దుస్తులు, పాదరక్షలు, సుగంధ పరిమళాలు, చేతి గడియారాలు, లెదర్‌ వస్తువులు, యాక్సెసరీస్‌.. వస్తువు ఏదైనా గతంలో వీటి కోసం ఇబ్బడిముబ్బడిగా ఖర్చు చేసిన కస్టమర్లు ఇప్పుడు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. విక్రయాలు తగ్గడంలో వర్క్‌ ఫ్రం హోమ్‌ ప్రభావమూ ఉంది.  

అత్యవసరాలకే ప్రాధాన్యత..
మహమ్మారి లక్షలాది కుటుంబాలను ఆర్థిక కష్టాల్లోకి నెట్టింది. దీంతో ప్రజలు అత్యవసరాలకే ప్రాధాన్యత ఇస్తుండడంతో ఫ్యాషన్‌ మార్కెట్‌ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. సెకండ్‌ వేవ్‌ దెబ్బకు దాదాపు 49 శాతం మంది ఆర్థిక కష్టాలతో సావాసం చేస్తున్నట్లు       వే2న్యూస్‌ ఇటీవలి సర్వేలో తేలింది. విపరీతంగా పెరిగిన ఆస్పత్రి ఖర్చులు, ఉద్యోగాలు కోల్పోవడం, సరైన వేతనాలు లేక, జీతాల్లో కోత పడటంతో కొనుగోలు శక్తి తగ్గిందని కస్టమర్లు తెలిపారు. పౌష్టికాహారం, ఇంటి అవసరాలు, పరిశుభ్రత ఖర్చులు పెరిగినట్లు వారు చెప్పారు. ఫ్యాషన్‌ రంగంలోని రిటైలర్లకు కోవిడ్‌–19 ముందస్తు స్థాయి రికవరీకి రెండేళ్లు పడుతుందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా ఇటీవలి తన నివేదికలో వెల్లడించింది. డిసెంబర్‌ త్రైమాసికంలో 70 శాతం అమ్మకాలు నమోదు చేసిన    పరిశ్రమ.. మార్చి నుంచి ఒక్కసారిగా కరోనా కేసులు పెరగడంతో కుప్పకూలిందని తెలిపింది.

రద్దు అవుతున్న ఆర్డర్లు..
సాధారణ విక్రయాలతో పోలిస్తే ఏప్రిల్‌లో అమ్మకాలు 25 శాతం లోపే నమోదయ్యాయని క్లాతింగ్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. 50 శాతంపైగా ఆర్డర్లు రద్దు అయ్యాయని, బాకీలు 25 శాతంలోపే వసూలు అవుతున్నాయని వెల్లడించింది. దీనినిబట్టి రిటైల్‌ మార్కెట్లో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. లెనిన్‌ దుస్తులు, పర్ఫ్యూమ్స్, లెదర్‌ వస్తువులు, యాక్సెసరీస్‌ అమ్మకాలు దాదాపు లేనట్టేనని విక్రేతలు అంటున్నారు. దుస్తుల అమ్మకాలు 10–15 శాతం మించట్లేదని వారు అంటున్నారు. రెండేళ్ల వరకు పరిశ్రమకు ఇబ్బంది తప్పదని సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్స్‌ చైర్మన్‌ మావూరి వెంకటరమణ సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. వ్యయాలను నియంత్రించడం ద్వారా నష్టాలను తగ్గించుకోవడం తప్ప మరో మార్గం లేదన్నారు.  

చిన్న బ్రాండ్స్‌ కనుమరుగు..
దేశంలో ఫ్యాషన్‌ మార్కెట్లో తయారీతోపాటు విక్రయంలో 10 శాతం కంపెనీలు ఉన్నట్టు సమాచారం. 90 శాతం కంపెనీలు మార్కెటింగ్‌కే పరిమితమయ్యాయి. ఇక బ్రాండ్‌ ఔట్‌లెట్ల విషయంలో కంపెనీల నిర్వహణలో 35 శాతం దుకాణాలు ఉన్నాయి. మిగిలినవి ఫ్రాంచైజీలు నిర్వహిస్తున్నారు. బ్రాండ్‌ వాల్యూ, బ్రాండ్‌ ఈక్విటీ, ప్రకటనల వాటా, ప్రమోషన్స్‌ పేరుతో లక్షలాది రూపాయలు ఫ్రాంచైజీలు చెల్లించుకోవాలి. ఇంత పెద్ద మొత్తంలో వ్యయం చేసి ఔట్‌లెట్లను తెరిచిన ఫ్రాంచైజీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నగదు చెల్లించి కొనుగోలు చేసిన స్టాక్‌ అమ్ముడుపోకుండా పేరుకుపోయాయి. కస్టమర్లు ఆన్‌లైన్‌కు మళ్లడం, ఆఫ్‌లైన్‌ సేల్స్‌ లేకపోవడం, అద్దెల భారంతో వర్తకులు నష్టాలను మూటగట్టుకుంటున్నారని రిటైల్‌ రంగ నిపుణులు కలిశెట్టి నాయుడు తెలిపారు. సెకండ్‌ వేవ్‌ ప్రభావంతో చిన్న బ్రాండ్స్‌ కనుమరుగు అవుతాయని అన్నారు. నష్టాలను భరించగలిగే విక్రేతలు మాత్రమే నిలదొక్కుకుంటారని చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement