
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పటివరకు దేశీయ రియల్టీ రంగానికి కరోనా వైరస్ కలిగించిన నష్టం అక్షరాలా లక్ష కోట్లు. రోజు రోజుకూ ఈ లాస్ మరింత పెరుగుతుందని ప్రాపర్టీ డెవలపర్లు, కన్సల్టెంట్లు అభిప్రాయపడ్డారు. దేశీయ రియల్టీ ఎదుర్కొంటున్న కరోనా ప్రభావాన్ని అధిగమించడానికి, నష్టాలను తగ్గించడానికి ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించాలని క్రెడాయ్, నరెడ్కో సంఘాలు కేంద్రాన్ని కోరాయి. వ్యవసాయం తర్వాత అతిపెద్ద ఉద్యోగ అవకాశాల రంగం రియల్ ఎస్టేట్. లాక్‌డౌన్ నేపథ్యంలో నగదు కొరత తీవ్రమవుతున్న నేపథ్యంలో ఈ రంగంలోనూ ఉద్యోగుల తొలగింపు, వేతనాల తగ్గింపు వంటివి తప్పవని క్రెడాయ్ నేషనల్ చైర్మన్ జక్షయ్ షా తెలిపారు. లాక్‌డౌన్ కొనసాగే కాలాన్ని బట్టి తొలగింపు నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు.
25 శాతం తొలగింపులు..
అమ్మకాల క్షీణతతో కంపెనీలు చేసే మొదటి నిర్ణయం వేతనాల తగ్గింపే. లిక్విడిటీ కొరత కారణంగా డెవలపర్లు రుణాల చెల్లింపులు చేయడంలో డిఫాల్ట్ అవుతారు. ఫలితంగా కంపెనీలు దివాళ తీస్తాయి. దీంతో ఉద్యోగుల తొలగింపులు తప్పవని నరెడ్కో అధ్యక్షుడు నిరంజన్ హిర్‌నందానీ తెలిపారు. ప్రభుత్వం రియల్టీ రంగానికి ఉద్దీపన ప్యాకేజీ ప్రకటిస్తే.. కంపెనీలు దివాలా తీయడం, ఉద్యోగాలు కోల్పోవటం వంటివి జరగవని తెలిపారు. లాక్‌డౌన్ కంటే ముందు శ్రామిక శక్తిలో ఉద్యోగుల తొలగింపు 15 శాతంగా ఉంటే.. ప్రస్తుతమిది 25 శాతానికి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పారు.