ఆర్‌బీఐ ఎఫెక్ట్- ఫైనాన్షియల్‌ షేర్ల దూకుడు | Financial sector shares jumps on RBI panel recommendations | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ ఎఫెక్ట్- ఫైనాన్షియల్‌ షేర్ల దూకుడు

Published Mon, Nov 23 2020 2:29 PM | Last Updated on Mon, Nov 23 2020 3:17 PM

Financial sector shares jumps on RBI panel recommendations - Sakshi

ముంబై, సాక్షి: రిజర్వ్‌ బ్యాంక్‌ ప్యానల్‌ చేసిన తాజా ప్రతిపాదనలు దేశీ ఫైనాన్షియల్‌ రంగ కంపెనీలకు జోష్‌నిస్తున్నాయి. భారీ కార్పొరేట్‌ హౌస్‌లకు బ్యాంకింగ్‌ లైసెన్సుల మంజూరీ, ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంకులుగా మారేందుకు అవకాశం వంటి పలు ప్రతిపాదనలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చాయి. దీంతో స్మాల్‌ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలుసహా పలు ఫైనాన్షియల్‌ రంగ కౌంటర్లకు డిమాండ్‌ పెరిగింది. వెరసి ఈ రంగంలోని పలు లిస్టెడ్‌ షేర్లు భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..

పలు సంస్కరణలు
ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఎం.రాజేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటైన ప్యానల్‌ బ్యాంకింగ్‌ లైసెన్సులకు సంబంధించి పలు కీలక ప్రతిపాదనలు చేసింది. అర్హత కలిగిన అతిపెద్ద కార్పొరేట్‌ గ్రూప్‌లకు బ్యాంకింగ్‌ లైసెన్సులు, పేరున్న ఎన్‌బీఎఫ్‌సీలు బ్యాంకులుగా మారేందుకు అవకాశం, 15 ఏళ్ల తదుపరి ప్రమోటర్ల వాటా 26 శాతానికి పెంచుకునేందుకు అనుమతి తదితర పలు కీలక ప్రతిపాదనలు చేసింది. దీంతో ప్రధానంగా చిన్న బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ కౌంటర్లు జోరు చూపుతున్నాయి.

జోరుగా హుషారుగా
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఐడీఎఫ్‌సీ లిమిటెడ్‌ 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకి రూ. 40.20 వద్ద, ఉజ్జీవన్‌ స్మాల్‌ బ్యాంక్ 20 శాతం పెరిగి రూ. 40.40 వద్ద ఫ్రీజయ్యాయి. ఈ బాటలో ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్ ‌18 శాతం దూసుకెళ్లి రూ. 292ను తాకగా.. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంక్‌ 12 శాతం జంప్‌చేసి రూ. 38కు చేరింది. ఇకబజాజ్‌ హోల్డింగ్స్‌7 శాతం ఎగసి రూ. 3,215 వద్ద కదులుతోంది. తొలుత రూ. 3,250ను తాకింది. ఇక శ్రీరామ్‌ సిటీ యూనియన్‌ 5.5 శాతం పెరిగి రూ. 1,064 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1,098కు చేరింది. ఇతర కౌంటర్లలో శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్‌ 3.6 శాతం పెరిగి రూ. 968 వద్ద, ఆవాస్‌ ఫైనాన్షియర్స్‌ 3.6 శాతం లాభంతో రూ. 1548 వద్ద కదులుతున్నాయి. ఆవాస్‌ తొలుత రూ. 1,610 వరకూ ఎగసింది. ఇదేవిధంగా మ్యాక్స్‌ ఫైనాన్షియల్ 3 శాతం వృద్ధితో రూ. 636 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 648 వద్ద 52 వారాల గరిష్టాన్ని అందుకుంది. చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్‌ 2.5 శాతం లాభపడి రూ. 347 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 355ను అధిగమించడం ద్వారా ఏడాది గరిష్టాన్ని తాకింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement